ఒడియన్‌ మూవీ రివ్యూ & రేటింగ్‌

రివ్యూ : ఒడియన్
తారాగణం : మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, మంజు వారియర్, ఇన్నోసెంట్, సిద్ధిఖీ
సంగీతం : ఎమ్ జయచంద్రన్, శామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ : షాజి కుమార్
ఎడిటింగ్ : జాన్ కుట్టి
నిర్మాత : ఆంటోనీ పెరుంబవూర్
దర్శకత్వం : వి.ఏ. శశికుమార్ మీనన్( మొదటి సినిమా)
నటుడుగా మోహన్ లాల్ సత్తా దేశమంతా తెలుసు. మనకూ బాగానే తెలుసు. ఆ మధ్య వచ్చిన మన్యంపులితో ఇక్కడ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. తన డబ్బింగ్ సినిమాలకు సంబంధించి అది సెకండ్ ఇన్నింగ్స్ గా మారింది. ఆతర్వాత జనతా గ్యారేజ్ లో సపోర్టింగ్ రోల్ తో మరోసారి ఆకట్టుకున్న మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ ఒడియన్. మొదట్నుంచీ మాలీవుడ్ లో మెస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు అన్నప్పుడు మన్యంపులి ఎఫెక్ట్ తో మంచి అంచనాలు వచ్చాయి. మరి వాటిని ఈ సినిమా నిలబెట్టుకుందా అనేది చూద్దాం..
ఒడియన్ అనేది కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్ ప్రాంతంలో వినిపించే జానపదుల కథ. పగలు సాధారణ మనుషుల్లా ఉండే వీళ్లు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళుతోన్న వారిని భయపెడుతుంటారు. అందుకోసం వాళ్లు జంతు రూపాల్లోకి మారతారు. వివిధ రకాల జంతువులుగా మారగలరు వీళ్లు అనేది అక్కడ ఇప్పటికీ ప్రచారంలో ఉండే గాథ. ఆ గాథనే వెండితెరపై ఆవిష్కరించాలనుకున్నాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగా మోహన్ లాల్ వంటి టాప్ హీరోను తీసుకుని తన ఫస్ట్ ప్రాజెక్ట్ కు పెద్ద అటెన్షన్ కూడా తెచ్చాడు. ఎటొచ్చీ ఆ కథను రాసుకున్న విధానం కానీ.. తీసిన విధానం కానీ ఏ మాత్రం ఆకట్టుకోలేదు సరికదా అసలుఈ కథ ఎందుకు తీశారు అనే ప్రశ్నలకు తావిచ్చాడు.
ఓ మారుమూల ప్రాంతంలో నడిచే ఈ కథను వారణాసి నుంచి మొదలుపెట్టాడు దర్శకుడు. అక్కడ ఓ సాధారణ జీవితం గడుపుతోన్న వ్యక్తి నీళ్లలో మునిగిపోతోన్న ఓ మహిళను కాపాడతాడు. తను తేరుకున్న తర్వాత అతన్ని చూసి ఒడియన్ అని పిలుస్తుంది. అతను ఆశ్చర్యపోతాడు. అతను తన ఊరు వదిలి అప్పటికి పదిహేనేళ్లు. అది ఆరంభం.. ఆ తర్వాత కథ గ్రామానికి వెళుతుంది. అతన్ని చూసి కుర్రాళ్లంతా హేళన చేస్తుంటారు. వీడేరా గతంలో మనాళ్లను భయపెట్టింది అంటుంటారు. అప్పట్లో కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు నీకంత సీన్ లేదంటూ ఉడికిస్తుంటారు. అంతే కాదు.. ఇప్పుడు మమ్మల్ని భయపెట్టమని సవాల్ విసురుతారు. ఆ సవాల్ కు ఓకే చెబుతాడు ఒడియన్ . అయితే తను ఎప్పుడో వదిలేద్దామనుకున్న తన ‘కళ’ ను మళ్లీ ఎందుకు ప్రదర్శించాలనుకున్నాడు. అసలు అతను మళ్లీ ఆ ఊరికి ఎందుకు వచ్చాడు.. అసలు ఎందుకు ఊరు వదిలాడు అనేది కథ…
ఒక సినిమా ఎందుకు తీస్తున్నాం అనే పర్సస్ దర్శకుడికి తెలిసి ఉండాలి. అది ఏ జానర్ అయినా కథాగమనం అంటూ ఒకటుంటుంది. ఆరంభం, నడక, ముగింపు అనే కనీస ఫార్మాట్ ఉంటుంది. లేదంటే దర్శకుడు ఈ చిత్రాన్ని ‘తొలి మళయాల సూపర్ హీరో సినిమా’ అని ముందు నుంచీ గర్వంగా చెప్పాడు. నాలుగు సార్లు గాల్లోకి ఎగిరితే ఎవరూ సూపర్ హీరో అయిపోరు అనే కనీస అవగాహన అతనికి లేకపోవడం విషాదం. ఎందుకంటే అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతనికి ఏ దశలోనూ క్లారిటీ ఉన్నట్టు కనిపించదు. అతను ఒడియన్ ల బయోగ్రఫీ చెప్పాలనుకున్నాడా..? అంటే లేదు. జస్ట్ వారి గురించి చూచాయగా పరిచయం చేశాడు. అదీ సినిమాటిక్ గానే. లేక వాళ్లు ఆ ప్రాంతానికి ఏదైనా సేవలు చేశారా..? అంటే అదీ లేదు. ఇంకా చెబితే వారి పనులన్నీ నెగెటివ్ కోణంలోనే చూపించాడు. మరి అలాంటి వ్యక్తుల గురించిన కథ ఎందుకు ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత కనీసం తనైనా ఆ నాయకుడికి ఏదో ఒక లక్షణం ఆపాదించాలి కదా. అలాంటిదేం లేదు. ఒడియన్ ల గురించి సమగ్రంగా చెప్పలేదు. ‘చివరి పవర్ ఫుల్ ఒడియన్’ అంటూ అతనే చెప్పిన ఇతని కథనూ స్పష్టంగా చెప్పలేదు. దీంతో  సినిమా అంతా కలగాపులగం అయిపోయింది.
ఇక హీరోయిన్ తో నడిచే వ్యవహారం ప్రేక్షకుల సహనానికి పరీక్ష. హీరో లక్ష్యం ఏంటనేది ఏ దశలోనూ చెప్పలేకపోయాడు దర్శకుడు. పదిహేనేళ్ల తర్వాత హీరోయిన్ తో పాటు అతని చెల్లెలును కాపాడ్డం అనేది అతని భావన కావొచ్చు. కానీ హీరో ఆ పని పదిహేనేళ్లకు ముందు కూడా చేసి ఉండొచ్చు. ఎలాగూ తను ఇతర రూపాల్లోకి మారతాడు కాబట్టి.. అలా వారి చుట్టే ఉంటూ వారిని కాపాడొచ్చు. ఆ ఇద్దరి మధ్య ట్రాక్స్ ఎంత గొప్పగా సాగదీయొచ్చో అంత గొప్పగా సాగదీశారు. ఇదే పెద్ద డ్రా బ్యాక్ అయిపోయింది.
మొత్తంగా పర్సస్ లెస్ గా సాగిన కథ, కథనాల్లో మోహన్ లాల్ నట విశ్వరూపం అనే మాటకు కూడా అర్థం లేకుండా పోయింది. సినిమాల్లో సగానికి పైగా డూప్ నే వాడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల మోహన్ లాల్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు అని కూడా చెప్పలేం.
మొత్తంగా ఒడియన్ ట్రైలర్, పోస్టర్స్ చూసి ఏదో ఊహించుకుని వెళితే మాత్రం ఖచ్చితంగా నిరాశ తప్పదు. ఎందుకంటే ట్రైలర్ లో చూపించినంత గొప్ప ఎఫెక్టివ్ ఫైట్స్ కూడా లేవీ సినిమాలో. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ పిల్లల కామిక్ ఛానల్స్ లో చూసినట్టుగా ఉంటుంది. పైగా ఇది కేవలం మోహన్ లాల్ లోని మాస్ యాంగిల్ కోసం, పీటర్ హెయిన్స్ టాలెంట్ చూపడం కోసం పెట్టినట్టుగా ఉంది తప్ప సన్నివేశానికి అనుగుణంగా గొప్పగా ఉండదు.
ఇక ప్రకాష్ రాజ్ పాత్రకు ఉన్న పర్సస్ ఒక్కటే. అలాగే అతని ఎక్స్ ప్రెషన్ కూడా ఒక్కటే అయిపోయింది. ఆర్టిస్టుల పరంగా అంతా బానే చేసినా అసలు పస లేనప్పుడు ఎంత చేస్తే ఏం ఉపయోగం. అందువల్ల ఒడియన్ చూడ్డానికి వెళ్లిన ప్రేక్షకులు కూడా మనమూ మాయం అయిపోతే బావున్ను అనుకుంటారు.
టెక్నికల్ గా :
సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. ముఖ్యంగా ఒడియన్ కనిపించే రాత్రి వేళల్లో అద్భుతమైన లైటింగ్ కనిపిస్తుంది. గ్రాఫిక్స్ కూడా బావున్నాయి. పాటలు మెలోడీగా ఉన్నాయి. కాకపోతే సీన్ లో పస లేకపోయినా నేపథ్య సంగీతంతో ఏదో గొప్ప సీన్ నడుస్తోంది అనిపించేలా ఉన్న బిల్డప్ సంగీతం విసిగిస్తుంది. ఒక్కోసారి ఆ మ్యూజిక్ అనుగుణంగా మనం ప్రిపేర్ అయినా అసలు సీన్ వచ్చేసరికి అంత సీనుండదు. ఇలాంటి సినిమా అంతా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్  :
ఆర్టిస్టులు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
కథ
కథనం
సంగీతం
దర్శకత్వం
ఫైనల్ గా :  లాగింగ్ కన్ఫ్యూజన్
రేటింగ్ : 1.5/5
– యశ్వంత్