తెలుగు సినిమా.. ఇకపై పాన్‌ ఇండియా సినిమా!

తెలుగు సినిమా.. ఇకపై పాన్‌ ఇండియా సినిమా!

తెలుగు సినిమా ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాగా మారబోతుంది. అగ్ర హీరోల సినిమాలన్నీ బహుభాషా చిత్రాలుగా రూపొందుతున్నాయి. `బాహుబలి` నుంచి ఈ ట్రెండ్‌ ఊపందుకుంది. ఆ తర్వాత రూపొందిన `సాహో`ని పాన్‌ ఇండియా రేంజ్‌లోనే రూపొందించి విడుదల చేశారు. అది భారీ కలెక్షన్లని రాబట్టి పాన్‌ ఇండియా సినిమాకి క్రేజ్‌ని తీసుకొచ్చింది. `బాహుబలి`ని స్ఫూర్తిగా తీసుకుని కన్నడ చిత్రం `కేజీఎఫ్‌`ని సైతం పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందించి విడుదల చేశారు. అది సంచలన విజయం సాధించింది. చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి`ని కూడా పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించి విడుదల చేశారు. అది కూడా మంచి విజయాన్నే సాధించింది. ఇదే స్ఫూర్తితో అనుష్క నటించిన `నిశ్శబ్దం` కూడా పాన్‌ ఇండియా తరహాలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో రూపొందిస్తున్నారు. హర్రర్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల వంటి ప్రధాన తారాగణం నటించింది. ఇది కరోనా వల్ల వాయిదా పడి, విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్నాయి. అందులో ఒకటి చిరంజీవి నటిస్తున్న `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సందేశం, వాణిజ్య అంశాలు, వినోదం ప్రధానంగా రూపొందుతుంది. ఇందులో కీలక పాత్రలో రామ్‌చరణ్‌ కూడా నటించనున్నారు. చిరు సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించాలని చిరు, కొరటాల శివ, రామ్‌చరణ్‌ భావిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 
దీంతోపాటు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ ఆర్‌ఆర్‌` కూడా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రారంభంలోనే చిత్ర బృందం ఈ విషయాన్ని తెలిపింది.  డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ  చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. వారి సరసన అలియాభట్‌, ఒలీవియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు.  మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కీలక పాత్ర పోషించనున్నట్టు, ఆయన ఎన్టీఆర్‌కి బాబాయ్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నారు. ఇది తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌, రామ్‌చరణ్‌ పాత్ర టీజర్‌ని కూడా ఆయా భాషల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటికి విశేషమైన స్పందన లభించింది. `బాహుబలి`, `సాహో` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ పాన్‌ ఇండియా చిత్రాలతో తన సత్తా చాటిన ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న రాధాకృష్ణ చిత్రం కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిస్తున్నారు. హిందీతోపాటు సౌత్‌కి చెందిన అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. 
విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఫైటర్‌`ని పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కరణ్‌ జోహార్‌, పూరీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. 
దీంతోపాటు అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న `పుష్ప` సైతం పాన్‌ ఇండియా సినిమాల జాబితాలో చేరింది. ఇటీవల టైటిల్‌, ఫస్ట్ లుక్‌ ప్రకటన సందర్భంగా ఐదు భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనునున్నట్టు కన్ఫమ్‌ చేశారు. ప్రభాస్‌ సినిమాలను, `ఆర్‌ ఆర్‌ ఆర్‌`ని దృష్టిలో పెట్టుకుని, ఇటీవల `అల వైకుంఠపురములో` చిత్ర సక్సెస్‌ ని బట్టి ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి దారిలో పవన్‌ కళ్యాణ్‌ కూడా పయణిస్తున్నాడు. తాను క్రిష్‌ దర్శఖత్వంలో నటిస్తున్న `విరూపాక్ష` చిత్రాన్ని పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ రాబిన్‌ హుడ్‌ పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఆయనకు జోడీగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే నిజమైతే ఇక పవన్‌ కళ్యాణ్‌ ఇకపై పాన్‌ ఇండియాస్టార్‌ కాబోతున్నారని చెప్పొచ్చు.  అలాగే ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందే చిత్రాన్ని కూడా పాన్‌ ఇండియాగానే తెరకెక్కించాలని చిత్ర బృందం భావిస్తుందట. తాను నటిస్తున్న `ఆర్‌ ఆర్‌ ఆర్‌` పాన్‌ ఇండియా సినిమాగా విడుదలవుతున్న నేపథ్యంలో తనకు భారీ మార్కెట్‌ ఏర్పడనుంది. దీంతో ఇక తన సినిమాలని కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లోనే రూపొందించాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నారు. మంచు విష్ణు నటిస్తున్న `మోసగాళ్ళు` కూడా బహుభాషా చిత్రంగా రూపొందుతుంది.  ఇందులో కాజల్‌ కథానాయికగా, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. 
వీటితోపాటు ఇతర భాషల్లో కమల్‌ హాసన్‌ నటిస్తున్న `భారతీయుడు 2`, యశ్‌ హీరోగా రూపొందుతున్న `కేజీఎఫ్‌` సీక్వెల్‌ `కేజీఎఫ్‌ 2`, మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న `పొన్నియిన్‌ సెల్వన్‌`, అలాగే మోహన్‌లాల్‌ నటించిన `మరక్కర్‌`, హిందీలో `బ్రహ్మాస్త్ర` వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న విషయం తెలిసిందే. అలాగే రజనీకాంత్‌ సినిమాలు కూడా హిందీతోపాటు సౌత్‌ భాషలన్నింటిలోనూ విడుదలవుతుంటాయి. 

Leave a Reply

Your email address will not be published.