ad

ఒకప్పుడు ఫ్రైడే వచ్చిందంటే చాలు.. ఫిల్మీ లవర్స్ లో ఓ రేంజ్ లో సందడి కనిపించేది. కానీ ఓటిటిలు వచ్చిన తర్వాత ఆ సందడి పెద్దగా కనిపించడం లేదు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచారు. చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదు. దీంతో థియేటర్స్ లో మునుపటి కళ కనిపించడం లేదనే చెప్పాలి. అయినా కొన్ని సినిమాలు మాత్రం ఆసక్తిని పెంచుతాయి. మరికొన్ని క్లియరెన్స్ సేల్ లో కొట్టుకుపోతాయి. ఈ శుక్రవారం ఈ రెండూ జరిగాయి.

ముందుగా ఆసక్తి పెంచిన సినిమా శేఖర్. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదలైంది. మళయాలంలో హిట్ అయిన జోసెఫ్ అనే చిత్రానికి రీమేక్ గా జీవిత డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ఇది. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ. ఇలాంటివి రాజశేఖర్ కు బాగా కుదురుతాయి. పైగా హీరో పోలీస్ కాబట్టి ఖచ్చితంగా శేఖర్ విజయం సాధిస్తుంది అనుకుున్నారు. అయితే మామూలుగా మళయాల సినిమాలు చాలా స్లోగా ఉంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన తెలుగు వెర్షన్ లో అవేవీ కనిపించలేదు. పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఇంకాస్త ఎఫెక్టివ్ గా తెలుగులో అయినా రాసుకుని ఉండాల్సింది. కేవలం మక్కీకి మక్కీ దించే ప్రయత్నమే చేశారు. ఓ క్రూరమైన క్రైమ్ సీన్ తర్వాత పోలీస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు శేఖర్. ఆ తర్వాత అతని భార్య వెళ్లిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అప్పటికే వీరికి ఓ కూతురు ఉంటుంది. ఆమె ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో కుంగిపోతాడు శేఖర్. కొన్నాళ్ల తర్వాత తన మాజీ భార్య కూడా అదే చోట ప్రమాదానికి గురవుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్ పర్ట్ అయిన శేఖర్ కు అవి హత్యలు అనే డౌట్ వస్తుంది. అందుకు కారణమేంటీ.. అవి హత్యలేనా.. అయితే ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనే పాయింట్ చుట్టూ సెకండ్ హాఫ్ నడుస్తుంది. అయితే ఇలాంటి కథల్లో ఉండాల్సిన వేగం పూర్తిగా కొరవడడంతో మంచి కథే అయినా శేఖర్ కాస్త తక్కువగా ఆకట్టుకుంటుంది.

 

ఇక శేఖర్ తో పాటుక్లియరెన్స్ సేల్ లా వచ్చిన సినిమాలు సంపూర్ణేష్ బాబు నటించిన ధగడ్ సాంబ, బండ్ల గణేష్ డేగల బాబ్జీ తో పాటు కొత్తవాళ్లు నటించిన ధ్వని. ఈ రెండూ వచ్చాయన్న సంగతి కూడా సగం మంది ప్రేక్షకులకు తెలియదు. అంటే ఇవి క్లియరెన్స్ సేల్ అనే కదా అర్థం. ఏదో టైమ్ దొరికింది కాబట్టి వదిలేసినట్టుగా ఉన్నాయి. పైగా ఈ రెండు సినిమాలు కూడా అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

ఇక సింగిల్ లొకేషన్, సింగిల్ ఆర్టిస్ట్ అంటూ తమిళ్ లో వచ్చిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేసిన సినిమా డేగల బాబ్జీ. తమిళ్ నుంచి నేషనల్ అవార్డ్ తో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా సాధించిన ఈచిత్రానికి తెలుగులో భారీ అవమానం జరిగింది. హైదరాబాద్ లో కేవలం ఐదు షోస్(ఐదు థియేటర్స్ కాదు) మాత్రమే మొదటి రోజు అవకాశం వచ్చింది. అది కూడా అన్నీ ఊరి చివరి థియేటర్స్ లోనే. సో.. బండ్ల గణేష్ కు ఎంత ఇమేజ్ ఉందో తెలుస్తోంది కదా.. అదీ మేటర్.. కాస్త అంచనాలున్న శేఖర్ వాటిని అందుకోలేదు. అలాగని మరీ తీసిపారేసే సినిమా కాదు.. సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. మిగతావన్నీ జస్ట్ అలా వచ్చాయంతే.

, , , , , , , , , ,