Advertisement
‘సింహా’, ‘లెజెండ్’ లో ఉన్నదేంటి? ‘అఖండ’లో లేనిదేంటి?
Latest Movies Tollywood

‘సింహా’, ‘లెజెండ్’ లో ఉన్నదేంటి? ‘అఖండ’లో లేనిదేంటి?

Advertisement

అఖండ విజయం స్ఫష్టమైంది..అయినా అక్కడక్కడా అసంతృప్తి వినిపిస్తూనే ఉంది. విజయం బాక్సాఫీస్ లెక్కల్లో ఉంటే, కంప్లీట్ ఫిల్మ్ కాలేదనేది ఏ క్లాస్ నుంచి వస్తున్న విమర్శ. కమర్షియల్ సినిమా క్యాటర్ చేయలేని చాలా విషయాలు అఖండ లోనూ వదిలేశారు. బీ, సీలు, ఫ్యాన్స్ ను టార్గెట్ చేయడంతో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు అఖండ దూరమైందనే చెప్పాలి. అఖండలో ఏది బాగుంది ఏది బాగాలేదో చూస్తే…

బాలకృష్ణ లాంటి స్టార్ మాస్ హీరోను ఎలా ప్రెజంట్ చేయాలో దర్శకుడు బోయపాటికి బాగా తెలుసు. సింహా నుంచి బాలకృష్ణ కోసం ఓ మీటర్, ఓ ఫార్ములా తయారు చేసి పెట్టుకున్నాడీ దర్శకుడు. సింహా, లెజెండ్ సినిమాలను రూపొందించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. మూడో సినిమా అఖండతోనూ హిట్ కొట్టాడు. అయితే ఆ రెండు చిత్రాల్లో ఉన్నదీ ఈ అఖండలో లేనివీ పరిశీలిస్తే..సింహా లో హీరో ఓ డాక్టర్. రోగి జబ్బుకు మందులే కాదు, సమాజంలోని రుగ్మతలకు తనదైన శైలిలో చికిత్స చేస్తుంటాడు. డాక్టర్ క్యారెక్టర్ లో స్టార్ హీరో చేసిన హీరోయిజం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. బాలకృష్ణను ఇలా చూపించడం కూడా అప్పటి దాకా లేదు. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు సినిమాల్లో ట్రైన్ పక్కన నడిచొచ్చే సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పించడం వరకే చేశారు. కానీ సింహాతో బాలకృష్ణను కొత్త మేకోవర్, డైలాగ్ మాడ్యులేషన్ లోకి తీసుకొచ్చారు బోయపాటి. అది సినిమా విజయంలో కీలకమైంది. మంచి కథా కథనాలు ఉండటం సింహాకు బలాన్నిచ్చింది.

సింహా సక్సెస్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి లెజెండ్ లోనూ ఊరికోసం బతికే వ్యక్తిగా బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రజల కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా బతికే ఆ పాత్ర ఔన్నత్యం, త్యాగం జనాలను మెప్పించాయి. ప్రజల కోసమే వాడు మనల్ని వదిలిపెట్టి వెళ్లాడు అని ఓ పెద్దావిడ క్యారెక్టర్ హీరోయిన్ తో చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తాయి. లెజెండ్ లో ఇలాంటి మ్యాజిక్ మూవ్ మెంట్స్ బాగా పండాయి. విలన్ గా జగపతి బాబు అప్పీయరెన్స్ లెజెండ్ కు బాగా పనికొచ్చింది. దేవి శ్రీప్రసాద్ సంగీతంలో హీ ఈజ్ ద లెజెండ్ థియేటర్ ను ఊపేసింది. నీ కంటి చూపుల్లో అని సాగే డ్యూయెట్ ఫీమేల్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, జనం కోసం బతికే హీరోయిజం కలగలిపి లెజెండ్ ను సూపర్ హిట్, కంప్లీట్ ఫిల్మ్ చేశాయి.

అఖండ విషయానికొస్తే..ఈ సెంటిమెంట్, ఎమోషన్ వదిలేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కేవలం హీరోయిజం ఎలివేషన్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఆ బిల్డప్ షాట్స్ బిట్స్ బిట్స్ గా ఎంజాయ్ చేసేలా ఉన్నా, ఓవరాల్ సినిమాకు అతకలేదు. పైగా విపరీతమైన హింస, ఫైట్స్…ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ వైపు చూసేందుకు భయపడేలా చేస్తున్నాయి. అఖండ గెటప్ జఢిపించేలానే ఉంది. సింహా, లెజెండ్ లో తాను ఏ లాజిక్ లతో, ఎమోషన్స్ తో , సెంటిమెంట్స్ తో మెప్పించాడో వాటిని అఖండలో మర్చిపోయాడు దర్శకుడు. హీరో ఏది చెబితే అది వేదం అన్నట్లు, ఆ మాటకు తిరుగేలేదన్నట్లు కథనాన్ని నడిపాడు. ఎన్ఐఏ లాంటి అధికారి అఖండ చెప్పింది విని కిక్కురుమనకుండా వెళ్లిపోవడం క్రియేటివ్ ఫ్రీడమ్ కు పరాకాష్ట. హీరోయిన్ మురళి పాత్రకు ఇంప్రెస్ అయ్యి, ఆ లవ్ స్టోరి అప్పుడే పెళ్లి, పిల్లల దాకా రావడం ఫస్టాఫ్ ను త్వరగా ముగించేసి, సెకండాఫ్ లో అఖండ ఆగమనం తీసుకురావాలనే ఆత్రుతనే చూపించింది. థమన్ నేపథ్య సంగీతం చెవుల తుప్పు వదిలించింది గానీ, పాటల్లో ఒకటీ అరా మాత్రమే చెప్పుకోదగినవి. వినయ విధేయ రామలో ఇలాంటి యాక్షన్ సీన్స్ చేసి అభాసుపాలైన దర్శకుడు..మళ్లీ ధైర్యం చేసి తలనరికే సీన్స్ పెట్టాడంటే కేవలం ఆ ధైర్యం బాలకృష్ణను చూసే అనుకోవచ్చు.

Advertisement