కాంతార ఇచ్చిన ఊపుతో మళ్లీ తెలుగులో డబ్బింగ్ సినిమాల దందా మొదలు కాబోతున్నట్టు కనిపిస్తోంది. కాంతార సినిమా అనూహ్యంగా పెట్టుబడికి మూడింతలు లాభాలు తెచ్చింది. దీంతో నిన్నటి వరకూ కాస్త డల్ గాఉన్న డబ్బింగ్ మార్కెట్ కు కొత్త ఊపొచ్చింది. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలను చిన్న, మధ్య తరగతి నిర్మాతలు విడుదల చేసేవారు. కొన్నాళ్లుగా టాప్ ప్రొడ్యూసర్సే డబ్బింగ్ సినిమాలను తెస్తున్నారు. అల్లు అరవింద్ తీసుకువచ్చిన కాంతార అందుకు మరో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి అరవింద్ ఇచ్చిన ఊపును, తెచ్చుకున్న లాభాలనూ తనూ సాధించాలనుకుంటున్నాడేమో.. ఈ సారి దిల్ రాజు కూడా డబ్బింగ్ సినిమాను తీసుకురాబోతున్నాడు. రాజు తెస్తున్నది ఓ తమిళ్ సినిమా. అతి చిన్న సినిమాగా వచ్చి ఇప్పుడు కోలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోన్న ఆ మూవీ లవ్ టుడే.లవ టుడే పేరుతో తెలుగులో అప్పట్లో ఉదయ్ కిరణ్‌ ఓ సినిమా చేశాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ లవ్ టుడే అనే మాటలతో విపరీతమైన మార్పులు తెచ్చింది స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ చుట్టూనే ఈ చిత్ర కథను రాసుకున్నాడు హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. ఇతను గతంలో జయం రవితో కోమలి అనే సినిమా డైరెక్ట్ చేశాడు.

అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ తనే నటించేవాడు. కోమలి పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా ఈ సారి తనే హీరోగా మారి ఈ లవ్ టుడే అనే చిత్రం తీశాడు. ఈ మూవీ కేవలం ట్రైలర్ తోనే యూత్ లో ఓ రేంజ్ లో వైబ్స్ క్రియేట్ చేసింది. అది ఓపెనింగ్స్ కు హెల్ప్ అయ్యి.. కంటెంట్ కూడా అదిరిపోవడంతో ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది.సింపుల్ గా చూస్తే ఈ కథలో హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ ఇద్దరూ హీరోయిన్ తండ్రి (సత్యరాజ్) వద్దకు వెళ్లి తమ పెళ్లి చేయమని అడుగుతాడు. అప్పుడతను.. మీ ఇంట్లో ఓకేనా అని హీరోను అడుగుతాడు. దానికి మా ఇంట్లో నా నిర్ణయానికి ఎవరూ ఎదురు చెప్పరు అంటాడు. బట్ ఇక్కడ నా నిర్ణయమే ఫైనల్ అన్న సత్యరాజ్..

ఒక కండీషన్ ఒప్పుకుంటే పెళ్లికి ఓకే అంటాడు. ఆ కండీషన్ ఏంటంటే.. ప్రేమికులిద్దరూ.. ఒక రోజంతా ఒకరి ఫోన్ ను మరొకరి వద్ద ఉంచాలి అని. మొదట ఒప్పుకున్నా.. తర్వాత ఇద్దరూ తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఆ టెన్షన్ లోనే ఇద్దరి ఫోన్స్ ఓపెన్ చేస్తే చాలా సీక్రెట్స్ తెలుస్తాయి. అలా ఇద్దరికీ గతంలో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్, గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారనేది తెలిసిపోతుంది. అలాగే.. వారి పర్సనల్ మేటర్స్ లో లవ్ కు లవర్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేదీ తెలిసిపోతుంది. కట్ చేస్తే విడిపోతారు. చివరికి కలిశారా లేదా అనేది తెరపై చూడాలి. బట్ ఈ తతంగం అంతా ఇప్పుడు యూత్ అనుభవిస్తున్నదే. అందుకే ఇది వారికి బాగా కనెక్ట్ అయింది. అసభ్యత లేకుండా కాంటెంపరరీ ఇష్యూను కామెడీ మిక్స్ చేసి డైరెక్ట్ చేసిన ప్రదీప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నవంబర్ 4నే విడుదలైన లవ్ టుడే ను నిజానికి తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు కొందరు. బట్ ఈ లోగానే దిల్ రాజు డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. మరి ఈ మూవీ మన ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

, , , ,