పొన్నియన్ సెల్వన్ 1 మూవీ రివ్యూ

రివ్యూ :- పొన్నియన్ సెల్వన్ 1
తారాగణం :- విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్‌ రాజ్, శోభిత దూళిపాళ్ల
ఉడిటింగక :- శ్రీకర్ ప్రసాద్
సంగీతం :- ఏ ఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫీ :- రవి వర్మన్
నిర్మాతలు :- మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం :- మణిరత్నం

గత నెల రోజుల నుంచి సౌత్ ఇండియా అంతటా మార్మోగిపోయిన పేరు పిఎస్1. పొన్నియన్ సెల్వన్ కు షార్ట్ ఫామ్ అది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన సినిమా. భారీ తారాగణం.. వీళ్లలో చాలామందికి ఇతర భాషల్లో మంచి అభిమాను కూడా ఉండటంతో ఈ మూవీ గురించి అంతటా ఓ రకమైన క్రేజ్ వచ్చింది. మరి ఈ శుక్రవారం విడుదలైన పిఎస్1.. ఎలా ఉంది. అంచనాలను అందుకుందా లేక అంతా ఊహించినట్టుగా ఇతర భాషల వారికి దూరమైందా అనేది చూద్దాం..

కథ :
చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడు(ప్రకాష్‌ రాజ్). తంజావూరు రాజధానిగా పరిపాలిస్తుంటాడు. ఆయనకి కూతురు కుందవి(త్రిష) రాజకీయం బాగా తెలుసు. ఇద్దరు కొడుకులు.. ఆదిత్య కరికాలన్(విక్రమ్), అరుళ్ మొళివర్మ(జయం రవి). ఇద్దరూ పరాక్రమవంతులు. వేర్వేరే ప్రాంతాల్లోని రాజ్యాలపై దండెత్తుతూ చోళసామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటారు. ఈ క్రమంలో సుందర చోళుడి అన్న కొడుకును రాజును చేయాలని ఆ రాజ్య ఆర్థికమంత్రి ఇతర సామంతులతో కలిసి కుట్రలు చేస్తుంటాడు. దీనికి నందిని(ఐశ్వర్య రాయ్). ఆదిత్య కరికాలుడు చిన్నప్పుడే నందినిని ప్రేమిస్తే.. అతన్ని కాదని ఓ ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఈమె చోళ రాజ్యాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉంటుంది. మరోవైపు అన్నదమ్ములిద్దరి మధ్య చిచ్చుపెట్టి రాజ్యాన్ని మధురాంతక చోళునికి అప్పగించాలని ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నాలను పసిగట్టిన కరికాలుడు.. అక్కడేం జరుగుతుందో తెలుసుకోమని తన స్నేహితుడు, వీరుడు అయిన వల్లవరాయ వంధ్య దేవుడు(కార్తీ)ని తంజావూరుతో పాటు చెల్లి వద్దకూ పంపిస్తాడు. అతను తంజావూరులో కుట్రలు తెలుసుకోవడమే కాక.. అరుళ్ మొళివర్మకు ఓ సమాచారం ఇచ్చేందుకు అతను దండెత్తిన శ్రీలంక ప్రాంతానికి వెళతాడు. అక్కడికి వచ్చిన పాండ్యులు అరుళ్‌పై దాడి చేస్తారు. ఆ దాడి నుంచి అరుళ్ తో పాటు వంధ్యదేవుడు తప్పించుకున్నారా లేదా అనేది ఫస్ట్ పార్ట్ లో కనిపించే కథ.

విశ్లేషణ :-
ఇంత పెద్ద కథ, ఎన్నో పాత్రలు, ప్రాంతాలు, పరిపాలనలు.. ఉన్న కథను కథనంగా మలచడం అంటే కత్తిమీద సాములాంటిది. ఒకవేళ మలిచినా దాన్ని సకల జనరంజకంగా చెప్పడం దాదాపు అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నం చేశాడు మణిరత్నం. కానీ సగమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
దక్షిణ భారతదేశంలో చోళ రాజుల పరిపాలనపై చాలా విశేషాలున్నాయి. అప్పట్లో ఆసియా ఖండంలోనే అతిపెద్ద సైనిక బలం, ఆర్థికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన రాజ్యంగా చెప్పుకుంటారు. కావేరీ నదీపరీవాహక ప్రాంతం నుంచి సౌత్ ఇండియాతో పాటు ఇండోనేసియా, వియత్నాం వరకూ విస్తరించిందని చరిత్రకారులు చెబుతుంటారు. అలాంటి చోళ సామ్రాజ్య ఆరంభం నుంచి ఈ పొన్నియన్ సెల్వన్ కథ మొదలవుతుంది. సుందర చోళుడి తనయుడులైన కరికాల చోళుడు, అరుళ్ మొళివర్మ.. వీరత్వంతో స్టార్ట్ అయిన కథ వారి యుద్ధాలు, విజయాలు, రాజ్యంలో కుట్రలు, కుతంత్రాలను చర్చించుకుంటూ మొదటి భాగం ముగుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని కథగా చెప్పడం కంటే కథనం ఎలా ఉందనేది చూద్దాం.
తమిళనాట అత్యంత ఆదరణ పొందిన ప్రఖ్యాత నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు మణిరత్నం. భారీ తారాగణం, రెహ్మాన్ సంగీతం అంటూ సినిమాపై ముందు నుంచీ అంచనాలు పెంచారు. బట్ వాటిని అందుకోవడంలో మణిరత్నం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అలాగని పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పలేం. ఎందుకంటే ఈ కథ తమిళులకు బాగా కనెక్ట్ అవుతుంది. అది వారి చరిత్ర కాబట్టి ప్రతిదీ తెలిసి ఉంటుంది. కానీ ఇతర భాషల వరకూ వస్తే ముందు కథే కనెక్ట్ కాదు. ఆపై కథనంలో మణిరత్నం మార్క్ మెరుపులు ఏం కనిపించలేదు. యుద్ధ సన్నివేశాలైతే అత్యంత పేలంగా ఉన్నాయి. మరికొన్ని బాహుబలిని చూసి వాతలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తాయి. ఆర్టిస్టులంతా టాలెంటెడే. కానీ ఎవరి పాత్ర ఏంటనే గందరగోళం కేవలం మనది కాని చరిత్ర వల్ల ఏర్పడుతుంది.

ఇది కథగా అయితే ఫర్వాలేదు. కానీ చరిత్ర. అందుకే ఆ చరిత్ర జరిగిన ప్రాంతం దాటి బయట మెప్పించడం కష్టం అవుతుంది. పైగా ఊరి పేర్ల నుంచి మనుషుల పేర్ల వరకూ ఒరిజినల్ వే వాడారు. దీంతో ఓ రకమైన డిస్ట్రాక్షన్ ఏర్పడుతుంది. అందుకే టైటిల్ రోల్ పోషించిన జయం రవి, కీలక పాత్ర చేసిన కార్తీ మరణం అంచుల్లో ఉన్నప్పుడు ఆ ఎమోషన్ తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ కావడం కష్టం. అయితే నటుల పరంగా ఒక్కొక్కరూ ది బెస్ట్ ఇచ్చారు. ఆయా పాత్రల్లో ఉండే ప్రయత్నం చేశారు. ఐశ్వర్యరాయ్ ని చూస్తూ కళ్లు తిప్పుకోలేం. అంత అందంగా ఉంది. త్రిష సైతం చాలా బావుంది. ఇంతమంది ఆర్టిస్టున్నా.. సినిమా అంతా కనిపించేది కార్తీ. తను ది బెస్ట్ ఇచ్చాడు. వీరత్వం, హాస్యం, లవ్ అన్నిటినీ అద్భుతంగా పలికించాడు. పదాల గందరగోళం వల్ల రెహ్మాన్ పాటలు పెద్దగా రిజిస్టర్ కాలేదు. మొత్తంగా మణిరత్నం నుంచి ఆశించిన అవుట్ పుట్ అయితే కాదు ఈ పొన్నియన్ సెల్వన్.

ఫైనల్ గా :- పిఎస్1 … నాట్ కనెక్టెడ్

రేటింగ్ :- 1.5/5

                                - యశ్వంత్ బాబు. కె

Related Posts