ఈ మెగా హీరోలకు ఏమయింది.. బన్ని, చెర్రీ ఇలా అయిపోయారేంటి..??

అసలు ఈ మెగా బావమరుదులకు ఏమైంది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. మొన్నటికి మొన్న ఒక ఆడియో ఫంక్షన్ కి వెళ్లిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రెస్పెక్ట్ గురించి జనాలకు క్లాస్ పీకి నెటిజన్ల ట్రోల్స్ కి బలయ్యాడు.
ఇక, బావకి తానేం తక్కువ అనుకున్నాడో ఏమో బన్నీతో పోటీ పడి నెటిజన్లతో చివాట్లు తింటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘పడి పడి లేచే మనసు’ ఆడియో ఫంక్షన్ లో మైక్ అందుకున్న బన్ని…. అందరూ బడా వ్యక్తులకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని, గారు అంటూ సంబోధించాలని చెప్పుకొచ్చాడు. సినిమా ప్రమోషన్ కోసం బన్నీని పిలిపిస్తే అసలు సినిమాకు సంబంధం లేకుండా రెస్పెక్ట్ స్పీచ్ తో జనాలకు విసుగు తెప్పించాడనే కామెంట్స్‌ వినిపించాయి. దాంతో బన్నీకి ‘రెస్పెక్ట్ ఫోబియా’ పట్టుకుందని నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్  తన స్టైల్లో మాట్లాడి బావమరిదిని మించి ట్రోల్స్ తెచ్చుకుంటున్నాడు. తమ్ముడు వరుణ్ హీరోగా చేస్తున్న ‘అంతరిక్షం’ సినిమా ప్రీ రిలీస్ ఫంక్షన్ కి వెళ్లిన చరణ్ కొత్త పాఠం చెప్పుకొచ్చాడు.  సరే ఒక ఈవెంట్ కి అతిథిగా హాజరైనప్పుడు అక్కడున్న వాళ్ళందరిని పొగుడుతూ స్పీచ్ లు ఇవ్వడం కామన్. ఒక్కోసారి గొప్ప వ్యక్తులను పోలుస్తూ వాళ్లంత గొప్పగా ఎదగాలని చెప్పడం కూడా మాములే. కానీ అది కాస్త డోస్ ఎక్కువై  అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
తెలుగు ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలతో కూడిన దర్శకులు  రాజమౌళి, సుకుమార్, క్రిష్ అని, అలాంటి కోవలోకే అంతరిక్షం డైరెక్టర్ సంకల్ప్ రావాలని కోరుకున్నాడు చెర్రీ. అలా కోరుకోవడం మంచిదే కానీ ఇండస్ట్రీలో గొప్ప ఆలోచనలతో ఉన్నది ఈ ముగ్గురు దర్శకులేనా..? అని చెర్రీని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.  ఇండస్ట్రీలోని దర్శక దిగ్గజాలను మర్చిపోయి, చెర్రీ తనకు హిట్ లు ఇచ్చిన దర్శకులకు, కలిసి సినిమా చేయబోయే దర్శకులకు గొప్ప ఆలోచనలున్న దర్శకులు అనే టాగ్ ఇచ్చేసాడని మండిపడుతున్నారు.  మొత్తానికి ఈ మెగా బావ- మరుదులు పోటీలు పడి ట్రోలర్స్ కి కావాల్సిన స్టఫ్ ఇస్తున్నారు.