వర్మ మరో వివాదం.. రెడ్డి ఒడలపై సంచలన కామెంట్స్‌

కాంట్రవర్శీలకు కేరాఫ్‌ అయిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా నిర్మించినా, డైరెక్ట్‌ చేసినా వివాదం కాకుండా మానదు.. తాజాగా ఆయన నిర్మిస్తోన్న భైరవ గీత సినిమాపైనా మరో వివాదం జారుకుంటోంది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందుతున్న భైరవగీత ఈనెల 22న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీకి సంబంధించి రిలీజ్‌ అయిన లేటెస్ట్‌ సాంగ్‌ కాంట్రవర్శీకి దారితీస్తోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

వందేమాతరం వందేమాతరం అంటూ సాగుతున్న పాటలో బానిస సంకెళ్లను తెంచుకునేందుకు తరతరాలుగా పోరాటం జరుపుతోన్న కొందరు పాడుతున్న విప్లవ గీతంలా సాగుతుంది. ఈ పాట భైరవగీత థీమ్‌ని తెలిపే సాంగ్‌. తమపై ఏళ్ల తరబడి సాగుతోన్న దొరల పెత్తనాన్ని, తమను వేధిస్తోన్న బానిస బతుకును తెంచుకొని స్వతంత్ర్యం కోసం పోరాటం చేసే కొందరు జీవితగాథ భైరవగీత..

ఈ పాటలో 40 సెకన్‌ల తర్వాత వినిపిస్తోన్న రెండు మూడు లైన్‌లు కాంట్రవర్శీకి లీడ్‌ చేస్తున్నాయని ఫిలిం క్రిటిక్‌లు చెబుతున్నారు. రెడ్డి దొరల ఒడలపైన గొడుగులెత్తము అనే లైన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రెడ్డి నాయకులు విరుచుకుపడుతున్నారు. ఇది ఒక క్యాస్ట్‌కి వ్యతిరేకంగా ఉందని, కేవలం రెడ్డి నేతలను టార్గెట్‌గా చేసుకున్నట్లు కనిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. తమ కులమే తెలుగు రాష్ట్రాలలో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్నట్లు, బడుగు కులాలను బానిస సంకెళ్లలో నింపినట్లు సాగిన ఈ పాటను నిషేధించాలని లేదంటే కొన్ని లైన్స్‌ను అయినా తొలగించడం లేదా మార్పులు చేయడం జరగాలని వారు సూచిస్తున్నారు. లేదంటే తాము తమ స్వరాన్ని మరింత పెంచుతామని వివరించారు. గీత రచయిత సిరా శ్రీ రాసిన ఈ పాటపై నిరసన గళం వినిపిస్తున్నారు రెడ్డి కులం యువకులు.

ఇటీవల విడుదలయిన అరవింద సమేత వీరరాఘవ సినిమా రాయలసీమను నెగిటివ్‌గా చూపించిందని, తాజాగా విడుదలకు రెడీ అవుతోన్న భైరవగీత ఆ ప్రాంతాన్ని మరింత నెగిటివ్‌గా చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దం క్రితం ముగిసిన ఈ ట్రెండ్‌ని మరోసారి తెరపైకి తేవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

కులాలను రెచ్చగొట్టి సినిమాలు చేయడం వర్మకు ఇదే తొలిసారి కాదని గతంలో బెజవాడ, వంగవీటి సినిమాలలోనూ కమ్మ, కాపు పదాలతో ప్రయోగాలుచేసి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడని, తాజాగా రెడ్డి కులంపై ఆయన ఫోకస్‌ పడిందని విమర్శిస్తున్నారు. మరి, దీనిపై వర్మ ఎలాంటి వివరణ ఇస్తాడో, ఈ కాంట్రవర్శీ ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.