హరీశ్‌రావుకి ఓదార్పు… ఇంటి దగ్గర నేతల క్యూ…!!


టీఆర్‌ఎస్‌లో నాయకత్వ మార్పు ప్రక్రియ అంత ఈజీ కాబోదా.?? అందరినీ విస్మయానికి గురిచేస్తూ సడెన్‌గా తన తనయుడు కేటీఆర్‌ని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజకీయ వారసుడిగా గుర్తిస్తూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలంతా కేటీఆర్‌కి అభినందనలు తెలిపారు. చివరికి పార్టీలో తనకు ప్రత్యర్ధిగా మారుతారని భావించిన సీనియర్‌ నేత, కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌ సైతం కేటీఆర్‌ని అభినందించారు.. దీంతో, కేటీఆర్‌-హరీశ్‌ మధ్య ఎలాంటి రగడ జరగదని, ఇద్దరూ కలిసి పార్టీ కోసం పాటుపడతారనే ప్రచారం జోరుగా సాగింది.

ఇంతలోనే పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హరీశ్‌ రావు ఇంటిదగ్గరకి అభిమానులు, కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకుంటున్నారు. కేటీఆర్‌కి ఊహించని విధంగా పట్టాభిషేకం చేసినందుకు హరీశ్‌ రావుకి వీరంతా సంఘీభావం ప్రకటించడానికి విచ్చేశారని తెలుస్తోంది. మరికొంతమంది మాత్రం ఇది హరీశ్‌ రావుకి ఓదార్పు యాత్ర అని ఆయనకు సానుభూతి తెలపడం కోసమే వారంతా విచ్చేసినట్లు చెబుతున్నారు..

హరీశ్‌ రావుకి ఓ రేంజ్‌లో మద్దతు వస్తుండడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. హరీశ్‌ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం తగ్గనుందనే భావనతోనే అభిమానులు క్యూ కడుతున్నారని కొందరు వాదిస్తున్నారు.. మరికొందరు మాత్రం పార్టీలో కేటీఆర్‌కి ప్రాముఖ్యత ఇచ్చినా, రేపు జరగబోయే మంత్రి వర్గం విస్తరణలో హరీశ్‌కి ప్రాధాన్యత లేని పోర్ట్‌ ఫోలియో ఇస్తే సీన్‌ ఏంటనే భావనతోనే ఇలా ఒత్తిడి చేస్తున్నారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..

పార్టీలో జరుగుతున్న పరిణామాలు అంతా సర్దుకుంటాయని, త్వరలోనే అన్నీ సమసిపోతాయని.. బావ బావమరుదులు ఇద్దరూ సమన్వయంతో ముందుకు నడుస్తారని వ్యాఖ్యానిస్తున్నారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. ఈ పరిణామం ఎలాంటి విపరీతాలకు దారితీస్తుందో చూడాలి..