నేను స్టూడెంట్ సర్

రివ్యూ: నేను స్టూడెంట్ సర్
తారాగణం: బెల్లంకొండ గణేష్‌, అవంతిక దాసాని, సముద్రఖని, సునిల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, చరణ్ దీప్ తదితరులు
ఎడిటర్: చోటా కే ప్రసాద్
సంగీతం: మహతి స్వర సాగర్
డివోపి: అనిత్ మాధాడి
నిర్మాత: నాంది సతీష్‌ వర్మ
దర్శకత్వం: రాఖి ఉప్పలపాటి

తొలి సినిమా స్వాతిముత్యంతో ఆకట్టుకున్నాడు గణేష్‌. సితార వంటి పెద్ద బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరుగా మెప్పించింది. రెండో ప్రయత్నంగా ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ అనే మూవీతో వచ్చాడు. టైటిల్ నుంచే ఆకట్టుకున్న నేను స్టూడెంట్ సర్ ను నాంది చిత్ర నిర్మాత సతీష్ వర్మ నిర్మించడంతో పాటు నాంది రేంజ్ లో ఆకట్టుకుంటుంది అని ప్రమోషన్స్ లో ఊదరగొట్టారు. స్టూడెంట్ కథే అయినా థ్రిల్లర్ గానూ ఉంటుందన్నారు. మరి ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :
సుబ్బారావు(గణేష్‌) కాలేజ్ స్టూడెంట్. అతనికి ఐఫోన్ అంటే పిచ్చి. దానికోసం ఇంట్లో వారిని కూడా అడగకుండా సొంతంగా ఎన్నో పనులు చేసి డబ్బు కూడబెట్టుకుంటాడు. 90వేలు పోగు చేసి తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్ కొనుక్కుంటాడు. అలా కాలేజ్ కు వెళ్లిన అతనికి అదే రోజు కాలేజ్ లో జరిగిన గొడవ వల్ల పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. తనకు సంబంధం లేకపోయినా గుంపులో అరెస్ట్ అవుతాడు. పోలీస్ స్టేషన్ లో అతని ఫోన్ మిస్ అవుతుంది. తన ఫోన్ పోలీస్ లే దొంగతనం చేశారని నిలదీస్తాడు. ఇందుకోసం కమీషనర్ వరకూ వెళ్లి వారిని ఇరిటేట్ చేస్తాడు. దీంతో ఫోన్ దొరికినా పగలగొడతా అంటాడు కమీషనర్. దీంతో అతని కూతురుతో స్నేహం చేసి ఆమె సాయంతో కమీషనర్ గన్ కొట్టేస్తాడు. తన ఫోన్ ఇస్తే గన్ ఇస్తా అని కమీషనర్ కు ఫోన్ చేస్తాడు. అదే సమయంలో ఆ గన్ తోనే ఓ హత్య జరిగి ఉంటుంది. అదెలా జరిగింది.. ఈ హత్య సుబ్బారావే చేశాడని పోలీస్ లు కేస్ నమోదు చేస్తాడు. అలాగే అతని అకౌంట్ కు కోటిన్నర డబ్బులు జమ అవుతాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఈ హత్య కేస్ నుంచి గణేష్ ఎలా బయటపడ్డాడు..? ఈ హత్యకు బ్యాంక్ కు ఉన్న సంబంధం ఏంటీ.. అనేది మిగతా కథ.

విశ్లేషణ :

నేను స్టూడెంట్ సర్.. అనౌన్స్ అయినప్పుడే మంచి టైటిల్ అనిపించుకుంది. ఇలాంటి టైటిల్ తోఎలాంటి కథైనా రాసుకోవచ్చు. మేకర్స్ తీసుకున్న థ్రిల్లర్ కథకు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అయతే దీనికి ఐఫోన్ అనే ఉప కథతో మొదలుపెట్టి ఓ పెద్ద బ్యాంక్ కుంభకోణంతో ముగించాలనుకున్నాడు. ఈ క్రమంలో రాసుకున్న సన్నిశాలు కంగాళీగా ఉండటంతో అనుకున్న పాయింట్ అంత గొప్పగా కనెక్ట్ కాలేకపోయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అసలు కథేంటీ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఇంటర్వెల్ వరకూ వెయిట్ చేయాల్సి వస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ట్రాక్ కూడా ఏమంత గొప్పగా అనిపించదు. వీరి మధ్య ప్రేమ కథ ఏ మాత్రం కన్విన్సింగ్ గా ఉండదు.

ఇక అతను అడగ్గానే తండ్రి రివాల్వర్ తీసుకువెళ్లి ఇవ్వడం సహేతుకంగా అనిపించదు. ఇంటర్వెల్ వరకూ టైమ్ పాస్ చేసినట్టుగా కనిపించిన ఈ కథ అసలుగా మొదలయ్యేది సెకండ్ హాఫ్ లోనే. ఇంకా చెబితే ప్రీ క్లైమాక్స్ కు కానీ అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అనేది ఆడియన్స్ కు అర్థం కాదు. అప్పటి వరకూ హీరో పోలీస్ ల నుంచి తప్పించుకుని యధేచ్చగా తిరుగుతూ తనను ఈ కేస్ లో ఇరికించింది ఎవరు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఇక కాలేజ్, యూనివర్శిటీ గొడవలతో మొదలై ఓ బ్యాంక్ కుంభకోణంతో ముగిసే ఈ కథలో నిజంగా మంచి ఇంటెన్సిటీతో చెప్పొచ్చు. బ్యాంక్ కుంభకోణం వ్యవహారాన్నే కాస్త బలంగా రాసుకుని సెకండ్ హాఫ నుంచే అది స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడో ప్రీ క్లైమాక్స్ లో అసలు పాయింట్ రావడంతో అప్పటి వరకూ సాగిందంతా ప్రహసనంలా ఉంటుంది తప్ప ఏ మాత్రం ఆకట్టుకోదు.


ఇక ఈ కథకు కావాల్సినంత బలం హీరోలో లేదు. అసలు అతను హీరో మెటీరియల్ కాదు అని రెండో సినిమా డిక్లేర్ చేసిందనే చెప్పాలి. ఇలాంటి కథలకు ఓ ఇంటెన్సిటీ ఉండాలి. అది పూర్తిగా మిస్ అయిందీ చిత్రంలో. దీంతో ఓ మంచి పాయింట్ అర్థవంతంగా చెప్పే అవకాశాన్ని దర్శకుడు మిస్ చేసుకున్నాడు అనే చెప్పాలి. రెండు గంటలు మాత్రమే ఉన్నా.. ఎందుకో చాలా సేపు సాగదీసినట్టు కనిపిస్తుందీ చిత్రం. అందుకు కారణం రిపీటెడ్ సీన్స్ ఎక్కువగా ఉండటమే. యూనివర్శిటీలో రెండు వర్గాల మధ్య గొడవకే రౌడీషీట్ ఓపెన్ చేయడం అస్సలు సబబుగా లేదు. దాని వల్ల వచ్చిందేంటో కూడా అర్థం కాదు. ఇక బ్యాంక్ కుంభకోణంలో అసలు దొంగ ఎవరు అనేది హీరో లేదా పోలీస్ లు కనిపెడతారు అనుకుంటే వాళ్లే వచ్చి దొరికిపోయినట్టుగా ఉంది. దీంతో హీరోయిజం కూడా పెద్దగా ఎలివేట్ కాదు. ఇక చేతిలో తుపాకీ పట్టుకుని హీరో.. అతని వెనకే పోలీస్ లు పరుగుపెట్టే సీన్ చాలా కామెడీ ఉంది.


నటన పరంగా గణేష్ ఈ పాత్రలో పూర్తిగా తేలిపోయాడు. బేలతనం ఉన్నా.. బలమైన సన్నివేశాల్లోనే కాక లవ్ సీన్స్ లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. హీరోయిన్ అవంతిక.. ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన భాగ్యశ్రీ కూతురు. కానీ ఆమెకు నటనలో ఓనమాలు కూడా తెలియదు. ఇతర పాత్రల్లో సముద్రఖని ఉన్నాడు. ఇలాంటి పాత్రల్లో గతంలో సంపత్ రాజ్ కనిపించేవాడు. అంతే తేడా. ఏ కొత్తదనం లేదు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, హీరో ఫ్రెండ్, ఓకే. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బావుంది. నేపథ్య సంగీతం ఓకే. ఒకే పాట ఉంది. అది బానే ఉంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు రాఖీ ఎంచుకున్న పాయింట్ బావుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యాడు అనే చెప్పాలి. చూస్తోంటే ఈ సినిమాలో నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ కూడా కాస్త ఎక్కువే ఉందనిపిస్తుంది. మొత్తంగా బెల్లంకొండ కుర్రాడు ద్వీతీయ విఘ్నం దాటకపోగా.. నటుడుగా పూర్తిగా తేలిపోయాడు.

ఫైనల్ గా ఇతను యావరేజ్ స్టూడెంట్ సర్

రేటింగ్ : 2/5

            - బాబురావు. కామళ్ల.

Related Posts