వైఎస్‌ని దించేసిన మమ్ముట్టి …. యాత్ర ట్రయిలర్‌ రివ్యూ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్(అని పూర్తిగా అనలేం కూడా) ‘యాత్ర’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ది బెస్ట్ యాక్టర్ మమ్మూట్టి.. వైఎస్ ఆర్ పాత్రలో నటించిన ఈ మూవీ ప్రధానంగా ఆయన సాగించిన పాదయాత్ర నేపథ్యంలో ఎక్కువగా నడుస్తుందని ముందు నుంచీ చెబుతున్నారు.

అయితే ఆయన పాదయాత్ర చేయడానికి కారణాలేంటీ.. ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఏ జరిగిందనేది ఆసక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. మొత్తంగా ఇవాళ విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఆ పాత్రలో మమ్మూట్టి అచ్చంగా ఒదిగిపోయినట్టు తెలుస్తోంది. డైలాగ్స్ కూడా కాస్త వైఎస్ఆర్ వాయిస్ కు దగ్గరగా ఉండటం విశేషం.

పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలని ఒక పార్టీ వ్యక్తి అడుగుతుండగా.. ‘ నా విధేయతను విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోవద్దండీ’అని చెప్పే డైలాగ్ తో ఆరంభమయ్యే ఈ ట్రైలర్ నే ఆకట్టుకునే డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ‘ నాయకుడుగా మనకేం కావాలో తెలుసుకున్నాం కానీ ప్రజలకేం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాటిచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముందీ.. ముందుకెళ్లాల్సిందే’.. ‘అన్నిటికన్నా అతి పెద్ద జబ్బు పేదరికం.. పేదరికాన్ని మించిన శిక్షే లేదయ్యా’ అంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయనే చెప్పాలి.

మొత్తంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో శతృవులు కూడా మారిపోయిన వైనం కనిపిస్తోంది. అందుకే అవతలి పార్టీ వ్యక్తులు కూడా ఈ సారి నా వోటు నీకే.. నీ పార్టీకి కాదు.. అనే డైలాగ్ ఉంది. ఇక ఫైనల్ గా హాస్పిటల్ లో ఉన్న ఓ వ్యక్తి రాజశేఖర్ రెడ్డికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు… డాక్టర్ వచ్చి అతనేం చెప్పలేడు సార్ అంటాడు.. వైఎస్ పాత్రలో ఉన్న మమ్మూట్టి ‘నాకు వినపడుతుందయ్యా’ అని చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్. ఇది ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన సీన్ కావొచ్చు.

మొత్తంగా ఇందులో కేవలం రాజకీయాలే కాకుండా హ్యూమన్ ఎమోషన్స్ ను కూడా గట్టిగానే టచ్ చేసేలా ఉన్నట్టు కనిపిస్తోంది. పాఠశాల, ఆనందోబ్రహ్మ చిత్రాల దర్శకుడు మహి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 8న విడుదల కాబోతోంది.