Advertisement
హ్యాట్రిక్ జోష్ న్యూ ఇయర్ కంటిన్యూ చేస్తుందా..?
Latest Movies Tollywood

హ్యాట్రిక్ జోష్ న్యూ ఇయర్ కంటిన్యూ చేస్తుందా..?

Advertisement
యేడాదంతా పదిసార్లు పడుతూ ఒక్కసారి లేస్తూ సాగింది సినిమా పరిశ్రమ ప్రయాణం. అప్పుడో సినిమా అప్పుడో సినిమా హిట్ అయితే.. మిగతావన్నీ ఫట్ మనే అన్నాయి. దీనికి ఆయా సినిమాలకు అస్సలే మాత్రం క్రేజ్ లేకపోవడం కూడా ఓ కారణం. ఉన్న చిత్రాలకు సంబంధించి ప్రమోషన్స్ కూడా మైనస్ అయ్యాయి. ఏకంగా దసరా వంటి పెద్ద సీజన్ కూడా టాలీవుడ్ ను బాగా నిరాశపరిచింది. మొత్తంగా ఇక ఈ యేడాదంతా పుష్పదే అనుకున్న టైమ్ లో అనూహ్యంగా డిసెంబర్ 2 నుంచే దందా మొదలైంది. అఖండతో బాలయ్య నట విశ్వరూపం చూపితే హ్యాట్రిక్ కాంబోగా వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిజంగా చెబితే ఇది పుష్ప కంటే కూడా(కమర్షియల్ గా) చాలా పెద్ద విజయం సాధించిందనే చెప్పాలి.
అఖండ ఇచ్చిన జోష్ టాలీవుడ్ కు మామూలుగా లేదు. పుష్ప పై ఎలాగూ ముందు నుంచే అంచనాలున్నాయి. వాటిని అందుకోవడంలో పుష్పరాజ్ కూడా నిరాశపరచలేదు. వరల్డ్ వైడ్ గా మంచి విజయం సాధించిందీ చిత్రం. ఇది కూడా హ్యాట్రిక్ కాంబోనే కావడం విశేషం. సుకుమార్, అల్లు అర్జున్ కాంబో క్రేజ్ ను డబుల్ చేస్తూ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది పుష్ప.
ఇక క్రిస్మస్ సందర్భంగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ అనిపించుకుంది. క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా వాళ్లు పోస్టర్ కూడా వేసుకున్నారు. వరుసగా ఒకే నెలలో మూడు బ్లాక్ బస్టర్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. అందుకే టాలీవుడ్ సరికొత్త జోష్ లో ఉంది. మరి ఈ జోష్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఒమిక్రాన్ పై ఆధారపడి ఉంటుంది.
కొత్త యేడాదిని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లేందుకు సునామీ లాంటి ఆర్ఆర్ఆర్ వస్తోంది. జనవరి 7 నుంచే టాలీవుడ్ తో పాటు ఇండియన్ మూవీ మార్కెట్ కు పూనకం తెప్పించేలా ఆల్రెడీ ప్రమోషన్స్ తో అంచనాలను ఆకాశంలో పెట్టిందీ చిత్ర టీమ్. దీంతో ఆర్ఆర్ఆర్ సృష్టించే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు అని అన్ని పరిశ్రమలూ అనుకుంటున్నాయి.
ఇక జనవరి 14న ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఉంది. మొన్నటి వరకూ యావరేజ్ అనుకున్నా.. ట్రైలర్ తర్వాత ఈ మూవీపైనా అంచనాలున్నాయి. వాటిని కాస్త లో ప్రొఫైల్ లో మెయిన్టేన్ చేస్తూ వస్తోంది మూవీ టీమ్. సంక్రాంతి సందర్భంగా కాబట్టి.. ఓపెనింగ్స్ కు ఢోకా ఉండదు. వాళ్లు చెప్పినట్టుగా ఇది నిజంగా ఇండియర్ వెర్షన్ ఆఫ్ టైటానిక్ అయితే మాత్రం ఇంక చెప్పేదేముందీ.. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది.
ఇక జనవరిలో భారీ చిత్రాలంటే ఇవే.. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి ఆచార్య మొదలుపెడతాడు. ఈ రెండు సినిమాలు ఇచ్చే ఉత్సాహం, ఊపును బట్టి ఫిబ్రవరిని అంచనా వేయొచ్చు. ఏదేమైనా 2021 డిసెంబర్ ఎండింగ్ ఇచ్చిన హ్యాట్రిక్ జోష్ ను జనవరి చిత్రాలు ముందుకు తీసుకువెళతాయా లేదా అనేది మాత్రం ఒమిక్రాన్ పై ఆధారపడి ఉందనేది నిజం.

Advertisement