శనివారం రాత్రి ఘట్టమనేని కుటుంబ సభ్యుల జీవితాల్లోకి పెను చీకటి తీసుకొచ్చింది. c పెద్ద కొడుకు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాధాన్ని నింపింది. 56 ఏళ్లకే రమేష్ బాబు చనిపోవడం దిగ్భ్రాంతికి లోను చేసింది. కాలేయ సంబంధ వ్యాధితో రమేష్ బాబు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సందర్శనార్థం రమేష్ బాబు భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు. అక్కడి నుంచి 12 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. ఇటీవలే కోవిడ్ బారిన పడటం వల్ల మహేష్ బాబు సోదరుడి అంత్యక్రియలకు రాలేకపోతున్నారు. ఇటీవలే మహేష్ బాబుకు కరోనా సోకింది. దాంతో హోం క్వారెంటైన్ లో ఉంటున్నారు. కరోనా సోకడం వల్ల సోదరుడు రమేష్ బాబును చివరి చూపులు కూడా చూడకుండా అయ్యింది. ఎంతో ప్రేమించిన సోదరుడి అంత్యక్రియలకు మహేష్ బాబును కోవిడ్ వెళ్లకుండా చేసింది.

రమేష్ బాబు మహేష్ బాబు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉండేవారు. సోదరులకంటే స్నేహితుల్లా కలిసి గడిపేవారు. అక్కల కంటే అన్నయ్య రమేష్ బాబు అంటే మహేష్ కు అభిమానం ఎక్కువ. కృష్ణతో కలిసి రమేష్ బాబు చేసిన చాలా చిత్రాల్లో మహేష్ బాబు నటించారు. ముగ్గురు కొడుకులు, బజారు రౌడీ, కృష్ణ గారి అబ్బాయి లాంటి అనేక చిత్రాలు రమేష్ బాబు మహేష్ బాబు సోదరుల నట ప్రతిభను చూపిస్తాయి. బయట ఎంత అల్లరి చేసినా..స్క్రీన్ మీద మాత్రం పాత్రల్లా మారిపోయి నటించేవారు ఈ బ్రదర్స్. బాల నటుడిగా సినిమాలు ఆపేసిన మహేష్ బాబు చదువుల మీద దృష్టి పెట్టగా…సామ్రాట్ చిత్రంగా హీరోగా తెరంగేట్రం చేశారు రమేష్ బాబు. కొన్నేళ్ల పాటు తనదైన శైలిలో మూవీస్ చేశారు. చిన్నకృష్ణుడు, కలియుగ అభిమన్యుడు, బ్లాక్ టైగర్ లాంటి చిత్రాలు రమేష్ బాబును ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఎన్ కౌంటర్ సినిమా తర్వాత వెండితెరకు దూరమయ్యారు రమేష్ బాబు. ఆ తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు.

రమేష్ బాబు క్రమంగా నిర్మాణరంగం వైపు ఆసక్తి చూపగా..అక్కడా మహేష్ బాబు సోదరుడికి సపోర్ట్ గా నిలబడ్డారు. అర్జున్, అతిథి సినిమాలకు డేట్స్ ఇచ్చి సినిమాలు చేయించారు. అవి సరిగ్గా ఆదరణ పొందక, అన్నయ్య రమేష్ బాబు ఆర్థికంగా నష్టపోతే దూకుడు చిత్రానికి సమర్పకులుగా ఉండేలా చూశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ వ్యక్తిగతంగా, వృత్తిలోనూ అన్నయ్య రమేష్ బాబు అంటే మహేష్ చాలా ప్రేమ చూపించారు. అలాంటి సోదరుడు భౌతికంగా దూరమయినప్పుడు నివాళి అర్పించలేని పరిస్థితి మహేష్ కు ఏర్పడటం నిజంగా దురదృష్టం.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , ,