రివ్యూ : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
తారాగణం :
నాంది నరేష్‌, ఆనంది, శ్రీ తేజ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, రఘుబాబు తదితరులు
ఎడిటర్ :
చోటా కె ప్రసాద్
సంగీతం :
శ్రీ చరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ :
రామ్ రెడ్డి
బ్యానర్స్ :
జీ స్టూడియోస్, హాస్య మూవీస్
నిర్మాత :
రాజేష్‌ దండు
డైరెక్టర్ :
ఏఆర్ మోహన్

కామెడీ హీరో అన్న ట్యాగ్ నుంచి సీరియస్ హీరోగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు నరేష్‌. ఆ క్రమంలో సక్సెస్ అయ్యాడు కూడా. అందుకే అంతకు ముందు అతని పేరు ముందున్న అల్లరి తొలగిపోయి.. నాంది నరేష్‌ గా మారింది. నాంది తర్వాత మరోసారి ఆ తరహాలోనే ఓ సీరియస్ సబ్జెక్ట్ ఈ మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వచ్చాడు. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :
సాధారణ సామాజిక అవసరాలకు దూరంగా మారేడుమిల్లి అడవుల్లో బ్రతికే గిరిజనం. తమ ప్రాంతానికి ఓ గుడి, స్కూల్, ఊరు దాటి కాస్త పట్టణంలోకి రావడానికి ఓ బ్రిడ్జి కోసం మూడు దశాబ్దాలుగా ఎదురుచూసి విసిగిపోతారు. ఆ సమయంలోనే ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి. అప్పటి వరకూ కొండ కింద ఎలక్షన్ బూత్ పెడితే వచ్చి ఓట్లే వేసే వారు గిరిజనులు. కానీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని రావడం మానేస్తారు. దీంతో ఎన్నికల అధికారి వారుండే ప్రాంతంలోనే ఓ బూత్ ను ఏర్పాటు చేసి.. అక్కడికి స్పెషల్ ఆఫీసర్ గా తెలుగు టీజర్ శ్రీ పాద శ్రీనివాస్( నరేష్) తో పాటు మరో అధికారిని పంపిస్తారు. అక్కడికి వెళ్లి వారిని ఓట్లు వేసేలా కన్విన్స్ చేయడం వీరి బాధ్యత. అప్పటికే ఓటింగ్ ను వ్యతిరేకంగా ఊరి పెద్దతో కలిసి తీర్మానం చేసుకుంటారు అక్కడి గిరిజనం. మరి వారిని శ్రీనివాస్ ఎలా కన్విన్స్ చేశాడు. వారి సమస్యల కోసం శ్రీనివాస్ చేసిన పనులేంటీ..? ఆ ప్రాంత ప్రజల ప్రాబ్లమ్స్ ను అధికారులు సాల్వ్ చేశారా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
ఒక సినిమా ఎలా ఉంటుందనేది ఆ కథ చెబుతుంది. ఎంత ఆకట్టుకుంటుందీ అనేది కథనం చెబుతుంది. ఈ రెండు అంశాల్లోనూ మెప్పించే సత్తా ఉన్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పట్టణ, గ్రామీణ జీవనానికి దూరంగా అనాదిగా అడవుల్లో నివసిస్తూ.. అడవినే తల్లిగా భావించే గిరిజనులు అక్కడే ఉంటూ మంచి సౌకర్యాలు పొందాలని ఆకాంక్షిస్తారు. బట్ వారి కోరికలను పట్టించుకునే ప్రభుత్వాలు, వారి సమస్యలను తీర్చే అధికారులు కనిపించరు. అందుకే ఏళ్ల తరబడి ఎన్నో సమస్యలతో పాటు సహజీవనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే మారేడుమిల్లి ప్రాంత ప్రజలు కూడా తమ పిల్లల భవిష్యత్ కోసం ఓ బడి, ప్రజల ఆరోగ్యం కోసం ఓ హాస్పిటల్.. బయటి ప్రపంచంతో సులువుగా అనుసంధానం చేసే బ్రిడ్జిని కోరుకుంటారు. 30యేళ్లు వారి కోరిక కలగానే మారుతుంది. అలాంటి వారి వద్దకు సామాజిక బాధ్యత కలిగిన.. ఒక మంచి పని కోసం ఎంత దూరమైనా వెళ్లే సత్తా ఉన్న ఎన్నికల అధికారి వెళ్లడం అనే పాయింట్ ఆకట్టుకుంటుంది. పెద్దగా టైమ్ తీసుకోకుండానే నేరుగా కథలోకే వెళ్లిపోయిన దర్శకుడు.. ఫస్ట్ హాఫ్‌ ను చకచకా నడిపించాడు. గిరిజనం ఓటింగ్ కు దూరంగా ఉన్న టైమ్ లో వచ్చే ఓ కాన్పు సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. పురాతన కాలంలో ఇలాంటి ప్రసవాలు ఉన్నాయని నరేష్ ను వారిని కన్విన్స్ చేయడం.. దానికి వారి కుల దైవం వీరభద్రుడు ఆశీర్వదించాడు అనేలా రాసుకున్న సీన్స్ విజిల్స్ కొట్టిస్తాయి. తర్వాత ఎన్నికలు వందశాతం పోలింగ్ తో అయిపోతాయి. తర్వాత ఎలక్షన్ వెళ్లిపోయే క్రమంలో నరేష్ ,వెన్నెల కిశోర్ కిడ్నాప్ కావడంతో పాటు బ్యాలెట్ బాక్స్ లను కూడా తీసుకువెళతారు కొందరు. అలా ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్ ను విడిపించేందుకు, ప్రభుత్వం, కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. అనే కోణంలో సాగుతుంది. అయితే ఇవన్నీ కొంత వరకూ ఊహించడానికి దగ్గరగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొంత సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్నాడు దర్శకుడు. అయినా ఏ సీన్ బోర్ కొట్టదు. అక్కడ హీరోతో పాటు ఆ గిరిజనం కోరిక నెరవేరాలనే ఆలోచన ప్రేక్షకుడిలోనూ కల్పించడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. మొత్తంగా వారి ప్రాబ్లమ్ ఎలా క్లియర్ అయింది అనేది సినిమాలోనే చూడాలి.
నటన పరంగా నరేష్‌ కు ఇది మరో కెరీర్ బెస్ట్ రోల్. శ్రీపాద శ్రీనివాస్ అనే తెలుగు టీచర్ పాత్రలో జీవించాడు. అచ్చంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో తెలుగును బోధించే మాస్టర్ లానే కనిపించాడు. ఇంగ్లీష్ డబుల్ ఎమ్మే అంటూ బిల్డప్ ఇచ్చే మరో ఎలక్షన్ ఆఫీసర్ గా వెన్నెల కిశోర్ తో పాటు స్థానిక విఆర్వోగా నటించిన ప్రవీణ్ ల మధ్య వచ్చే కామెడీ ఈ సీరియస్ సినిమాను మంచి ఎంటర్టైనర్ గానూ మార్చింది. తండ్రి సాయంతో ఏడో తరగతి వరకూ చదువుకుని.. జీతం లేని టీచర్ గా.. తన లాంటి టీచర్స్.. ఎలక్షన్స్ కోసం వచ్చారని తెలిసి.. ఊరు వద్దన్నా.. వారికి సాయం చేసే పాత్రలో ఆనంది అచ్చంగా ఒదిగిపోయంది. తన నటన చాలా సహజంగా అమరింది. ఈగోయిస్టిక్ ఐఏఎస్ గా సంపత్ రాజ్ సరిగ్గా సరిపోయాడు. సెకండ్ హాఫ్‌ లో వచ్చే షావుకారు పాత్రలో రఘుబాబు పాత్ర మంచి నవ్వులు పంచింది. గ్రామపెద్దగా లోడెత్తాలిరా రమణ నటన బావున్నా.. డబ్బింగ్ మరీ క్లాస్ గా ఉంది. ఇక ఊరిలో ఆవేశపరుడైన యువకుడి పాత్రలో శ్రీ తేజ్ కు ఇది గుర్తుండిపోయే పాత్ర.

టెక్నికల్ గా శ్రీ చరణ్‌ పాకాల సంగీతం చాలా బావుంది. సెకండ్ హాఫ్‌ లో వినిపించిన నేపథ్య సంగీతం అతని బ్రిలియన్సీని తెలియజేస్తుంది. రెండు పాటలూ బావున్నాయి. మరో హైలెట్ సినిమాటోగ్రఫీ. ఇలాంటి లొకేషన్స్ లో సినిమాటోగ్రఫీ చాలా కష్టతరమైన పని. వారి కష్టం ఆ అందమైన అడవిని మరింత అందంగా చూపడంలో కనిపిస్తుంది. అబ్బూరి రవి డైలాగ్స్ బావున్నాయి. ఆర్ట్ వర్క్ మెప్పిస్తుంది. కాస్ట్యూమ్స్ పరంగా ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా ఇది ఏఆర్ మోహన్ బెస్ట్ వర్క్. బాగా రాసుకున్నాడు. బాగా తీశాడు కూడా. ఇలాంటి కథల్లో ఏ మాత్రం మోతాదు మించినా.. తగ్గినా మొత్తానికే లాస్ అవుతుంది. అది లేకుండా బ్యాలన్స్ డ్ గా తీశాడు.

ఫైనల్ గా : ఇట్లు మనమంతా చూడవలసిన సినిమా..

        రేటింగ్ : 3/5
        యశ్వంత్ బాబు కె.