ఎర్రన్నలతో పొత్తు పవన్‌కి కలిసొస్తుందా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు, విధానాలు కొంచెం వైవిధ్యంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఉద్యమాలు, పోరాటాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. చేగువేరా వంటి విప్లవ నాయకుడు తనకు ఆదర్శమంటాడు. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలను కాదని విపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు వామపక్షాలను ఆదరిస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో యువత వామ పక్షాల పట్ల సుముఖంగా ఉండేది. టెక్నాలజీ పెరగడం, ఉద్యోగావకాశాలు పెరగడంతో కెరీర్ పట్ల దృష్టి పెట్టి వామపక్ష రాజకీయాలను అంగీకరించడం లేదు.

మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల ఊసే పెద్దగా వినిపించలేదు. మహాకూటమిలో భాగమైన సీపీఐ కి, స్వతంత్రంగా పోటీ చేసిన సిపిఎం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వామపక్షాలకు కాస్తో కూస్తో గుర్తింపు ఉంది. అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోపోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు.

గతంలో విద్యుత్ చార్జీల పెంపుపై, పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడిన చరిత్ర ఎర్రజెండా పార్టీలకు ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఆ ప్రభావం ఎంత వరకు కలిసొస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేము. టెక్నాలజీ, అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్న యువతకి కమ్యూనిస్టు పార్టీల పట్ల వ్యతిరేకత ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. మరి అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేనపై ఆ ప్రభావం ఉండదా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వామపక్ష పార్టీలపై వ్యతిరేకంగా ఉన్నవారు జనసేనను కూడా వ్యతిరేకిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రెండు బలమైన పార్టీల మద్దతు కాదని ఎర్రన్నలతో కలిసి వెళుతున్న పవన్ కి వామపక్ష పార్టీల పొత్తు బలాన్నిస్తుందా లేక శాపంగా మారుతుందా చూడాలి.