ad

రాజమౌళి కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట. కానీ గొప్ప దర్శకుడు అనగలమా.. అంటే ఖచ్చితంగా అనలేం. ఆయన ఎప్పుడూ గొప్ప కథలు చెప్పలేదు. ఇంకా చెబితే రాజమౌళి సినిమాల్లో కథల కంటే కథన మాయలే ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ చుట్టూ అల్లుకున్నవే తప్ప.. ఒరిజినాలిటీ అస్సలు కనిపించదు. అయినా తన ‘టార్గెట్’ను చేరుకోవడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతున్నాడు కాబట్టి.. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని సందేహం లేకుండా అనొచ్చు. కానీ ఆ సక్సెస్ ఫార్ములా ఆర్ఆర్ఆర్ లో మిస్ అయిందనేది వాస్తవం. ఇంకా చెబితే బాహుబలితో ఓ చందమామ కథను చెప్పిన రాజమౌళి ఈ సారి ఫిక్షన్ స్టోరీతో ఫ్యాక్ట్స్ ను చంపేశాడు. పోనీ తన స్టైల్ లో ఎమోషన్స్ ను పండించాడా అంటే అది కేవలం సన్నివేశాలుగా ఉందే తప్ప.. బలమైన థ్రెడ్ కనిపించదు. అందుకే గ్రేట్ డైరెక్టర్ అనేది ఖచ్చితంగా రాజమౌళికి సరిపోయే పదం కాదు. అందుకు చాలా ఉదాహరణలే చెప్పొచ్చు. కానీ చివరగా వచ్చిన రెండు సినిమాల్లోని అంశాలనే చూద్దాం..
బాహుబలి నిస్సందేహంగా టెక్నికల్ గా మన సినిమా స్థాయిని పెంచింది. కానీ అందులో రాజమౌళి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయనేది ఒప్పుకుని తీరాల్సిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే లాక్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ తీసుకున్నాడు. అయితే ఈ సారి ఫస్ట్ పార్ట్ లా మిస్టేక్స్ చేయలేదు. తన నుంచి ఏం ఆశిస్తారో అన్ని అంశాలూ ఉన్నాయి. ప్రధానంగా బాహుబలి 2లో అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి. హృదయాలను బరువెక్కించే సన్నివేశాలున్నాయి. ఓ కమర్షియల్ కథకు కావాల్సిన అన్ని అంశాలూ ఉండేలా ఈ సారి జాగ్రత్తలు తీసుకున్నాడు. అనుష్కతో ప్రేమకథ, అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లు, బలమైన విలనిజం.. తనను పెంచిన తల్లే వెళ్లగొట్టేంతటి స్క్రీన్ ప్లే.. మంచి పాటలు.. వాటి చిత్రీకరణ .. వీటికి మంచి ప్రభాస్ ను చంపే సీన్.. కట్టప్ప తిరుగుబాటు.. ఇలా అన్ని అంశాలూ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అందుకే రెండో భాగం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. దేశవ్యాప్తంగా అతనికి తిరుగులేని క్రేజ్ వచ్చింది సెకండ్ పార్ట్ తర్వాతే అనేది కాదనలేని వాస్తవం.
అలాంటి సినిమా చేసిన రాజమౌళి ఈ సారి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అనౌన్స్ చేస్తే దాన్ని మించి ఎక్స్ పెక్ట్ చేస్తారు. దాన్ని మించడం అటుంచితే అసలు ఇలా ఉందేంటీ అనిపించే సినిమాతో వచ్చాడు.
కమర్షియల్ దే అయినా ఇది బలమైన కథ కాదు. అసలు అతను ఎంచుకున్న ఇద్దరు చారిత్రక వ్యక్తులను పోలిన వ్యక్తుల కలయికే సినిమా కోసం అన్నట్టుగా కృతకంగా ఉంది. కలిసిన తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ గానే ఇంటర్వెల్ ఫైట్ కనిపిస్తుంది. ఎక్కడో ఆదిలాబాద్ అడవుల నుంచి కిడ్నాప్ చేయబడిన పాప కోసం ఎన్టీఆర్ ఎందుకు అంత తాపత్రయ పడటం అనే పాయింట్ కు అసలు ఒక్క సీన్ కూడా లేదు. పైగా ఢిల్లీ పరిసరాల్లో జంతువులను పట్టుకుని అంత పెద్ద నగరంలో ఎవరికీ తెలియకుండా ఓ ఇంట్లో దాచడం హాస్యాస్పదం.. దాచడం ఓకే..కనీసం ఆ ఇంటి వరకూ ఎలా తెచ్చారు.. అనేదీ పూర్తిగా విస్మరించారు.
ఇక సెకండ్ హాఫ్ మరీ దారుణం.. పూర్తిగా రాజమౌళి మార్క్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. కొమురం భీముడో పాట తప్ప ఆకట్టుకున్నదేం లేదు. హీరోలిద్దరూ ఒకరిని ఒకరు కాపాడుకోవడానికే సగం సినిమా సర్దేశారు.
బాహుబలి2లో ప్రభాస్ కు బలమైన విలన్ ఉంటాడు. అత్యంత శక్తివంతుడైన రాజును సామాన్యుడుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఎంచుకున్న ఎత్తులన్నీ కథానుగుణంగా కుదిరాయి.
ఆర్ఆర్ఆర్ లోనూ అత్యంత బలమైన విలన్ ఉన్నాడు. కానీ అతన్ని బలహీనం చేశాడు రాజమౌళి. నాటి బ్రిటీష్ ప్రభుత్వం సాగించిన ఎన్నో దురాగతాలు అనేక సినిమాల్లోనే చూశాం.. అయినా రాజమౌళి మాత్రం తన హీరోలిద్దరికీ పెద్దగా అవరోధాలు పెట్టలేదు. చిన్న బాణం పుల్లలతో వందలమందిని చంపించడం అనే క్లైమాక్స్ ఎపిసోడ్ ఆసాంతం.. చిన్న పిల్లల కార్టూన్ ఛానల్స్ లో కనిపించే ఎపిసోడ్ లా ఉంది. అందుకే ఈ సినిమా అత్యంత కష్టంగా వెయ్యి కోట్ల వరకూ వచ్చింది.
ఎవరెన్ని చెప్పినా.. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రాజమౌళి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు హీరోల థ్రెడ్ ను కూడా బలంగా కలపలేదు. నాటు సాంగ్ లో డ్యాన్స్, కొమురం భీముడో పాటలో ఎమోషన్ తప్ప మిగతా పాటలేవీ ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ లో నేపథ్య సంగీతం పూర్తిగా మైనస్ గా మారింది. కానీ బాహుబలి2 విషయంలో ఇలాంటి మిస్టేక్స్ లేవు.
మొత్తంగా కథకు లింక్ అయిన సన్నివేశాలుంటేనే అది మంచి సినిమా అనిపించుకుంటుంది. కేవలం ఆయా పాత్రల ఎమోషన్స్ కు మాత్రమే పరిమితమైన ఎలివేషన్స్ ఉంటే మంచి సినిమా అనిపించుకోదు.
సో బాహుబలి2 వరకూ పైకి సాగిన రాజమౌళి గ్రాఫ్ ఆర్ఆర్ఆర్ తిరోగమనంలోకి వెళ్లింది. మరి ఇది ఇంకా వెనక్కే వెళుతుందా మళ్లీ మెయిన్ ట్రాక్ లోకి వస్తుందా అనేది ఓ పదేళ్లలోపు వచ్చే మహేష్ బాబు సినిమాతో తెలుస్తుంది.

, , , , , , , , , , , , , , , , , , ,