పడిపడి లేచే మనసు రివ్యూ & రేటింగ్‌

రివ్యూ : పడిపడి లేచె మనసు
తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, సునిల్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, మురళీశర్మ, ప్రియారామన్
సినిమాటోగ్రఫీ : జే.కె
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు : ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : హను రాఘవపూడి

కొన్ని కాంబినేషన్స్ సినిమాపై అంచనాలను పెంచుతాయి. కంటెంట్ తో పనిలేకుండా ఆ సినిమాపై నమ్మకాన్ని కలిగిస్తాయి. కారణం.. ఆయా వ్యక్తులు ఎంచుకునే కథలే. అందుకే హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు అనగానే చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. ఆడియో కూడా బావుంది అనే టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ ప్రేమకథతో హను రాఘవపూడి మళ్లీ తన ‘స్పెషాలిటీ’ చూపిస్తాడు అనుకున్నారు. మరి అలా జరిగిందా.. పడిపడి లేచె మనసె అంతా ఊహించినట్టుగానే ఆకట్టుకుందా..?

కథ :
కోల్ కతాలో సూర్య(శర్వానంద్) ఫుట్ బాల్ ప్లేయర్. కాస్త రఫ్ గా ఉంటాడు. ఓ రోజు అతను వైశాలి(సాయి పల్లవి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. వైశాలి మెడికల్ స్టూడెంట్. కాస్త టఫ్ గాళ్. అందుకే తనను ప్రేమలోకి దించడానికి ఓ నాటకం ఆడతాడు. అది క్లిక్ అవుతుంది. మెల్లగా వైశాలి కూడా సూర్యతో ప్రేమలో పడుతుంది. సాఫీగా హ్యాపీగా సాగిపోతోన్న వారి లవ్ లైఫ్ లోకి నేపాల్ ఎపిసోడ్ ఎంటర్ అవుతుంది. మెడికల్ క్యాంప్ కోసం నేపాల్ వెళ్లిన వైశాలి కోసం బైక్ పై వెళతాడు. తనకోసం వచ్చిన అతనితో పెళ్లి చేసుకుందాం అంటుంది వైశాలి. కానీ సూర్య పెళ్లంటే తనకు ఇష్టం లేదని.. ఇలాగే లైఫ్ లాంగ్ కలిసుందాం అంటాడు. అక్కడ ఇద్దరి మధ్య ఓ గొడవ జరుగుతుంది. దీంతో యేడాదిపాటు విడిపోయి.. యేడాది తర్వాత అతనికి పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. ఈమెకు అతనితో కలిసుండాలనిపించినా మళ్లీ అక్కడే కలుసుకుందాం అనుకుంటారు. అనుకున్నట్టుగానే వస్తారు. కానీ అక్కడ కలుసుకోకముందే జరిగిన కొన్ని సంఘటనల వల్ల వైశాలి గతం మరచిపోతుంది.. అదెలా జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలేంటీ..? తనను మర్చిపోయిన వైశాలి కోసం సూర్య ఏం చేశాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :
పడిపడిలేచె మనసె.. క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. దర్శకుడుగా హను రాఘవపూడికి ఓ ‘సైన్’ ఉంది. అది గత సినిమా ‘లై’లో మిస్ అయింది. అందువల్ల ఈ సారి బౌన్స్ బ్యాక్ అవుతాడనుకున్నారు. బట్ అలా ఏం జరగలేదు. ఈ సారి అతని ప్రేమకథ ఏ మ్యాజిక్ చేయలేదు. సరికదా సెకండ్ హాఫ్ ట్రాజిక్ అంటూ వెళ్లి ట్రాజెడీగా మార్చాడు. సినిమా లెంగ్త్ నుంచి ఎంచుకున్న కథ వరకూ ఏదీ ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సెన్సిబుల్ లవ్ స్టోరీస్ చెప్పడంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న ఈ దర్శకుడు ఆశ్చర్యంగా చాలా తెలుగు సినిమాలను మిక్స్ చేసి ఈ కథ తయారు చేసుకోవడం విశేషం. అది కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలే కావడంతో ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయాడు.

హీరో, హీరోయిన్ గాఢంగా ప్రేమించుకుంటారు. హీరో వెంటపడి మరీ అమ్మాయిని లవ్ లోకి దించుతాడు. తీరా ఆమె పెళ్లి ప్రస్తావన తెస్తే.. కాదంటాడు. తనకు పెళ్లి ఇష్టం లేదని.. లైఫంతా ఇలాగే కలిసుందాం అంటాడు. ఈ ప్లాట్ చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి సంభాషణలు రాసిన స్వయంవరం సినిమా కథ గుర్తుకు రాకుండా ఉంటుందా..? ఎగ్జాట్లీ అదే పాయింట్.

అలాగే హీరోయిన్ కోసం హీరో చేసే పనులన్నీ వేరే వ్యక్తి చేస్తున్నట్టుగా చూపిస్తాడు. విషయం తెలిసిన హీరోయిన్ ఆ మరో వ్యక్తిని ఊహించుకునే సీన్స్ మగధీర ఫస్ట్ హాఫ్ లో కాజల్ ను తలపిస్తాయి. ఇక హీరో తండ్రి పాత్ర అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయిలోని ప్రకాష్ రాజ్ పాత్ర నుంచి ఇన్స్ స్పైర్ అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది.

హీరోయిన్ కు మతిమరుపు అనే కాన్సెప్ట్ కామెడీ పక్కన బెడితే కిక్ లో రవితేజ పాత్రకు ఇన్స్ స్పిరేషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు ఏ దశలోనూ కొత్తగా ఆలోచించింది లేదు. కథే కాదు.. కథనం కూడా ఏ మాత్రం ఆకట్టుకోదు. మామూలుగా హను రాఘవపూడి ప్రేమ సన్నివేశాలు నేచురల్ గా ఉంటాయి. కానీ ఇందులో చాలా వరకూ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా సాయి పల్లవి, శర్వాల మధ్య రొమాన్స్ బలవంతంగా చేయించినట్టు అనిపిస్తుంది తప్ప సహజంగా ఉండదు.

సో.. ట్రైలర్ ను బట్టి సినిమాపై ఏదో ఊహించుకుంటే అంతే సంగతులు. ట్రైలర్ ఉన్నంత గొప్పగా సినిమా ఉండదు. పైగా నిడివి కూడా చాలా ఎక్కువ. అనవసరంగా కొన్ని సీన్స్ పదేపదే వస్తాయి. దాదాపు అరగంట ఎడిట్ చేసినా సినిమా రిజల్ట్ లో ఏ తేడా ఉండదు. ఈ సినిమాకు కోల్ కతా నేపథ్యం ఎందుకు ఎంచుకున్నారా అని ఆలోచించేవారికి సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కోసం అని రివీల్ చేస్తాడు. ఈ మాత్రం దానికి కోలకతా నేపథ్యం ఎందుకు అని అప్పుడనిపిస్తుంది. ఇలా ఎలా చూసినా హను రాఘవపూడి లై తర్వాత మరోసారి నిరాశపరిచినట్టే అని చెప్పాలి.

నటన పరంగా శర్వానంద్, సాయి పల్లవి సీన్ లో బలం లేకపోయినా తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మామూలుగానే టాలెంటెడ్ అయిన ఈ ఇద్దరి ప్రతిభకు తగ్గ కథ, కథనాల్ని అందించడంలో హను విఫలమయ్యాడు. దీంతో వీరిపైనే ఆధారపడ్డ ఈ కథలో ఇతర పాత్రలు కూడా డైల్యూట్ అయిపోయాయి. వెన్నెల కిశోర్ కాస్త నవ్వించినా.. నవ్వించేందుకు సునిల్ చేసిన ప్రయత్నం చూస్తే అతనిపై జాలి కలుగుతుంది. ప్రియదర్శి, సత్యం రాజేశ్, మురళీ శర్మ, ప్రియారామన్ ఇలా ఎవరికీ సరైన పాత్ర పడలేదు. ఉన్న పాత్రలూ ఆకట్టుకోలేదు.

టెక్నికల్ గా ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం, సినిమాటోగ్రఫీ. మంచి పాటలు కుదిరినా.. కథ బలంగా లేకపోవడంతో ఆడియో పరంగా వింటే బెటర్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ రిచెస్ట్ గా ఉంటుంది. ఎడిటింగ్ ప్రధాన లోపం. మాటలు బావున్నాయి. భూకంపం తాలూకూ గ్రాఫిక్స్ లో ఇంకాస్త క్వాలిటీ ఉండాల్సింది. దర్శకుడు ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల్నే కాపీ కొట్టి తీయడం వల్లేమో.. కొన్నిసార్లు గ్రాఫ్ లేచినట్టే అనిపించానా.. ఎక్కువసార్లు పడిపడిపోయింది..

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫీ
సంగీతం
శర్వానంద్, సాయి పల్లవి

మైనస్ పాయింట్స్ :

కథ, కథనం
ఎడిటింగ్
దర్శకత్వం
సెకండ్ హాఫ్

ఫైనల్ గా : సెకండ్ హాఫ్ నుంచి ‘మతి’పోయి గతి తప్పిన సినిమా

రేటింగ్ : 2/5

– యశ్వంత్