ఎఫ్-2 మూవీ యూఎస్‌ రివ్యూ

కొంత గ్యాప్‌ తర్వాత విక్టరీ వెంకటేష్‌ నటించిన మరో మల్టీస్టారర్‌ మూవీ ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌..సింపుల్‌గా ఎఫ్‌-2. ఇప్పటిదాకా వెంకీ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వంటి బిగ్‌ స్టార్‌లతో నటిస్తే ఈ సారి ఆయన మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో స్క్రీన్‌షేర్‌ చేసుకున్నాడు.. పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌ వంటి సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో నటించిన ఎఫ్‌ 2 సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్‌ దగ్గరకు వచ్చింది.. వెంకటేష్‌ కామెడీ టైమింగ్‌, అనిల్‌ రావిపూడి క్రియేటివ్‌ ఇంటెలిజెంట్‌ కామెడీ కలిసింది..
సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లదే సందడి.. ఇదే క్యాప్షన్‌తో సినిమాని ఫన్నీగా కాస్త ఫ్రస్ట్రేషన్‌ యాడ్‌ చేసి మరీ తెరకెక్కించాడు అనిల్‌ రావిపూడి.. కొత్త అల్లుళ్ళు సందడి చేసే సంక్రాంతి పండుగ స్పెషల్‌గా వెంకీతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్‌ తేజ్‌. ఇప్పటి వరకు సంక్రాంతి రేస్ లో విడుదలైన వెంకీ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. మరి వరుణ్, వెంకీల ఫన్‌ నవ్వించిందా.??  ఫ్రస్టేష‌న్ విసుగెత్తించిందా..? కామెడీ పండించిందా.? టోటల్‌గా వాళ్ళు జనరేట్ చేసిన ఫన్ అండ్‌ ఫ్రస్టేషన్‌ ఆడియెన్స్‌ను ఏ రేంజ్ లో నవ్వించింది కథలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ… కథనం…:


‘ఎఫ్-2’ అనే టైటిల్ లోనే ఉంది ఫన్ అండ్ ఫ్రస్టేష‌న్… దాన్ని సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్ తమదైన శైలిలో పండించారు. సినిమాలో వెంకీ మరో సారి ముదురుపోయిన బ్రహ్మచారి పాత్రలో కనిపించాడు. పెళ్లి తరువాత ఇలా ఉంటాను.. అలా ఉంటాను అని బీరాలు పలికిన వెంకీకి పెళ్లి చేసుకున్న రోజు నుండే టార్చర్ మొదలవుతుంది. రఘుబాబు చెబుతున్నా వినిపించుకోకుండా పెళ్లి చేసుకొని వెంకీ కష్టాలు పడతాడు. వెంకీ సరసన జోడీ కట్టిన తమన్నా భర్తను టార్చెర్ చేసే భార్యగా చక్కగా నటించింది.

ఇక తమన్నా చెల్లెలు మెహ్రీన్ ని ప్రేమలో పడేయడానికి వరుణ్ తేజ్ పడిన కష్టం… ఆ సమయంలో వరుణ్ కి, వెంకీకి మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఫన్నీగా సాగాయి.  పెళ్ళైతే వచ్చే కష్టాల గురించి వెంకీ చెబుతున్నా వినకుండా మెహ్రీన్ ని పెళ్లి చేసుకొని వరుణ్ తేజ్ తంటాలు పడుతుంటాడు. పెళ్లి అయిన తరువాత ఆ ఇద్దరి తోడల్లుళ్ళ  ఫ్రస్టేష‌న్ తో సినిమా నాన్ స్టాప్ నవ్వులతో సాగుతుంది.

ఇక సెకండ్ హాఫ్ కి ముందు వచ్చే ఓ కుక్కతో సాగే పది నిముషాల సీన్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఒకవైపు కామెడీగా నవ్వులు పూయిస్తూనే మరోవైపు కన్నీళ్లు పెట్టిస్తుంది. ఫన్నీ సీన్స్ పండించడంలో వెంకీ దిట్ట అయిన వెంకీ తనదైన ఎమోషన్స్ తో జనాలను కట్టి పడేసాడు. ఇక వెంకీ తో పోటీ పడి వరుణ్ తేజ్ కూడా కామెడీని బాగానే పండించాడు.

విశ్లేషణ:


దర్శకుడు  అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్‌టయిన్‌మెంట్‌కి, హాస్యానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ సారి కామెడీనే ప్రధానంగా తీసుకుని ఆయన ‘ఎఫ్ 2’ సినిమాను చేశాడు. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సినిమా మొత్తం తన మార్క్ కామెడీ టైమింగ్ తో, నవ్వులతో నింపేశాడు.

ఇక వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్‌ తొలిసారి మాస్ పాత్రలో కనిపించి తెలంగాణ యాసతో మెప్పించాడు. చాలా ఏళ్ల  తరువాత వెంకీ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. వెంకీ – తమన్నా మధ్య కెమిస్ట్రీ, కామెడీని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు.  ఈ సినిమాలో తమన్నా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.  మెహ్రీన్, తమన్నా గ్లామర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

 ఇక కామెడీ విషయానికి వస్తే వెంకీ- తన తోడల్లుడు వరుణ్ తేజ్ ని బాగా డామినేట్ చేస్తూ నటించాడు. కామెడీ చేయడం వెంకీకి కొట్టిన పిండి కాబట్టి  వరుణ్ తేజ్ ఎంత ట్రై చేసినా డామినేషన్ కనిపిస్తూనే ఉంది. అసలు ఏ మాత్రం కామెడీ టచ్ లేని వరుణ్ తేజ్ ని వెంకటేష్ లాంటి సీనియర్ సరసన పెట్టడం సాహసమనే చెప్పుకోవాలి. సెంటిమెంట్ సీన్లలో పర్వాలేదనిపించినా కామెడీ విషయంలో మాత్రం వెంకీ రేంజ్ ని అందుకోలేకపోయాడు వరుణ్. అయితే సాంగ్స్ విషయంలో మాత్రం ఇద్దరికి సమానంగా పంచడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు అనిల్.

ముఖ్యంగా వెంకటేష్, తమన్నాల మధ్య వచ్చే  ‘ఎంతో ఫన్…’ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ల గ్లామర్ సినిమాకి కలిసొచ్చినా తెలుగు పండగ సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా కాబట్టి తెలుగుదనం ఉన్న హీరోయిన్లను తీసుకుంటే బాగుండేది అంటున్నారు. తమన్నా, మెహ్రీన్ ఎంత కష్టపడినా తెలుగు అమ్మాయిలాగా కనిపించలేదు.  స్క్రీన్ ప్లే కూడా బాగా కుదిరింది. కథలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ కామెడీతో, సెంటిమెంట్ సీన్స్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు. మొత్తంగా ‘ఎఫ్-2’ కుటుంబంతో కలిసి కడుపుబ్బా నవ్వుకునే సినిమా అని చెప్పొచ్చు. మరి, ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుందా..? లేదా..? అనేది చూడాలి..