HomeReviews'మెకానిక్ రాకీ' రివ్యూ

‘మెకానిక్ రాకీ’ రివ్యూ

-

నటీనటులు: విశ్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌, సునీల్‌, నరేశ్‌, హైపర్‌ ఆది, హర్ష వర్థన్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్‌రెడ్డి కాటసాని
సంగీతం: జేక్స్‌ బిజోయ్‌
ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ
నిర్మాత: రామ్‌ తాళ్లూరి
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
విడుదల తేది: 22-11-2024

తక్కువ సమయంలోనే తెలుగులో ఓ మాస్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి, గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన విశ్వక్ సేన్.. ఈరోజు ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘మెకానిక్ రాకీ’ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
రాకీ (విశ్వక్ సేన్) చదువు మధ్యలోనే ఆపేస్తాడు. తండ్రి రామకృష్ణ (సీనియర్ నరేష్) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్ గా సెటిల్ అయిపోతాడు. గ్యారేజ్ లో మెకానిక్ గా పనిచేస్తూనే డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం ప్రియ (మీనాక్షి చౌదరి), మాయ (శ్రద్ధా శ్రీనాథ్) వస్తారు. అంతకుముందే ప్రియ తో రాకీకి పరిచయం ఉంటుంది. రాకీ స్నేహితుడు చెల్లెలే ప్రియ. డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసిన ప్రియ గురించి రాకీకి తెలిసిన కొత్త విషయాలేమిటి? మధ్యలో రంకి రెడ్డి (సునీల్) నుంచి తమ గ్యారేజికి వచ్చిన ఆపదేంటి? అన్నింటినీ రాకీ ఎలా ఎదుర్కొన్నాడు? వంటివి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ
ఈ కథను మొదట్లో చూస్తే ఇది మామూలు రొమాంటిక్ కామెడీ సినిమానే అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రారంభ సన్నివేశాలు ట్రయాంగులర్ లవ్ స్టోరీని సూచించేలా ఉంటాయి. కానీ కాస్త ముందుకు వెళ్తే అనూహ్యంగా స్టోరీ వేరే జానర్ లోకి షిప్ట్ అవుతుంది. కథలో ఏదో పెద్ద విషయం దాగి ఉందన్న అనుమానం కలిగిస్తూ ప్రేక్షకుడి ఆసక్తిని క్రమంగా పెంచుతుంది.

మొదటి భాగంలో కథను వినోదంతో నడిపించే ప్రయత్నం కనిపిస్తుంది. కామెడీ, పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో అసలు కథ ముందుకు కదలదు. పాత్రల తీరు, పరిణామాలు సహజంగా అనిపించకపోవడం వల్ల ప్రేక్షకుడు కథలో లీనం కాలేడు. కామెడీ సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ప్రథమార్థం సాధారణంగా సాగిపోతుంది. అయితే.. విష్వక్ సేన్ ఓల్డ్ గెటప్‌లో చేసిన హంగామా మాత్రం కొంతమేర అలరిస్తుంది.

సినిమాకి అసలు బలం ద్వితీయార్థం. అనూహ్యమైన మలుపులతో కథ రక్తి కడుతుంది. ప్రతి పాత్రకు కొత్త మలుపు కలిగించడం ద్వారా కథకు బలం చేకూరింది. మొదటి భాగంలో నిట్టూర్పులు పెట్టిన ప్రేక్షకుడికి రెండో భాగం ఉత్తేజాన్ని ఇస్తుంది. మధ్యతరగతి ఆశలు, అవసరాలపై ఆధారపడి మోసాలను చూపించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది.

అయితే కథలో భావోద్వేగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేది. కమర్షియల్ హంగుల వలన సీరియస్ థ్రిల్లర్‌గా మారాల్సిన కథ కొంత అసహజంగా మారింది. కొన్ని మలుపులు థ్రిల్‌ని పంచితే, మరికొన్ని లోపాలు కథనంలో కొద్దిగా ఆటంకాన్ని కలిగించాయి. మొత్తానికి ఫస్టాఫ్ సోసో గా అనిపిస్తే సెకండాఫ్‌ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
విశ్వక్ సేన్ ఈ సినిమాలో తనకు పరిచయమైన శైలిలోనే కనిపించాడు. హుషారైన నటనతో పాత్రలో ఒదిగి, కథలో కీలకమైన ప్రాధాన్యం సంతరించుకున్నాడు. ఇక కథలో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత ఉంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తమ పాత్రలలో ఆకట్టుకునే నటనను ప్రదర్శించారు. ఇద్దరూ అందంగా కనిపించడమే కాకుండా తమ పాత్రలకు న్యాయం చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా కథకు బలం చేకూర్చేలా తీర్చిదిద్దబడ్డాయి. సునీల్, నరేష్ తాము చేసిన పాత్రలలో మెప్పించగా హర్షవర్ధన్, రఘు, హర్ష చెముడు వంటి వారు తమ ప్రత్యేకమైన నటనతో సినిమాకు వినోదాన్ని, ఉత్కంఠను చేకూర్చారు.

సాంకేతికంగా ‘మెకానిక్ రాకీ’ బాగుంది. కొన్ని ముఖ్యమైన విభాగాలు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. కథలోని ఉత్కంఠ, భావోద్వేగాలను ఎలివేట్ చేయడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. ప్రతి షాట్ విజువల్‌గా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు సినిమాటోగ్రాఫర్ మనోజ్‌రెడ్డి కాటసాని. ప్రథమార్థంలో ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది.

ఇక రచయిత, దర్శకుడు రవితేజ ముళ్లపూడి విషయానికొస్తే.. ఆయన ఎంచుకున్న కథా నేపథ్యం ఆకట్టుకునేలా ఉంది. కథనాన్ని కూడా ఆసక్తికరంగా మలచడానికి శ్రద్ధ వహించాడు. అయితే భావోద్వేగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే కథ మరింత బలంగా ఉండేది. సినిమా ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.

చివరగా
ఈ సినిమాని విశ్లేషిస్తే ట్విస్టులు ప్రధాన బలంగా నిలిచిన కథ అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోకపోయినా సెకండాఫ్‌లో అనూహ్యమైన మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. విశ్వక్ సేన్ తన ఉత్సాహభరితమైన నటనతో పాత్రకు ప్రాణం పోశాడు. కథ మాస్ ఎలిమెంట్స్‌తో కూడి పసందైన కమర్షియల్ హంగులతో తెరకెక్కింది. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలిసారిగా మెగాఫోన్ పట్టినా పాత్రల మలుపుల్ని నడిపించే తీరు మెచ్చుకోదగినది. ‘మెకానిక్ రాకీ’ ఒక్కసారైనా థియేటర్లో చూడదగ్గ సినిమా అని చెప్పవచ్చు.

రేటింగ్ 2.5\5

ఇవీ చదవండి

English News