మహా సంగీత ఙ్ఞాని మాస్ట్రో ఇళయరాజా పుట్టినరోజు

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా. ఈరోజు (జూన్ 2) ఇళయరాజా పుట్టినరోజు.

స్వర రాజు ఇళయరాజా… ఇటు శాస్త్రీయ సంగీతాన్ని, అటు పాశ్చాత్య సంగీతాన్ని మధించిన స్వరకర్త. మన సంగీతంలో కూడా పల్లెజనం పాడుకునే గీతాలు … అదే జానపద గీతాలు, కర్ణాటక సంగీతంలోని లయబద్ధమైన ధ్వని విన్యాసాలు, లలితంగా సాగే స్వర కల్పనలు.. ఇలా రకరకాల స్వరాల దారులున్నాయి. ఆ దారుల్ని తన ప్రయోగశాలగా మార్చుకొని విశిష్టమైన బాణీల్ని అందించారు లయ రాజు ఇళయరాజా.

మాస్‌ పాటైనా, మెలోడీ సాంగ్‌ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా.. ఇది ఇళయరాజా సాంగ్‌ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు ఉంటాయి. శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్‌ మ్యూజిక్‌ని లింక్‌ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇదీ, పాటలంటే ఇవీ అని అందరిచేతా అనిపించేలా చేశారు ఇళయరాజా.

ఇళయరాజా ఒక సంగీత వారధి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ. కన్నడ, మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించారు. ఎక్కువగా తమిళ సినిమాలు చేశాడు. ఆయన సంగీతంవల్లే చాలా సినిమాలు విజయాన్ని సాధించాయనడంలో అతిశయోక్తి లేదు.

ఇళయరాజా స్వరరాగ గంగా ప్రవాహంలో మునకలేయని సంగీత అభిమాని దక్షిణాదిన లేడంటే అతిశయోక్తి కాదు. ఈ తరం సైతం ఇళయరాజా భాణీలు వింటూ పులకించిపోతుంది. తన స్వర రచనతో ఆనాటి యువతను వేర్రేతేలా చేశారు ఇళయరాజా. ట్యూన్స్ లో ,రిథమ్ లోనూ, రీ రికార్డింగ్ లోనూ తనదైన ప్రత్యేకమైన ముద్రని సష్టించుకున్న మహానుభావుడు ఇళయరాజా.

పెద్ద హీరో చిన్న హీరో అన్న తేడా లేకుండా కథ నచ్చితే వెనకాముందు ఆలోచించకుండా బాణీలు కడతారు ఇళయరాజా. ఆయన స్వరాల ఆసరాతో తెలునాట ఎందరో తారలుగా వెలుగొందారు. సినీ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన సంగీత బ్రహ్మ ఇళయరాజా. 80,90లలో ఇళయరాజా హవా కొనసాగింది. సినిమా రిలీజ్ టైమ్ లో హీరోకు దీటుగా ఇళయరాజా కటౌట్స్ పెట్టిన సందర్భాలు చాలానే వున్నాయి.

సంగీత దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నాలుగున్నర దశాబ్దాలవుతున్నా.. ఇప్పటికే అదే తనపతో సినిమాలకు సంగీతాన్నందిస్తున్నారు స్వర రాజా ఇళయరాజా. ఈ లయ రాజు మునుముందు మరిన్ని అద్భుతమైన పాటలను అందించాలని ఆకాంక్షిస్తూ మాస్ట్రోకి బర్త్ డే విషెస్ అందిస్తుంది ‘తెలుగు 70 ఎమ్.ఎమ్’.

Related Posts