భూమి బలి… కోర్టుకెక్కిన బాహుబలి

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ భూమి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.. తన గెస్ట్ హౌజ్ ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ  బాహుబలి హీరో హై కోర్టును ఆశ్రయించాడు. రాయదుర్గం సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థలంలో 2,200 గజల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆ స్థలంతోపాటు ప్రభాస్ గెస్ట్ హౌస్ ని కూడా రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆ సమయంలో గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గెస్ట్ హౌస్ కు తాళం వేసి గేటుకు నోటీసు అంటించారు.
తన ఇంటిని జీవో నంబర్‌ 59 కింద రెగ్యూలరైజ్  చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నానని, దానిపై నిర్ణయం రాకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నిస్తూ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసిన భూమికి తామే హక్కు దారులమంటూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2019 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.