వాల్తేర్ వీరయ్య రివ్యూ

రివ్యూ : వాల్తేర్ వీరయ్య
తారాగణం: చిరంజీవి, రవితేజ, శ్రుతి హాసన్, ప్రకాష్‌ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, కేథరీన్ థ్రెస్సా తదితరులు
ఎడిటింగ్: నిరంజన్ దేవరమానె
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ యొర్నేని, వై రవి శంకర్
దర్శకత్వం: బాబీ

మెగాస్టార్ చిరంజీవి నుంచి ఓ సినిమా వస్తోందంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని అందరికీ తెలుసు. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత వచ్చిన సైరా, గాడ్ ఫాదర్ లో ఆయన్నుంచి ఎక్స్ పెక్ట్ చేసే అంశాలు లేవు. దీంతో ఈ సారి ఫ్యాన్స్ కోసమే ఓ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యి ఈ సారి వాల్తేర్ వీరయ్యగా వచ్చాడు. ముందు నుంచీ చెప్పినట్టుగానే ఇది పూర్తిగా ఫ్యాన్స్ ను టార్గెట్ చేసుకుని తీసిన సినిమా అనేది తేలిపోయింది. అఫ్‌ కోర్స్ అన్ని వర్గాల ఆడియన్స్ నూ ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. మరి ఈ శుక్రవారం వచ్చిన మెగాస్టార్ కూడా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడా ఈ మూవీ కథేంటో చూద్దాం..

వైజాగ్ పోర్ట్ లో చేపలు పడుతూ.. సముద్రం నుంచి కొన్ని స్మగులింగ్స్ కూడా చేస్తుంటారు వాల్తేర్ వీరయ్య అండ్ గ్యాంగ్. అలాగని ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటి జోలికి వెళ్లడు అతను. తన ఏరియాలో అతనేం చెబితే అంతే. అలాంటి వ్యక్తి దగ్గరకు సీతాపతి అనే సిఐ వచ్చి .. తనకు మలేసియాలో ఉంటున్న ఓ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్ ను పట్టివ్వమని అడుగుతాడు. అందుకు 25లక్షలు ఇస్తా అని కూడా చెబుతాడు. అందుకు ఒప్పుకున్న వీరయ్య ఆ క్రిమినల్ ను పట్టుకునేందుకు మలేసియా వెళ్తాడు. అక్కడే అతనికి శ్రుతి హాసన్ పరిచయం అవుతుంది. మలేసియాలో బిగ్గెస్ట్ డ్రగ్ డీలర్ అయిన సాల్మన్ భారీ భద్రతతో ఉంటాడు. అతన్ని కలిసి బిజినెస్ చేస్తా అని ఒప్పిస్తాడు. తీరా ఇండియాకు తీసుకువచ్చే టైమ్ లో అతనికి వీళ్లు తనకోసం వచ్చిన విషయం తెలుస్తుంది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో సాల్మన్ ను చంపేస్తాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ లో స్వయంగా చూసిన సాల్మన్ అన్న మైఖేల్ సాల్మన్ కు వీరయ్య వార్నింగ్ ఇస్తాడు. తను వచ్చిందే అతని కోసం అని. వీడు ఎర మాత్రమే అంటాడు. మరి వీరయ్యకు మైఖేల్ కు మధ్య ఉన్న వైరం ఏంటీ..? వీరయ్యకు పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కు మధ్య రిలేషన ఏంటీ..? అనేది మిగతా కథ.

వాల్తేర్ వీరయ్య ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే వింటేజ్ మెగాస్టార్ ను తలపించింది. సినిమా కూడా అంతే. పూర్తిగా మెగాస్టార్ ఒన్ మేన్ షో. బట్ రవితేజ స్పేస్ లోకి చిరంజీవి వెళ్లలేదు. ఒక డ్రగ్ డీలర్ ను పట్టివ్వడం కోసం మలేసియా వరకూ వెళ్లిన వీరయ్య వెనక కథ రవితేజ పాత్రతో ముడిపడి ఉంటుంది. అదే సినిమాలో ప్రధానమైన కథ. అయితే ఆ కథను ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది అనిపిస్తుంది. అయినా ఇద్దరు టాప్ హీరోలు ఫ్రేమ్ లో ఉంటే చిన్న చిన్న మైనస్ లు ప్రేక్షకులకు పెద్దగా కనిపించవు. వీరయ్య చేసిన మ్యాజిక్ అదే. ముఖ్యంగా చిరంజీవి తనకే సొంతమైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఈ విషయంలో ముఠా మేస్త్రీ నుంచి శంకర్ దాదా ఎమ్ఎమ్.బి.బిఎస్ సినిమాల టైమింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మలేసియాలో జరిగినట్టు చూపిస్తారు. ఆ క్రమంలో శ్రుతి హాసన్ పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. తనకూ ఓ పెద్ద ఫైట్ పెట్టే ప్రయత్నం చేశారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో శ్రుతి కూడా ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మెయిన్ హైలెట్ ఈ చిత్రానికి. బాబీ సింహాను చంపేసే ఫైట్ గా వచ్చే ఈ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ పై డబుల్ ఎక్స్ పెక్టేషన్స్ వస్తాయి. సెకండ్ హాఫ్‌ లో రవితేజ పాత్ర ఎంటర్ అవుతుంది. అసిస్టెంట్ కమీషనర్ గా వాల్తేర్ వీరయ్య అరాచకాలను అడ్డుకునే పాత్రగా వచ్చినా.. వీరిద్దరి మధ్య ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు అనే కోణం ఉంటుంది. సవతి పోరు, అన్నంటే కోపం ఇలాంటి ఉన్నా.. డ్యూటీ మైండెడ్ గా ఉండే పోలీస్ గా రవితేజ ఉన్నంత సేపూ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. అతని పాత్రకు వీరయ్య పాత్ర పాత్రోచితంగా సరెండర్ కావడం చాలా బావుంది. అలాగే రవితేజ చనిపోయే సీన్ కు ముందు ఉండే ట్విస్ట్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. శ్రుతి హాసన్ ఉన్నా.. తను హీరోయిన్ గా చిరంజీవి ఊహలకే పరిమితం అయింది తప్ప రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. మిగతా రోల్స్ లో బాబీ సింహా బాగా చేశాడు. ప్రకాష్‌ రాజ్ ది చాలా రొటీన్ పాత్రే. అయితే చిరంజీవి చుట్టూ కనిపించిన ఆర్టిస్టులంతా జూనియర్ ఆర్టిస్టులకు మించి కనిపించకపోవడం విశేషం. వాళ్లంతా కమెడియన్స్ అయినా ఆ బాధ్యత కూడా చిరంజీవే తీసుకోవడంతో వాళ్లు కేవలం ప్యాడింగ్ ఆర్టిస్టుల్లా మిగిలిపోయారు. ఇక వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్ ల పాత్ర కూడా రొటీన్.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ హై స్టాండర్డ్స్ లో ఉంది. విజువల్స్ అన్నీ ఐ ఫీస్ట్ లా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో పాటలు రెండు మాత్రం బావున్నాయి. అయితే నేపథ్య సంగీతం ఓవర్ డోస్ అయింది. సీన్ లో పస లేనప్పుడు కూడా హై ఎండ్ మ్యూజిక్ ఇస్తే అది మైనస్ అవుతుందని అర్థం చేసుకోవాలి. మెగాస్టార్ కాస్ట్యూమ్స్ వింటేజ్ లుక్ కు సింక్ అయ్యాయి. ఆర్ట్ వర్క్, సెట్స్, అన్నీ సూపర్బ్. మాటల్లో మెరుపులు లేకపోయినా ఇప్పుడు సోషల్ మీడియా జోకులన్నీ వాడారు. అవి బాగా పేలాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక దర్శకుడుగా బాబీ ఎంచుకున్న కథలో ఏ కొత్తదనం లేదు. అన్న దమ్ముల మధ్య కాన్ ఫ్లిక్ట్ కానీ, టగ్ ఆఫ్ వార్ కానీ లేకపోవడం పెద్ద మైనస్. ఆ మైనస్ లను మెగాస్టార్ తన టైమింగ్ తో మరిపించే ప్రయత్నం చేశాడు. బాబీ తను ఓ అభిమానిగా చిరంజీవి అభిమానులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు. మొత్తంగా సంక్రాంతి బరిలో వీరయ్య విజయం సాధించేస్తాడు అనే చెప్పొచ్చు.

ఫైనల్ గా ః వింటేజ్ ‘వీర’ అభిమానుల కోసం

రేటింగ్ ః 2.5/5

                - యశ్వంతుడు

Related Posts