లగడపాటి నా కొంప ముంచాడంటున్న కాంగ్రెస్‌ నేత..!!


తన ఓటమికి లగడపాటి సర్వేనే కారణమని అంటున్నాడు ఆదిలాబాద్ జిల్లా బొథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు. ఎన్నికల ముందు లగడపాటి చేయించిన సర్వే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లాభం చేయలేదు సరికదా తీవ్ర నష్టం చేసిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా బోథ్ నియోజకవర్గంలో లగడపాటి సర్వే ఓటర్లను గందరగోళానికి గురి చేసి తన ఓటమికి కారణమైందని బాపూరావు అసహనం వ్యక్తం చేసారు.

ఎన్నికల్లో తన ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో సమావేశమైన బాపు రావు లగపాటి సర్వే పై విమర్శలు గుప్పించారు. లగడపాటి సర్వేల పేరుతో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. పోలింగ్ కు పది రోజులు ముందు టికెట్లు ఖరారు చేయడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమైందని అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవలేకపోయామని, ప్రచారానికి సమయం కూడా లేకపోవడంతో ప్రజలు టిఆర్ఎస్ వైపు చూసారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటికే ఓడిపోయినట్టు కాదని, కేవలం వన్డే మ్యాచ్ లాంటి అసెంబ్లీ ఎన్నికలే ముగిశాయని, టి20 లాంటి స్థానిక ఎన్నికలు ఇంకా ముందున్నాయన్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో టీఆర్ఎస్ నేతలకు చూపించాలని అన్నారు. అందుకోసం నియోజకవర్గ స్థాయిలో అధిక సంఖ్యలో సర్పంచ్ లను, ఎంపీటీసీలను, జడ్పిటిసిలను గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు బాపురావు పిలుపునిచ్చారు.