హ్యాపీ బర్త్ డే నందమూరి కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్.. వారసత్వ కార్డ్ తో అడుగుపెట్టినా.. హీరోగా తనను తాను మలచుకున్న సెల్ఫ్ మేడ్ స్టార్. కామ్ గోయింగ్ గా కనిపించినా.. పని రాక్షసుడు అంటారు. సొంతంగా బ్యానర్ స్థాపించి తనకు తనే హిట్స్ ఇచ్చుకున్న రేర్ స్టార్. తండ్రికి తగ్గ తనయుడుగా తమ్ముడికి చేదోడుగా నిలుస్తోన్న అన్నగా ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు (జూలై 5) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు.

ఎన్టీఆర్ వారసుడుగా బాలయ్య భారీ హిట్స్ తో ఉన్న రోజుల్లోనే పెద్దాయన మనవలుగా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు. హరికృష్ణ తనయులుగా ఎన్టీఆర్ తన రేంజ్ ను చాలా త్వరగా మార్చుకున్నాడు. తర్వాత కళ్యాణ్ రామ్ కూడా స్వయంకృషితోనే నిలబడ్డాడు. బాలకృష్ణ హీరోగా నటించిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో బాల నటుడుగా కనిపించింది కళ్యాణ్ రామే. అతని చెల్లి పాత్రలో రాశి నటించడం విశేషం.

హీరోగా అరంగేట్ర చిత్రం ‘తొలిచూపులోనే’ ఆకట్టుకోలేదు. మలి సినిమా ‘అభిమన్యు’ సైతం మెప్పించలేదు. దీంతో తనే నిర్మాణం మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. సురేందర్ రెడ్డిని దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘అతనొక్కడే’ చిత్రం రూపొందించాడు. ఫ్యామిలీ, మాస్, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచి హీరోగానే కాదు.. నిర్మాతగానూ అద్భుతమైన పేరు తెచ్చింది. ‘అతనొక్కడే’ కళ్యాణ్ రామ్ చేసిన సాహసం అనే చెప్పాలి. అందుకే గొప్ప ఫలితం అందుకున్నాడు. ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన సురేందర్ రెడ్డి ఆ తర్వాత టాప్ డైరెక్టర్ గా మారాడు.

హీరోగా నిలబడేవాళ్లు.. జనానికే కాదు.. వాళ్లేంటో ఇండస్ట్రీకి కూడా తెలియజేయాలి. ‘అతనొక్కడే’ హిట్ తో కళ్యాణ్ రామ్ కోసం మళ్లీ బయటి నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. ఆ క్రమంలో వచ్చిన ‘అసాధ్యుడు’ కూడా ఆకట్టుకుంది. కొంత గ్యాప్ తర్వాత దర్శకుడు తేజ మరోసారి స్వీయదర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా చేశాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయిందీ చిత్రంతోనే.

కళ్యాణ్ రామ్ తనను తాను నిలబెట్టుకుంటూ కెరీర్ లో ఎదిగాడు. కొన్ని సినిమాలు పోయినా ఎప్పుడూ ధైర్యం చెడలేదు. ఈ కారణంగానే తెలుగు సినిమాకు మరో టాప్ డైరెక్టర్ ను అందించాడు. ‘పటాస్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుని.. అప్పటి వరకూ వచ్చిన ఫ్లాపులు మర్చిపోయేలా చేశాడు. ‘పటాస్’ నుంచి కళ్యాణ్ రామ్ కెరీర్ లో కొత్త కళ యాడ్ అయిందని చెప్పాలి. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కు ఖచ్చితంగా వైవిధ్యమైన సబ్జెక్ట్. భిన్నమైన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. అందుకే ప్రేక్షకులకూ కొత్తగా అనిపించింది. దీనికి తోడు కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా పటాస్ తో మళ్లీ తన నిర్మాణ సంస్థలో మరో బ్లాక్ బస్టర్ పడింది.

‘పటాస్’ ఇచ్చిన జోష్ తో రవితేజ హీరోగా తను పరిచయం చేసిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ‘కిక్-2’ చిత్రాన్ని నిర్మించాడు. ‘కిక్ -2’ అంచనాలు అందుకోలేదు. అలాగే తను హీరోగా చేసిన షేర్ తో పాటు.. పూరీ జగన్నాథ్ ను నమ్మి చేసిన ఇజమ్ సైతం ఇబ్బంది పెట్టాయి. నందమూరి అభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంబినేషన్ ‘జై లవకుశ‘. తమ్ముడు హీరోగా తాను నిర్మించిన సినిమా. కమర్షియల్ గా చాలా పెద్ద విజయం సాధించడమే కాదు.. ఎన్టీఆర్ లోని ది బెస్ట్ యాక్టర్ ను మరోసారి ఆవిష్కరించింది ‘జై లవకుశ’. ప్రస్తుతం తమ్ముడు ఎన్టీఆర్ తో ‘దేవర‘ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్.

హీరోగా మళ్లీ రూట్ మార్చాడు. ‘ఎమ్మెల్యే, నా నువ్వే, 118‘ చిత్రాలు చేశాడు. వీటిలో ‘118’ పూర్తిగా కళ్యాణ్ రామ్ ఇమేజ్ కు భిన్నమైన కథ. మంచి కథనం కూడా పడటంతో కమర్షియల్ గా విజయం సాధించింది. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. తర్వాత చేసిన ‘ఎంతమంచివాడవురా’ ఆకట్టుకోలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం మూస పాత్రలకు స్వస్తి చెప్పాడు. వైవిధ్యమైన కథలనే ప్రిఫర్ చేశాడు. ఈకోవలోనే వచ్చిన ‘బింబిసార‘ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించింది. ఈ సినిమాతో వశిష్టను దర్శకుడిగా పరిచయం చేశాడు.

‘బింబిసార’ తర్వాత ‘అమిగోస్’ అంటూ మరో ప్రయోగాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో త్రిపాత్రాభినయంతో మురిపించాడు కళ్యాణ్ రామ్. ఇక.. బ్రిటీష్ ఇండియా బ్యాక్‌డ్రాప్ లో ‘డెవిల్’గా వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కి జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించబోతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు, కొత్త దర్శకులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కళ్యాణ్ రామ్ కు.. బర్త్ డే విషెస్ తెలుపుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts