Advertisement
సమ్మతమే ట్రైలర్ టాక్..
Latest Movies Tollywood

సమ్మతమే ట్రైలర్ టాక్..

Advertisement

కిరణ్ అబ్బవరపు.. ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోన్న కుర్రాడు. ఫస్ట్ మూవీ రాజా వారు రాణివారుతో ఆకట్టుకున్నా.. ఆ తర్వాత ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఆ మధ్య వచ్చిన ఎస్.ఆర్ కళ్యాణమండపం కాస్త ఓకే అనిపించుకున్నా.. వేగంగా ఎదగాలనుకుంటే ఇవి సరిపోవు. నటుడుగానే కాక.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పైనా పట్టు ఉన్న కిరణ్ కళ్యాణమండపం చిత్రానికి ఈ రెండూ అందించాడు కూడా. కానీ ఆశించినంత పెద్ద విజయం కాదది. తర్వాత సెబాస్టియన్ అనే సినిమా చేశాడు. రేచీకటి ఉన్న కానిస్టేబుల్ అనే పాత్రలో కనిపించినా.. సెబాస్టియన్ గా డిజాస్టర్ అయ్యాడు. ఈ టైమ్ లో మరోసారి తన లక్ ను చెక్ చేసుకునేందుకు ఇప్పుడు సమ్మతమే అనే చిత్రంతో వస్తున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించి సినిమా ఇది. ఈ నెల 24న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.

ఇంట్లో ఆడపిల్ల ఉండాలి అనే తండ్రి కోరిక నెరవేర్చేందుకు చిన్నతనం నుంచే పెళ్లి చేసుకోవాలనే గోల్ తో ఉన్న కుర్రాడి కథ ఇది. ఆ క్రమంలో అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. పైగా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. దీంతో ఆమెపై అన్ని హక్కులు తనవే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఆధునిక భావాలున్న ఆ యువతికి ఇది నచ్చదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. విడిపోయేందుకు సిద్ధం అవుతారు. అంతే కాదు.. నీలాంటి వాడిని ఏ అమ్మాయీ ఇష్టపడదు అని చెబుతుందా అమ్మాయి. దీంతో ఆమెను ప్రేమించిన ఈ కుర్రాడు పడే ఆవేదన.. తర్వాత మళ్లీ ఇద్దరు కలవడం అనేది రెగ్యులర్ కాన్సెప్ట్ గానే కనిపిస్తోంది.

గోపీనాథ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఏమంత గొప్పగా అనిపించడంలేదు. పైగా నేటి యువతరానికి కావాల్సిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఏం కనిపించడం లేదు. అలాగే ఇలాంటి ప్రేమకథలు కూడా ఇప్పటికే చాలా వచ్చాయి. కేవలం తన చిన్నతనంలో తల్లి చనిపోవడంతో ఆమె స్థానాన్ని భర్తీ చేసే అమ్మాయి అనే పాయింట్ మాత్రమే కొంచెం కొత్తగా ఉంది. ఏదేమైనా కిరణ్ ఎంచుకుంటోన్న కథల్లోవైవిధ్యం కనిపిస్తోంది కానీ.. కథనంలో జోష్ ఉండటం లేదు. ఫస్ట్ మూవీ తప్ప ఇది మిగతా అన్ని చిత్రాలకు వర్తిస్తుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోకపోతే కుర్రాడి కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. ఉండటానికి చాలా ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. కానీ సక్సెస్ లేకపోతే అవన్నీ చేజారి పోవడానికి పెద్ద టైమేం పట్టదు.

Advertisement