సినిమా కష్టాలను సీఎం జగన్ కు వివరించా – చిరంజీవి

ఏపీలో టికెట్ రేట్లు సహా ఇతర టాలీవుడ్ సమస్యలను ఏపీ సీఎం జగన్ కు వివరించినట్లు మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిసిన చిరంజీవి..అనంతరం ముఖ్యమంత్రితో కలిసి లంచ్ చేశారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరేప్పుడు మీడియాతో మాట్లాడారు. సినిమా అంటే గ్లామర్ ప్రపంచం మాత్రమే కాదని, ఎంతోమంది రోజువారీ ఆదాయంతో బతికే సినీ కార్మికులు, వారి జీవితాలను గురించి ఆలోచించాలని సీఎంకు చెప్పినట్లు చిరంజీవి అన్నారు. టికెట్ రేట్ల తగ్గింపుతో థియేటర్ కనుమరుగు అయ్యే పరిస్థితులు ఉన్నాయని సీఎం జగన్ కు చెప్పినట్లు చిరు తెలిపారు. తమ సమావేశం ఫలవంతంగా ముగిసిందని, వీలైనంత త్వరలో టాలీవుడ్ కు సీఎం శుభవార్త చెబుతారని చిరంజీవి అన్నారు.

May be an image of 2 people, people standing and indoor

చిరంజీవి మాట్లాడుతూ…సినిమా పరిశ్రమ పెద్దగా కాదు, ఇండస్ట్రీ బిడ్డగా సీఎంను కలిసేందుకు వచ్చాను. ఆయన నన్నొక్కరినే ఆహ్వానించారు కాబట్టి నేనొక్కడినే వచ్చాను. మా సమస్యలన్నీ ఆయనకు వివరించాను. సానుకూలంగా స్పందించిన సీఎం..త్వరలోనే ఉభయ పక్షాలకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు మాత్రమే కాదు వేలాది కార్మికుల జీవితాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాను. కోవిడ్ టైమ్ లో వాళ్లంతా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ రోజు వారీ వేతనాలే వారికి ఆధారం. పరిశ్రమ బాగుంటే వాళ్లంతా బాగుంటారు. ముఖ్యమంత్రితో సమావేశంలో మాట్లాడిన విషయాలు ఇండస్ట్రీ పెద్దలందరితో డిస్కస్ చేస్తాను. మరోసారి సీఎంను కలిసి పరిశ్రమ అభిప్రాయం తెలియజేస్తాను. జీవోను సవరించేందుకు ప్రయత్నిస్తామని సీఎం జగన్ చెప్పారు. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నింటికీ పుల్ స్టాప్ పడుతుంది. అన్నారు.