పవన్‌ చరిత్ర చదివి మాట్లాడు… ఆటాడుకుంటున్న నెటిజన్‌లు…!!


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్‌లు. గత రెండు రోజులుగా ఆయనను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్‌లు.. భరత మాత ముద్దుబిడ్డ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్‌పై జనసేనాని చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఇటీవల వ్యాఖ్యానించడం పెను దుమారం రేపుతోంది..

భగత్‌ సింగ్‌ని బ్రిటీష్‌ ప్రభుత్వం ఉరితీసింది. 23 ఏళ్లకే ఆయన అశువులు బాసాడు.. భగత్‌ సింగ్‌ని ఉరితీయోద్దని ఎంతగా అభ్యర్ధనలు వచ్చినా, అసెంబ్లీ బాంబ్‌ ఘటనలో ఆయనకు ఉరిశిక్ష విధించింది వలసరాజ్యం.. ఇది అందరికీ తెలిసిన చరిత్ర.. అయితే, జనసేనాని తన యూఎస్‌ పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్‌ సెగలు రేపుతోంది.. భగత్‌ సింగ్‌ ఉరివేసుకున్నాడని పవన్‌ వ్యాఖ్యానించడం హాట్‌ టాపిక్‌గా మారుతోంది..

భగత్‌ సింగ్‌ చరిత్ర చిన్న పిల్లాడికి కూడా తెలుసు. అలాంటిది పవన్‌ ఇలా చరిత్ర తెలియకుండా మాట్లాడారని, వేల పుస్తకాలు చదివాను అని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌కి ఈ మాత్రం తెలియదా అని విరుచుకుపడుతున్నారు నెటిజన్‌లు. పుస్తకాలలోకి కొటేషన్‌లు కాదు…. చరిత్రను సరిగా అర్ధం చేసుకోవాలని, లేకుంటే ఇలా వక్రీకరణ చేయాల్సి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు మరికొందరు. జనసేనాని ముందు చేగువేరా గురించి కాదు.. దేశంలోని ప్రముఖుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు స్టడీ చేయాలని సలహాలు ఇస్తున్నారు.. ఫండ్స్ కోసం విదేశాల్లో తిరుగుతున్న పవన్, చరిత్రను మార్చేసి పరువు తీసుకున్నాడని కౌంటర్ లు వేస్తున్నారు.

మరోవైపు, ఇది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ అని అందుకే, పవన్‌ ఇలా చదివాడని వ్యాఖ్యానిస్తున్నారు ఆయన మద్దతుదారులు.. మరికొందరేమో ఏదో పొరపాటున జరిగిన తప్పని సమర్ధిస్తుండగా, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లని హైలైట్‌ చేయడం మంచిది కాదని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైతేనేం…. పవన్‌ని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్‌లు.