విజయ్‌ సర్కార్‌లో పవన్‌ జనసేన సీన్‌లు

సర్కార్‌… విజయ్‌ – మురుగదాస్‌ కాంబినేషన్‌లో లేటెస్ట్‌ మూవీ. ఈ కాంబో అంటే చాలు తుపాకి, కత్తి లాంటి సంచలన విజయాలు కళ్ల ముందు మెదులుతాయి. తమిళ్‌లో పవర్‌ఫుల్‌ కాంబో ఇది. ఎన్నో రికార్డులు బ్రేక్‌ చేసిన కాంబినేషన్‌ ఇది.
దీపావళి కానుకగా విడుదలయిన విజయ్‌ సర్కార్‌ తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్‌ దక్కించుకుంది.. గతేడాది విజయ్‌ మెర్సల్‌ తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్‌ అయింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్‌ దక్కింది. దీంతో, విజయ్‌ మార్కెట్‌ దక్కడం, తాజా సినిమాకి మురుగదాస్‌ డైరెక్టర్ కావడంతో సర్కార్‌కి ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్‌ హాఫ్‌కి మంచి అప్లాజ్‌ దక్కినా, సెకండాఫ్‌లో అదే టెంపో మెయింటెన్‌ చేయడంలో దర్శకుడు తడబడ్డాడనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.
సర్కార్‌ పక్కా పొలిటికల్‌ డ్రామా. కార్పొరేట్‌ రాజకీయాలను శాసించే ఓ బిజినెస్‌ మేన్‌ ఊహించని విధంగా పాలిటిక్స్‌లోకి అడుగు పెడితే ఎలాంటి ఉంటుంది అనేది సినిమా. దొంగ ఓట్లు, బోగస్‌ ఓట్లు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయనే లైన్‌తో రూపొందిన సర్కార్‌ విజయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది..
కథలో  విజయ్‌ రోల్‌ అక్కడక్కడా పవన్‌ కల్యాణ్‌ జనసేనను పోలి ఉంటుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రశ్నించడం హక్కు. ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టానని, ఎవరిని అయినా నిజాయితీగా, నిర్భీతిగా ప్రశ్నిస్తానని పవన్‌ చెబుతుంటాడు. సర్కార్‌ మూవీలోనూ విజయ్‌ పాత్ర ఇవే డైలాగులను అనేక సార్లు వల్లెవేస్తూ ఉంటుంది. దీంతో, ఈ పాత్రలో పవన్‌ జనసేన షేడ్స్‌ ఉన్నాయని అర్ధం అవుతుందంటున్నారు క్రిటిక్స్‌.
గతంలో విజయ్‌ నటించిన అనేక తమిళ్‌ మూవీస్‌ని తెలుగులోకి రీమేక్‌ చేశాడు పవన్‌. అన్నవరం, సుస్వాగతం, ఖుషి వంటి చిత్రాలు ఇలాంటివే. మరోవైపు, మహేష్‌తో స్పైడర్‌ సినిమా చేస్తున్న టైమ్‌లో డైరెక్టర్‌ మురుగదాస్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాడు. జనసేన సిద్ధాంతాలు, పవన్‌ డైలాగులపై ఫోకస్‌ పెట్టిన మురుగదాస్‌ తన లేటెస్ట్‌ మూవీ సర్కార్‌లో ఫాలో అయ్యాడట.. మరి, ఇది పవన్‌కి అడ్వాంటేజ్‌గా మారుతుందా…? అనేది చూడాలి.