బ్లఫ్‌ మాస్టర్‌ మూవీ రివ్యూ & రేటింగ్‌

రివ్యూ : బ్లఫ్ మాస్టర్
తారాగణం : సత్యదేవ్, నందితశ్వేత, సిజ్జు, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, చైతన్య కృష్ణ తదితరులు
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర
సంగీతం : సునిల్ కశ్యప్
నిర్మాత : రమేష్ పి. పిల్లై
దర్శకత్వం : గోపి గణేశ్ పట్టాభి

హిట్ సినిమాను రీమేక్ చేయడం అంత ఈజీయేం కాదు. చాలాసార్లు నేటివిటీ అడ్డొస్తుంది. కానీ డబ్బు, దానికోసం మోసం చేసేవారికి సంబంధించిన సినిమాకు నేటివిటీ ఏముంటుంది. తమిళంలో హిట్ అయిన ‘శతురంగ వేట్టై’(2014)ని తెలుగులో చాలాకాలంగా రీమేక్ చేయాలని ప్రయత్నించారు. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ లోకి సత్యదేవ్ వచ్చాడు. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకూ ఆకట్టుకున్న ఈ టీమ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుందా.. లేక బ్లఫ్ చేసిందా అనేది చూద్దాం..

కథ :
చిన్నతనం నుంచి మోసాలు చేస్తూ డబ్బే లక్ష్యంగా జీవిస్తుంటాడు ఉత్తమ్ కుమార్(సత్యదేవ్). ఒక్కో ఊర్లో ఒక్కో పేరుతో చెలామణీ అవుతూ అక్కడి ప్రజల బలహీనతలతో ఆడుకుంటూ డబ్బులు సంపాదిస్తుంటాడు. తనకంటూ ఓ టీమ్ ఉంటుంది. వైజాగ్ లో తను ఓ ఫేక్ కంపెనీ పెడతాడు. అక్కడే అతనికి అవని(నందిత శ్వేత) పరిచయం అవుతుంది. అవని అతన్ని ఇష్టపడుతుంది. కానీ తను ఆమెకు ఉద్యోగం ఇచ్చిన తన బిజినెస్ కోసం వాడుకుంటాడు. ఆ మోసం బయటపడ్డ తర్వాత పారిపోతారు. మళ్లీ అక్కడే సముద్రలో ఓ మోసానికి ప్రయత్నిస్తూ పోలీస్ లకు పట్టుబడతాడు. అక్కడా ధనబలంతో బయటికి వస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ ను కొందరు విలన్స్ కిడ్నాప్ చేస్తారు. అతను గతంలో చేసిన ఓ మోసానికి సంబంధించిన ఇమ్మని లేదంటే చంపేస్తామంటారు. తన ఫ్రెండ్స్ కు చెప్పి డబ్బు తెమ్మంటారు. వాళ్లు మోసం చేస్తారు. దీంతో తనను కిడ్నాప్ చేసిన వారితో కలిసి మళ్లీ కొత్త మోసాలు మొదలుపెట్టి వాళ్లను పోలీస్ లకు పట్టిస్తాడు. ఆ తర్వాత అతని జీవితం ప్లాట్ ఫామ్ పైకి వస్తుంది..? అలా ఎందుకు జరిగింది..? ఉత్తమ్ మారాడా లేదా..? అవని ఏమైంది.. అనేది మిగతా కథ..

విశ్లేషణ :
బ్లఫ్ మాస్టర్.. సింపుల్ గా చెబితే మోసాల్లో ఆరితేరినవాడు అని అర్థం. అలాంటి అర్థం వచ్చేలాంటి సినిమాలు మనకు గతంలో చాలానే వచ్చాయి. అయినా ఈ ట్రైలర్ చూశాక ఏదో తెలియని ఇంట్రెస్ట్ కలిగింది. దర్శకుడు కూడా మా సినిమా ఆడియన్స్ ను బ్లఫ్ చేయదు అన్నాడు. యస్ అది నిజమే.. సినిమాలో మోసాలుంటాయి కానీ.. ప్రేక్షకుల్ని మోసం
చేయలేదు. ఊహించినదానికంటే ఎక్కువే సర్ ప్రైజ్ లు ఉంటాయి. చాలామందికి రిలేట్ అయ్యే మోసపూరిత సీన్స్ ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో జిల్లాల్లో జరిగిన ‘ఈముకోడి’ స్కీమ్, ఆమ్ మే, రైస్ ఫుల్లింగ్ వంటి స్కీముల వెనక స్కాములు ఎలా ఉంటాయో భలే స్టడీ చేసి చెప్పాడు దర్శకుడు. మరోవైపు కథనం కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా చాలా వేగంగా ఇంటర్వెల్ కు వచ్చేస్తుంది. ఇంటర్వెల్ కుముందు జరిగిన కోర్ట్ డ్రామా కూడా వాస్తవానికి దగ్గరగా కనిపించడం విశేషం..

అయితే సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఫస్ట్ హాఫ్ జోష్ ను చూపించలేకపోయాడు.. అనుకుంటారు. కానీ ‘డబ్బు వెంట పరుగులు తీసేవాడిని ఆ డబ్బే ముంచేస్తుంది..’.. ‘ఎంత పెద్ద గజ ఈతగాడైనా.. మురికి కాలువలో ఎక్కువ కాలం ఈదలేడు’.. వంటి డైలాగ్స్ కు రిలేట్ అయ్యే కథనం అది. నిజంగా మాటలు కూడా బావున్నాయి. హీరో మళ్లీ హీరోయిన్ ను కలిసి, పెళ్లి చేసుకుని తన పాత జీవితానికి స్వస్తి చెప్పి కర్ణాటక వెళ్లి బతుకుతుంటాడు. అక్కడికి మళ్లీ తన వల్ల జైలుకు వెళ్లిన టీమ్ వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తుంది. చంపాలనుకున్నప్పుడు మరోసారి వారికి వంద కోట్ల స్కామ్ గురించి చెబుతాడు. సినిమా మళ్లీ అక్కడి నుంచి ఊపందుకుంటుంది. ఆ వంద కోట్ల స్కామ్ కు అతను వేసే ఎత్తులు చూస్తే నిజంగా బయట రియల్ బ్లఫ్ మాస్టర్స్ ఎంత షార్ప్ గా ఉంటారో తెలుస్తుంది. చివర్లో సెంటిమెంట్ ను కూడా రంగరించారు కానీ.. ఇది మళ్లీ ఈ జానర్ కు సరిపోనట్టుగా అనిపిస్తుంది. మొత్తంగా బ్లఫ్ మాస్టర్ కంప్లీట్ ఎంగేజింగ్ మూవీ.

ఆర్టిస్టుల పరంగా చిన్న పాత్రలతోనే అత్యంత టాలెంటెడ్ అనిపించుకున్న సత్యదేవ్.. తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. ఈ పాత్రలో తనను తప్ప వేరెవరినీ ఊహించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అన్ని రకాల మోసాల్లోనూ ఆరితేరినవాడిలా అద్భుతమైన నటన చూపించాడు. నందిత శ్వేత స్క్రీన్ ప్రెజెన్స్ బావున్నా తన నటనలో కాస్త తమిళ అతి కనిపిస్తుంది. ఇతర పాత్రల్లో విలన్ ఆదిత్య మీనన్ ఆకట్టుకుంటాడు. బ్రహ్మాజీది డిఫరెంట్ రోల్. పృథ్వీకీ కొత్త పాత్రే. పోలీస్ గా సిజ్జు ఓకే.. సత్యదేవ్ ఫ్రెండ్స్ కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు.
టెక్నికల్ గా కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతంతో పాటు, పాటలూ మెలోడీయస్ గా ఉన్నాయి. కానీ మాంటేజ్ ల్లాగా కనిపించడంతో ఎక్కువగా రిజిస్టర్ కాలేకపోయాయి. సినిమాటోగ్రఫీ సూపర్బ్. మాటలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. నిర్మాణ విలువలూ చాలా బావున్నాయి. ఫైనల్ గా ఇది దర్శకుడి సినిమా. తనకు ఏం కావాలనేది పూర్తిగా తీసుకున్నాడు. కొన్ని చోట్ల కథనం గాడి తప్పినా.. చాలా వరకూ ఆకట్టుకున్నాడు..

ప్లస్ పాయింట్స్ :
సత్యదేవ్
కథ, కథనం
సినిమాటోగ్రఫీ
మాటలు
దర్శకత్వం

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
కామెడీ లేకపోవడం
సినిమాటిక్ లిబర్టీ
ఫైనల్ గా : ఆకట్టుకునే బ్లఫ్ మాస్టర్
రేటింగ్ : 2.75/5

– యశ్వంత్