అంతరిక్షం మూవీ రివ్యూ & రేటింగ్‌…!!

 

రివ్యూ : అంతరిక్షం
తారాగణం : వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి, రెహమాన్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్
సంగీతం : ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్
నిర్మాతలు : క్రిష్, రాజీవ్ రెడ్డి
దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

సంకల్ప్ రెడ్డి.. ఫస్ట్ మూవీతోనే దేశవ్యాప్తంగా బెస్ట్ అప్రియేషన్స్ అందుకున్నాడు. చాలామందికి తెలియని పాకిస్తాన్ యుద్ధ నౌక ఘాజీని కథావస్తువుగా చేసుకుని అతను రూపొందించిన లో బడ్జెట్ హై క్లాస్ మూవీకి ఎంటైర్ ఆడియన్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు అంతరిక్షం అంటూ వచ్చాడు. ఫస్ట్ మూవీతోనే అతని టాలెంట్ తెలుసు కాబట్టి..ఈ మూవీపై ఎవరికీ అనుమానాల్లేవు. పైగా మంచి కథలు ఎంచుకుంటోన్న వరుణ్ తేజ్ హీరో, స్టార్ డైరెక్టర్ క్రిష్ నిర్మాత కావడంతో పాటు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇక అంతరిక్షం విజయం లాంఛనమే అనుకున్నారు. మరి అలా జరిగిందా.. అంతరిక్షం అందర్నీ ఆకట్టుకుందా..?

కథ :
ఇండియన్ స్పేస్ సెంటర్.. మిహిర అనే ఓ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. ఆ శాటిలైట్ లో సాంకేతిక లోపాలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించాలంటే ఆ శాటిలైట్ కోడ్ తెలిసిన వ్యక్తి మరణిస్తాడు. మరోవ్యక్తి దేవ్( వరుణ్ తేజ్) ఉద్యోగం మానేసి వెళ్లిపోతాడు. అతని గురించి తెలిసిన మరో స్పేస్ సెంటర్ ఎంప్లాయ్ అందించిన అడ్రెస్ తో అతన్ని వెదుకుతూ వెళుతుంది అక్కడ పనిచేసే ప్రతిభావంతమైన శాస్త్రవేత్త రియా(అదితిరావు). అతన్ని వెదుకుతూ తను రామేశ్వరం వెళుతుంది. అక్కడ దేవ్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంటాడు. రియా సమస్య చెప్పి అతన్ని సాయం అడుగుతుంది. అతను ఒప్పుకోడు. ఆ స్పేస్ సెంటర్ తో తనకేం సంబంధం లేదంటాడు. మిహిర గురించి చెబితే.. కోడ్ మెయిల్ చేస్తా మీకు అంత ‘తెలివి’ ఉంటే దాని ద్వారా సమస్య సాల్వ్ చేసుకోమంటాడు. అప్పుడు రియా అతనికి విప్రయాన్ శాటిలైట్ గురించి చెబుతుంది. దేవ్ ఐదేళ్ల క్రితం పంపించిన శాటిలైట్ అది. దాని తర్వాత అతని జీవితం తలకిందులవుతుంది. అదెలా జరిగింది.. ఇప్పుడు దేవ్ మిహిర కు సాయం చేశాడా..? విప్రయాన్ వల్ల దేశానికి వచ్చిన గౌరవమేంటీ అనేది మిగతా కథ..

విశ్లేషణ :
దర్శకుడు సంకల్ప్ ఆలోచనా విధానాలు హై స్టాండర్డ్స్ లో ఉంటాయని మొదటి సినిమాకే తెలిసింది. అవుటాఫ్ ది బాక్స్ గా అతను ఆలోచిస్తాడు. అందుకే ఘాజీ వచ్చింది. ఇప్పుడు అంతరిక్షం. నిజానికి అంతరిక్షంను కథా వస్తువుగా చేసుకోవడం ఓ సాహసం. ఎందుకంటే ఆ భాష అందరికీ అర్థం కాదు. ముఖ్యంగా బి, సి సెంటర్ ప్రేక్షకులకు. కానీ ఉత్కంఠగా కథనం నడిపించగలిగితే కొంత వరకూ ఆకట్టుకోవచ్చు. కానీ ఇక్కడ సంకల్ప్ ఇబ్బంది పడ్డాడు. విప్రయాన్ అనే శాటిలైట్ ను పంపించే సైంటిస్ట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ముందు ఆ విప్రయాన్ విశిష్టత గురించి కొంతైనా చర్చించి ఉండాల్సింది. అలా జరక్కపోవడంతో ఆ విప్రయాన్ తో దేవ్ కు ఉన్న అనుబంధం ఆడియన్ కు కనెక్ట్ కాకుండా పోయింది. మరవైపు దీని ద్వారా దేశ ప్రతిష్టను పెంచొచ్చు అనే పాయింట్ ను కూడా ఎలివేట్ చేయకపోవడంతో దేశభక్తి అనే మాట కూడా పలచగా మారింది.

ఫస్ట్ తెలుగు స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీగా వచ్చిన అంతరిక్షంలో అన్నీ ఉన్నాయి. కానీ ఎటొచ్చీ వాటిని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలోనే దర్శకుడు తడబడ్డాడు. ఎమోషనల్ గా ఉండాల్సిన ప్రేమకథ పండలేదు. ఓ స్పేస్ సెంటర్ లోకి ఎవరు పడితే వాళ్లు(ఆసెంటర్ డైరెక్టర్ కూతురైనా సరే) అలా ఎప్పుడు బడితే అప్పుడు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రక్షణ పరంగా ఎంతో పటిష్టంగా ఉండాల్సిన స్థలం సాధారణ బంగ్లాలాగా ఉంటుంది. ఇది దర్శకుడి లోపమే. ఇక మిహిర కోసం వెళ్లి.. ఆకాశంలోనే మరో సాహసం చేస్తాడు దేవ్. అదే ఐదేళ్ల క్రితం తప్పిపోయిన విప్రయాన్ శాటిలైట్ ను తిరిగి సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టడం.. తద్వారా చంద్రుడిపై నివాసయోగ్యమైన స్థలాలు అన్వేషించే పని చేస్తాడు. బట్.. ఇది ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది. దేవ్ అంతరిక్షంలో సాహసం చేస్తోంటే.. అదేదో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో చేసే సాహసంలా ఉంటుందే కానీ.. అతను దేశం మొత్తం గర్వించే పని చేస్తున్నాడన్న భావన కలగదు. కాకపోతే ఆ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడు సంకల్ప్.. సెకండ్ హాఫ్ మొత్తం స్పేస్ లోనే సాగే ఈ కథనం మరీ స్లోగా ఉండటం కూడా కొంత ఇబ్బందిగా మారింది. అఫ్ కోర్స్ ఈ తరహా సినిమాలు అలానే ఉంటాయి. కానీ తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది.

మరి మొత్తం మైనస్ లేనా అంటే కాదు.. టెక్నికల్ గా అత్యున్నతంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడనంత క్వాలిటీ గ్రాఫిక్స్ చూస్తాం. సెకండ్ హాఫ్ అంతా మనం కూడా ఆకాశంలోనే చుక్కల మధ్య ఉంటాం. రాకెట్ లో ప్రయాణం చేస్తాం.. ఇవన్నీ బానే ఉన్నా.. ఓ అద్భుతమైన కథగా మారాల్సిన అంతరిక్షాన్ని ఎమోషనల్ గా ఆడియన్ కు కనెక్ట్ చేయడంలో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది.

టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉన్న ఈ సినిమా కథన పరంగా కూడా అదే స్థాయిలో ఉంటే అంతర్జాతీయ స్థాయి సినిమా అనిపించుకుని ఉండేది. కానీ ఆయా శాటిలైట్స్ ఏం చేస్తాయి.. వాటి వల్ల దేశానికి వచ్చే ఉపయోగాలేంటీ అనేది చర్చించి ఆ తర్వాత హీరో వాటి కోసం సాహసం చేసి ఉంటే బావుండు అనిపిస్తుంది. అలా లేకపోవడంతో అతనేదో తన ‘జాబ్’ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప.. దేశం కోసం ప్రాణ త్యాగానికే సిద్ధపడ్డాడు అన్న భావన రాదు. ఈ విషయంలో దర్శకుడిదే వైఫల్యం అనక తప్పదు. కొన్నిసార్లు కథను నేరుగా మొదలుపెట్టడం కూడా మైనస్ అవుతుంది. అంటే పాయింట్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోవడం. దాన్ని కాస్త వివరంగా చెప్పి.. ఆనక అసలు విషయంలోకి వెళ్లడం సంప్రదాయ విషయం. అది తప్పిన దర్శకుడు.. సమస్యను కూడా ఎలివేట్ చేయలేకపోయాడు.

నటన పరంగా వరుణ్ తేజ్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. తన ప్రేయసిని.. తను సొంత బిడ్డలా చూసుకునే విప్రయాన్ శాటిలైట్ ను మిస్ అయిన బాధను అద్భుతంగా పోట్రెయిట్ చేశాడు. తర్వాత అత్యధిక మార్కులు అదితిరావుకే పడతాయి. ఆ అమ్మాయి తన పాత్రలో నిలిచిపోయింది. ఇక సత్యదేవ్, రహమాన్, లావణ్య ఆకట్టుకుంటే అవసరాల శ్రీనివాస్ పాత్ర దేవ్ సహాయకుడుగా మెప్పిస్తుంది.

టెక్నికల్ గా
టెక్నికల్ గా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మామూలుగా మన సినిమాల్లో గ్రాఫిక్స్ బావుంటే హాలీవుడ్ స్థాయి అంటాం. కానీ ఇకపై ఆ మాట అవసరం లేదు. ఓ హాలీవుడ్ సినిమాలో గ్రాఫిక్స్ బావుంటే ఏమని అంటామో.. ఇక్కడా అలాగే అనాలి. లేదంటే ఓ గ్రావిటీ, ఓ ఇంటర్ స్టెల్లార్ చూస్తోన్న అనుభూతిని కలిగిస్తుందీ సినిమా.. అంటే ఆ స్థాయిలో మనమూ ఉన్నామనే. ఆశ్చర్యం ఏంటంటే.. ఆ స్థాయిని అత్యంత తక్కువ బడ్జెట్ లో ఇచ్చాడు దర్శకుడు. అలాగే అచ్చంగా ఓ స్పేస్ సెంటర్ నే చూస్తున్నామా అనేలా అద్భుతమైన ఆర్ట్ వర్క్ తో ఆశ్చర్యపరుస్తుందీ చిత్రం. మొత్తంగా టెక్నికల్ వండర్ గా నిలిచిన అంతరిక్షం కథ, కథనాల్లో కూడా కాస్త బలముండి ఉంటే ఇది ఖచ్చితంగా ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనదగ్గ స్థాయి చిత్రమే..

ప్లస్ పాయింట్స్ :
గ్రాఫిక్స్
విజువల్ ఎఫెక్ట్స్
ఆర్టిస్టులు
ఆర్ట్ వర్క్
సెట్స్

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
లవ్ ఎపిసోడ్
కథనం

ఫైనల్ గా : జస్ట్ ఏ టెక్నికల్ వండర్

రేటింగ్ : 2.75/5

– యశ్వంత్