తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షో… బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సోహైల్… సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు మరింతగా దగ్గరయ్యారు. ఈయన హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. బిగ్ బాస్ కంటే ముందు సీరియల్స్‌లో నటించి మెప్పించిన సోహైల్‌కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. అయితే సిల్వర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కొత్తదే. మరి లక్కీ లక్ష్మణ్‌గా సోహైల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారా? నిజంగానే సోహైల్ లక్కీయేనా? అసలు ఈ సినిమా ద్వారా తనేం చెప్పాలనుకున్నారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాల్సిందే…!!!

కథ: లక్ష్మణ్ అలియాస్ లక్కీ (సోహైల్) తండ్రి వెంకటేశ్వరరావు(దేవీ ప్రసాద్ దిగువ మధ్య తరగతికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి లక్కీ తల్లిదండ్రులను ఏమడిగినా తమ వద్ద డబ్బులేదంటుంటారు. దాంతో పేరెంట్స్‌పై లక్కీకి తెలియని ఓ కోపం పెరిగిపోతుంది. ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత లక్కీకి శ్రియ (మోక్ష)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. లక్కీ పేదరికాన్ని అర్థం చేసుకున్న శ్రియ అతనికి సపోర్ట్ చేస్తుంది. ల్యాప్ టాప్, బైక్ వంటి వాటిని కొనిస్తుంది. అదే సమయంలో మరో అమ్మాయి లక్కీకి దగ్గరవ్వాలని చూస్తుంది. దీని కారణంగా లక్కీ, శ్రియ విడిపోతారు. అదే సమయంలో లక్కీ తల్లిదండ్రులపై ఉన్న కోపంతో వారి నుంచి దూరంగా వచ్చేస్తాడు. లక్కీ మ్యారేజ్ బ్యూరోని స్టార్ట్ చేసిన లక్కీ డబ్బే సర్వస్వం అనుకుంటుంటాడు. అలాంటి లక్కీకి ఎదురైన అనుభవాలేంటి? ధనవంతురాలైన శ్రియ ఎందుకు డబ్బు లేని అమ్మాయిగా మారుతుంది.. చివరకు లక్కీకి తన తండ్రి గురించి తెలిసిన నిజం ఏంటి? లక్కీ తన ప్రేమను గెలుచుకుంటాడా.. డబ్బు వెనుకే పరిగెడుతాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: ఇద్దరు వ్యక్తులు సంతోషంగా ఉండాలంటే వారి మధ్య డబ్బు కంటే ప్రధానమైనది భావ సారూప్యత ముఖ్యం. ఆ విషయాన్ని చెప్పటానికే దర్శకుడు అభి చేసిన ప్రయత్నమే ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రం. ఫ్యామిలీతో కలిసి చూసే ప్రేమ కథా చిత్రంగా అభి కథను తయారు చేసుకున్నారు. అయితే కేవలం ప్రేమ కథగా సినిమాను తెరకెక్కించాలనుకోలేదు. అలాగే లవ్ స్టోరి కదా.. రెండు, మూడు లిప్ లాక్స్ వంటి సన్నివేశాలను పెట్టాలని కూడా అనుకోలేదు. క్లీన్‌గా తెరకెక్కించాలనుకోవటమే ఈ సినిమాకు ప్లస్. దీనికి తోడు తండ్రి ఎమోషన్‌ను అండర్ కరెంట్‌గా రన్ చేస్తూ వచ్చారు. సినిమా మెయిన్ టర్నింగ్ పాయింట్‌కి అదే బేస్ అయ్యింది. ఆడియెన్స్ కూడా ఆ పాయింట్‌కే ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.
సోహైల్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మాస్ ఇమేజ్ కావాలి.. విలన్లను కొడితే ఎగిరెగిరి పడాలి అనే స్టైల్లో కాకుండా కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కథానుగుణంగా ఉండే తన పాత్రలో సోహైల్ ఒదిగిపోయారు. మోక్ష కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. దేవీ ప్రసాద్, కాదంబరి కిరణ్ కుమార్ తదితరులు అందరూ చక్కగా నటించారు. దిగువ మధ్య తరగతి తండ్రి పాత్రలో ఆయన నటన బావుంది. ఇక కాందబరి కిరణ్ కుమార్ కాసేపే కనిపించినప్పటికీ ఎమోషనల్ సీన్స్ లో సూపర్‌గా చేశారు. సోహైల్, కాదంబరి సన్నివేశానికైతే ఆడియెన్స్ క్లాప్స్ కొడతారంటే .. సీన్ ఎంత బాగా పండిందో అర్థం చేసుకోవచ్చు.
దర్శకుడు అభి అండర్ కరెంట్‌గా చెప్పాలనుకున్న విషయం ఎమోషనల్‌గా ఉంది. దాన్ని ప్రెజంట్ చేసిన తీరు బావుంది. హీరో, హీరోయిన్ కాలేజ్ స్టోరి, దాని చుట్టూ నడిచే లవ్ ట్రాక్ అన్నీ బాగున్నాయి. ఫస్టాఫ్ మొదలుకొని… సెకండాఫ్ ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాలో కాస్త కామెడీ ట్రాక్ కూడా బాగుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేగంగా కదులుతూ… దానికంటే డిఫరెంట్‌గా, ఎమోషనల్‌గా వెళుతుంది. అనూప్ అందించిన నేపథ్య సంగీతం బావుంది. ఓ మేరీ జాన్ సాంగ్ బావుంది. అండ్రూ సినిమాటోగ్రఫీ బావుంది. తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపించే ప్రేమ, కోపం వెనుక బలమైన పరిస్థితులుంటాయనే విషయాన్ని చక్కగా చూపించారు. టోటల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని లక్కీ లక్ష్మణ్ అలరిస్తాడు. గో అండ్ వాచ్ ఇట్..!
రేటింగ్: 2.75/5