కథానాయకుడు కలెక్షన్లు పెంచిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు- నందమూరి బాలకృష్ణ కాంట్రవర్సీ కథానాయకుడికి బాగానే కలిసొచ్చింది. గతంలో ఒకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ  తాజాగా మెగా బ్రదర్ నాగబాబు, బాలకృష్ణపై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు. అయితే బాలయ్య మాత్రం నాగబాబును పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. బాలయ్య స్పందించకపోవడం… నాగబాబు రెచ్చిపోయి కౌంటర్ వీడియోలు రిలీజ్ చేయడం ఎక్కడ కథానాయకుడు సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపుతుందో అని బయ్యర్లు భయపడిపోయారు.
 నెగిటివ్ ప్రభావం సంగతి కాసేపు పక్కన పెడితే నాగబాబు చేసిన కామెంట్స్ సినిమాకు విపరీతంగా హైప్ పెంచేశాయి. కొంతకాలంగా బాలయ్య- నాగబాబు విషయమే మీడియాలో ట్రెండ్ అవ్వడం కూడా సినిమాకు కలిసొచ్చింది. అందరి దృష్టి కథానాయకుడిపై పడేలా చేసింది. తద్వారా సినిమా భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. బాలయ్య చేసుకున్న ప్రమోషన్ కంటే నాగబాబే సినిమాను ఎక్కువ ప్రమోట్ చేశాడనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.
ఇటీవలే నాగబాబు ‘నిజాలు కక్కలేని బయోపిక్ లొద్దయా’ అంటూ కవిత్వం కూడా చెప్పుకొచ్చాడు. కష్టపడి కవిత్వం నేర్చుకొని కౌంటర్ వేసిన నాగబాబు ప్రయత్నం ఫలించింది.  అసలు బయోపిక్ లోనిజాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికే వెళుతున్నారో, లేకపోతే సినిమా మీద అభిమానమో తెలియదు కానీ ‘కథానాయకుడు’ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయని ట్రేడ్‌ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
నందమూరి అభిమానులు ఇటీవల నాగబాబుని సోషల్ మీడియాలో ట్రోల్‌ చేయడం షురూ చేశారు. అంతేకాదు, మెగాబ్రదర్‌ని బాలయ్య అభిమానులు అడ్డుకోవడం వంటి  ఎపిసోడ్స్‌తో బాలయ్య ఫ్యాన్స్‌లో ఓ ఫీవర్‌ క్రియేట్‌ అయిందనే టాక్‌ వినిపించింది. దీంతో, సినిమా రిలీజ్‌ అయితే ఎక్కడ నెగిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తారనే భయంతో ముందే బాలయ్య అభిమానులు సినిమాకి పెద్ద ఎత్తున విచ్చేశారు. థియేటర్లకు క్యూ కట్టారట. మొత్తానికి కాంట్రావర్సీలకు పోయి నాగబాబు కథానాయకుడు కలెక్షన్లు పెంచేశాడని చెబుతున్నారు  నందమూరి అభిమానులు.