ఇందువ‌ద‌న – రివ్యూ

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ‌.. త‌దిత‌ర‌ చిత్రాల‌తో ఆక‌ట్టుకుని యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వ‌రుణ్ సందేశ్. ఆత‌ర్వాత స‌రైన క‌థ‌లు ఎంచుకోక‌పోవ‌డంతో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. ఇప్పుడు కొంత గ్యాప్ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్ న‌టించిన చిత్రం ఇందువ‌ద‌న‌. ఈ చిత్రానికి ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వం వ‌హించారు. వ‌రుణ్ సందేశ్ స‌ర‌స‌న‌ ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటించింది. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఇందువ‌ద‌న చిత్రం ఈ రోజు విడుద‌లైంది. మ‌రి.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? వ‌రుణ్ సందేశ్ కి విజ‌యాన్ని అందించిందా..? లేదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

క‌థ

వాసు (వరుణ్‌ సందేశ్‌) ఒక ఫారెస్ట్ ఆఫీసర్. గిరిజ‌న జాతికి చెందిన అమ్మాయి ఇందు ( ఫర్నాజ్ శెట్టి). వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. అయితే..వీరిద్ద‌రి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల అనంతరం ఒక‌రికొక‌రు ఘాడంగా ప్రేమించుకుంటారు. అయితే.. వారి ప్రేమను, అలాగే వారి పెళ్లిని ఇందు గూడెం పెద్దలు అస్స‌లు ఒప్పుకోరు. అలాగే వాసు కుటుంబ స‌భ్యులు కూడా ఒప్పుకోరు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఇందుని చంపేస్తారు. ఇది తెలిసిన వాసు ఏం చేశాడు..? అస‌లు ఇందును చంపింది ఎవ‌రు.? చివ‌రికి వాసు ఏం చేశాడు..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్
వ‌రుణ్ సందేశ్
మురళీ కృష్ణ సినిమాటోగ్రఫీ
శివ కాకాని సంగీతం

మైన‌స్ పాయింట్స్
కొత్త‌దనం లేని క‌థ‌
పండ‌ని కామెడీ
క్లైమాక్స్

విశ్లేష‌ణ

చాలా గ్యాప్ త‌ర్వాత కెమెరా ముందుకు వ‌చ్చిన వ‌రుణ్ సందేశ్ వాసు పాత్రలో చాలా చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్, కొన్ని హారర్ సీన్స్ లో వరుణ్‌ సందేశ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా ఫర్నాజ్ శెట్టి ఇందు పాత్ర‌లో అందంతో పాటు అభిన‌యంతో మెప్పించింది. కీలక పాత్రల్లో నటించిన రఘుబాబు, అలీ ఎప్పటిలాగే తమ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు.

అయితే.. హ‌ర్ర‌ర్ మూవీస్ లో లాజిక్ లు వెత‌క‌రు అని క‌థ‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా చూపిస్తే.. చూడ‌డం మ‌హా క‌ష్టంగా ఉంటుంది. ఈ సినిమా విష‌యంలో అదే జ‌రిగింది. హ‌ర్రర్ ని ప‌క్క‌న పెట్టి క‌నీసం కామెడీ అయినా పండిస్తారు అనుకుంటే.. అదీ లేదు. కామెడీ పండించే ప్ర‌య‌త్నం చేశారు కానీ.. వ‌ర్క‌వుట్ కాలేదు. క‌థ‌లో అస్స‌లు కొత్త‌ద‌నం లేదు. ద‌ర్శ‌కుడు ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ తీస్తున్నాను అనుకున్నాడు కానీ.. ప‌ట్టుస‌డ‌ల‌ని క‌థ‌నం రాసుకోలేదు.

ఈ సినిమాలో మెచ్చుకోవాల్సింది ఉందంటే.. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ, శివ కాకాని నేపథ్య సంగీతమే. వ‌రుణ్ సందేశ్ రీ ఎంట్రీ మూవీకి ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవ‌డం విచార‌క‌రం. కాస్త టైమ్ తీసుకుని మంచి క‌థ‌తో రీ ఎంట్రీ ఇస్తే బాగుండేది.

రేటింగ్ 2.5/5

Related Posts