కేసీఆర్‌ 2.O రెడీ… మరి, బాబు 2.Oకి అంత సీన్‌ ఉందా..??


తమ తనయులను తమ రాజకీయ వారసుడిగా చూసుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎంతో శ్రమించారు. 2014లో ఇటు తెలంగాణలో కేసీఆర్‌, అటు ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులుగా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత పైకి ప్రకటించకపోయినా, అంతర్గతంగా అటు పార్టీ పరంగా ఇటు, ప్రభుత్వంలోనూ తమ తనయులు ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించారనేది సుస్పష్టం. ఇక అఫిషియల్‌గా వారికి బెర్త్‌ కన్‌ఫమ్‌ చేయడమే మిగిలింది..

తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‌ అఖండ విజయాన్ని సాధించారు. కేసీఆర్‌తోపాటు ఈ ఎన్నికలలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు కేటీఆర్‌. అటు టికెట్ల కేటాయింపులోనూ కేటీఆర్‌ కీలక పాత్ర పోషించారని, తన టీమ్ అనుకున్నవారికే టికెట్‌లు ఇచ్చారనే ప్రచారం జరిగింది.

కేటీఆర్‌ టికెట్‌లు ఇచ్చిన నేతలంతా విజయం సాధించడం, అసంతృప్తులను బుజ్జగించడం, రెబల్స్‌ను సముదాయించడంలో విజయ సాధించారు. దీంతో, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాల్సిన తరుణం ఆసన్నమయిందని భావించిన కేసీఆర్‌.. తనయుడికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. తన వారసత్వాన్ని కేటీఆర్‌కి సమర్ధవంతంగా, ఎలాంటి రగడ లేకుండా సేఫ్‌గా పట్టాభిషేకం చేసేందుకు లైన్‌ క్లియర్‌ చేశారు కేసీఆర్‌. నేడో రేపో కేటీఆర్‌ని సీఎంగా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు, తాను జాతీయ రాజకీయాలతో బిజీ అవుతానంటూ కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు దీనినే సూచిస్తాయని చెబుతున్నారు..

తన వారసుడికి పక్కాగా లైన్‌ క్లియర్‌ చేసిన కేసీఆర్ బాబుపై అప్పర్‌ హ్యాండ్‌ సాధించినట్లయింది. దీంతో, మరి లోకేష్‌ సంగతేంటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.. కేటీఆర్‌ మంత్రిగా, పార్టీ నిర్వాహకుడిగా ప్రూవ్‌ చేసుకుంటే లోకేష్‌ ఇప్పటికీ తనదైన ముద్ర వేయలేకపోయారు. తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. ఇంతవరకు లోకేష్‌ తనకు తాను ప్రూవ్ చేసుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.

మరోవైపు, బాబు జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెంచుతున్నా.. ఇదంతా తన వారసుడిని పట్టాలెక్కంచడానికే అనేది సుస్పష్టం. అయితే, త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికలలో బాబు గెలిస్తేనే లోకేష్‌కి లైన్‌ క్లియర్‌ అవుతుంది.. టీడీపీ ఓడిపోతే బాబు మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుంది.లోకేష్‌ నాయకత్వంపై ఇప్పటికీ పార్టీలోని నేతలకే అనేక అనుమానాలున్నాయి. మరి, బాబు ఈ పరిస్థితులను ఎలా అధిగమించి తన వారసుడికి పట్టాభిషేకం చేస్తారనేది చూడాలి..