ad

కొన్ని కథలను దర్శకులు ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమమాటున దాన్ని నడిపించే స్క్రీన్ ప్లే విషయంలో పొరబాట్లు జరుగుతుంటాయి. లేటెస్ట్ గా భారీ అంచనాలతో వచ్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకున్న విరాటపర్వం చిత్రం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఎవరు కాదన్నా.. వెండితెరపై నక్సలిజం మంచి సేలబుల్ ఐటమ్. దాన్ని సరిగ్గా వినియోగించడంలోనే విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల పూర్తిగా తడబడ్డాడు. కేవలం సరళ అలియాస్ వెన్నెల పాత్రపైనే కాన్ సెంట్రేట్ చేయడంతో అసలు ఆమె లక్ష్యం ప్రేమ తప్ప విప్లవం కాదు అని సగటు ప్రేక్షకులు నిర్ధారణకు వచ్చారు. అలాంటప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ ఎందుకు.. ఎ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నా.. సింపుల్ లవ్ స్టోరీగా చెప్పేస్తే సరిపోయేది. ఆ నేపథ్యం విషయంలో దర్శకుడు పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయాడు. చేజేతులా సినిమాను డిజాస్టర్ చేసుకున్నాడు అనేది చాలామంది వెలిబుచ్చుతోన్న అభిప్రాయం.వెన్నెల పాత్ర కేవలం కవితలు చదివి అతనితో ప్రేమలో పడుతుంది. అంటే ఆ కవితల్లోని ఫైర్ కు కానీ.. వాటి అంతరార్థం కానీ ఆమెకు తెలియకుండానే ఉంటుందా..?

ఉంటే తను కూడా ఎంతో కొంత వర్గ స్పృహ కలిగి ఉంటుంది కదా..? ఆ వర్గ స్పృహతో తనూ అన్నల్లో కలిసి అక్కలా మారి తనలో ఈ ఫైర్ ను రగిలించిన అరణ్యను ప్రేమించవచ్చు. అలా చేయాలంటే ఈ కథను అరణ్య(రానా) కోణంలో చెప్పి ఉండాల్సింది. అతను నక్సలిజాన్ని ఎందుకు ఎంచుకున్నాడు..? ఎంచుకున్న తర్వాత తనలో ఆ నమ్మకాన్ని పెంచిన అంశాలేంటీ.. వారి పర్యవసానం వల్ల అరణ్యలో వచ్చిన మార్పులు అక్షరాయుధాలుగా ఎలా ఎందుకు మారాయి అనే కోణంలో చెబుతూ వెళితే వెన్నెల పాత్ర అరణ్య పై ప్రేమ లేదా అరణ్యంపై ప్రేమ పెంచుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉండేది. అదే టైమ్ లో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే కథ నడుస్తూ.. ఆ వర్గ స్పృహను రగిలిస్తూనే.. వెన్నెల వెళ్లిన ప్రతి చోటా ఓ పోలీస్ యాక్షన్ జరిగి ఉంటుంది కాబట్టి..

ఆమెపై అనుమానాలకు ఆస్కారం ఉండేది. తద్వారా తనలో ఎంత వర్గ స్పృహ ఉన్నా.. ఉద్యమానికి నష్టం అని భావించినప్పుడు(అది నిజమా కాదా అనే నిర్ధారణ లేకుండా అయినా సరే) ఆమెను హింసించి చంపి ఉంటే ఆ పాత్రపై ప్రేక్షకుల్లో సానుభూతి ఉండేది. అది సినిమా విజయానికి కారణమై ఉండది అనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి.కానీ దర్శకుడు ఎంత సేపు వెన్నెలపైనే ఫోకస్ పెట్టడంతో అసలు కథ అవుట్ ఫోకస్ అయింది. దీంతో కాసులు కురిపించాల్సిన ఈ కథ ఫైనల్ గా బ్లర్ కావడంతో కమర్షియల్ గా డిజాస్టర్ అనిపించుకుంది. అందుకే ఏ దర్శకుడైనా తను ప్రేమించిన కథను ప్రేక్షకుడు కూడా ఇష్టపడేలా రాసుకోవాలి తప్ప.. తను ఆ కథలో ప్రేమించిన పాత్రలను మాత్రమే రిజిస్టర్ చేయాలనుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా నీదీనాదీ ఒకే కథతో ప్రేక్షకుల మనసు గెలుచుకుని ఖచ్చితంగా తెలుగులో పాత్ బ్రేకింగ్ మూవీస్ తీస్తాడు ఈ దర్శకుడు అనిపించుకున్న వేణు రెండో సినిమాకే ఇలా బేజారు కావడం ఆశ్చర్యమే. మరి నెక్ట్స్ టైమ్ అయినా ఇలాంటి మిస్టేక్స్ లేకుండా వస్తాడేమో చూడాలి.

, , , , ,