కేజీఎఫ్‌ కలెక్షన్ల హోరు.. సంక్రాంతి సినిమాలతో పోటీ

క్రిస్మస్ కి ముందు విడుదలైన డబ్బింగ్ సినిమా ‘కెజిఎఫ్’ ఏడాది చివర్లో  వసూళ్ల వర్షం కురిపించింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీకైన ఈ కన్నడ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఆ సమయంలో వచ్చిన తెలుగు సినిమాలు తుస్సుమనిపించడంతో ‘కెజిఎఫ్’ మంచి వసూళ్లు సాధించింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా అంతగా ప్రభావం చూపించకపోవడంతో ‘కేజీఎఫ్’ అదరగొడుతూ సాగిపోయింది. 

ఇక సంక్రాంతి సినిమాలు రావడంతో ‘కెజిఎఫ్’ పని అయిపోయినట్లే అనుకున్నారు. తెలుగు సినిమాలకు సంక్రాంతి పెద్ద పండగ. వీలైనంత వరకు సంక్రాంతికి సినిమా విడుదల చేసి పండగ సందడిని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. ఈ ఏడాది కూడా నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్-2’ లతో పాటు సూపర్ స్టార్ రజినీ డబ్బింగ్ సినిమా ‘పేట’ కూడా సంక్రాంతికి విడుదలయ్యాయి.

 ‘కథానాయకుడు’ రిలీజ్ రోజే చాలా చోట్ల ‘కెజిఎఫ్’ తీసేశారు. తరువాత రోజు ‘పేట’, ఆ తరువాత ‘వినయ విధేయ రామ’ రిలీజ్ అవడంతో ‘కేజీఎఫ్’ అడ్రస్ దాదాపు గల్లంతయినట్లే కనిపించింది. అయితే ‘కథానాయకుడు’ టాక్ బాగున్నా వసూళ్లు పెద్దగా కనిపెంచట్లేదు. ‘పేట’కు కూడా డివైడ్ టాక్ రాగా, ‘వినయ విధేయ రామ’కు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చింది. 

ఇక ఫ్యామిలీ ఎంటర్ రైనర్ గా వచ్చిన ‘ఎఫ్-2’ కి కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే రావడంతోనే మళ్ళీ ‘కేజీఎఫ్’ పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ లను కెజిఎఫ్ కు కేటాయింస్తున్నారు. మల్టీప్లెక్సుల్లో కూడా షోలు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న థియేటర్లలో కూడా ఈ సినిమాకు వసూళ్లు బాగానే వస్తున్నాయి. దాంతో ‘కెజిఎఫ్’ మరో సారి పుంజుకొని సత్త చాటేందుకు రెడీ అవుతోంది.