ad

కెరీర్ లో తొలి విజయం ఇచ్చే మజా వేరే ఉంటుంది. ఆ విజయం మరిన్ని సినిమాలకు బాటలు వేస్తుంది. అయితే కొందరికి అది రాచబాట అవుతుంది. మేన్లీ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ఇలాంటి జర్నీలోనే సాగుతున్నాడు. హీరోగా ఫస్ట్ మూవీ పెళ్లి సందడితో కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకున్న రోషన్ ఇప్పుడు వరుసగా రెండు పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు. అంటే ఫస్ట్ హిట్ అతనికి బిగ్ బ్యానర్స్ కు రూట్ క్లియర్ చేసిందన్నమాట..
పెళ్లి సందడి.. విడుదలై పాతికేళ్లు దాటిన తర్వాత అదే టైటిల్ తో అదే హీరో తనయుడు హీరోగా పరిచయం అయిన సినిమా. కాస్త విశేషంగా అనిపించిన ఈ ఫీటే ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకుంది. పైగా పక్కింటి అబ్బాయ్ లాంటి పాత్రలు ఎన్నో చేసిన శ్రీకాంత్ తనయుడు హీరోగా వస్తున్నాడంటే ఆడియన్సెస్ లోనూ అదో రకమైన క్యూరియాసిటీ. దీన్ని డబుల్ చేస్తూ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ మొదటి సారి నటించేశాడు. అటు హీరోయిన్ గా కొత్త అమ్మాయి శ్రీలీల ఛలాకీదనంతో పెళ్లి సందడి సినిమా అంతా గత సినిమాను గుర్తుకు తెస్తూ బాక్సాఫీస్ వద్ద ఊహించని మాయ చేసింది.నిజానికి పెళ్లి సందడి సినిమాలో కొత్త కథేం లేదు. కానీ కలర్ ఫుల్ ఫ్రేమింగ్స్, చూడగానే ఆకట్టుకునే ప్రధాన జంట.. కన్నుల పండగలా.. రాఘవేంద్రరావు మార్క్ లో కనిపించిన పాటలు, అక్కడక్కడా మంచి హాస్యం.. ఇవన్నీ కథాలోపాన్ని కప్పెట్టాయి. అందుకే ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకుంది. మరి ఇలాంటి కమర్షియల్ హిట్ తో ఇంటర్ డ్యూస్ అయిన కుర్రాడి తర్వాతి సినిమాలు ఎలా ఉంటాయి అనుకుంటామో.. అంతకంటే భిన్నంగా రాబోతున్నాయి. అందులో మొదటిది వైజయంతీ మూవీస్ బ్యానర్ లో వస్తుండటం విశేషం.
రోషన్ నెక్ట్స్ మూవీని ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. మరి ఈ బ్యానర్ లో సినిమా అంటే మనోడికి గ్యారెంటీ హిట్ అనుకోవచ్చేమో. అలాగే ఆ తర్వాత చిత్రాన్ని మోస్ట్ ప్రామిసింగ్ బ్యానర్ అనిపించుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతోంది. సితార సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనే ట్యాగ్ ఎఫ్పుడో వచ్చేసింది. సో.. పెళ్లి సందడితో కెరీర్ మొదలుపెట్టిన రోషన్ కెరీర్ కూడా ఇకపై ఇలాంటి పెద్ద బ్యానర్స్ లో మరింత పెద్ద సందడిగా ఉంటుందా లేదా అనేది చూడాలి.

, , , , , , , , , , , , ,