‘హరోం హర‘ రివ్యూ

నటీనటులు: సుధీర్‌బాబు, సునీల్, మాళవికా శర్మ, వి.జయప్రకాశ్, లక్కీ లక్ష్మణ్, అర్జున్‌ గౌడ, రవి కాలే, అక్షరా గౌడ తదితరులు
సినిమాటోగ్రఫి: అరవింద్‌ విశ్వనాథన్‌
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల
నిర్మాత: సుమంత్‌ జి.నాయుడు
దర్శకత్వం: జ్ఞానసాగర్‌ ద్వారక
విడుదల తేది: 14-06-2024

సినిమా సినిమాకి విలక్షణమైన కథలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే హీరో సుధీర్ బాబు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. చిత్తూరు నేపథ్యంలో.. ఙ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో సుధీర్ కి జోడీగా మాళవిక శర్మ నటించింది. ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘హరోం హర‘ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
‘హరోం హర‘ కథ ఆద్యంతం 1980ల నేపథ్యంలో సాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో అత్యంత క్రూరుడైన తమ్మిరెడ్డి (లక్కి లక్ష్మణ్) ఉంటాడు. ఆ సమయంలోనే కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్‌ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు). ఓసారి అనుకోని పరిస్థితుల్లో తమ్మిరెడ్డి గ్యాంగ్‌తో గొడవపడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అయితే.. తన తండ్రి శివారెడ్డి (జయప్రకాష్) చేసిన అప్పులు తీర్చాల్సిన బాధ్యత సుబ్రహ్మణ్యంపై పడుతుంది. దీంతో.. తన మిత్రుడైన పళని స్వామి (సునీల్)తో కలిసి తుపాకులు తయారు చేసి అమ్మడం మొదలుపెడతాడు. ఆయుధాల అక్రమ తయారీ రంగంలో సుబ్రహ్మణ్యం ఏ స్థాయికి చేరుకున్నాడు? ఆ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ.

విశ్లేషణ
గడిచిన ఐదారు సంవత్సరాలలో పీరియడ్ డ్రామాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా.. స్మగ్లింగ్, మాఫియా ఇతివృత్తాలతో వచ్చిన ‘కె.జి.యఫ్, పుష్ప‘ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాలలోని యాక్షన్ తో పాటు.. కథ, కథనాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతోనే అవి అంత పెద్ద విజయాలు సాధించాయి.

అయితే.. కథ విషయంలో ‘కె.జి.యఫ్, పుష్ప‘ ఫార్ములాని ఫాలో అయిన ‘హరోం హర‘ కథనం విషయంలో వీక్ గా సాగింది. యాక్షన్ సీక్వెన్సెస్ లావిష్ గా అనిపించినా.. స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ లేకపోవడంతో అవి అంతగా పండలేదని చెప్పొచ్చు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌, హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. అలాగే.. సినిమాకి ఆయువుపట్టైన హీరో, విలన్ మధ్య సంఘర్షణ చాలా వీక్ గా అనిపిస్తుంది.

అయితే.. తుపాకీలు తయారు చేయడం.. గన్ స్మిత్ అనే పాయింట్ కొత్తగా ఉంది. స్టోరీ లైన్ కొత్తగా ఉన్నా.. దాన్ని తెరకెక్కించడంలో కథనం పరంగా దర్శకుడు ఇంకాస్త కసరత్తులు చేసుండాల్సింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం.. ఆయనొక అథ్లెట్ కావడం. అలాగే.. మార్షల్ ఆర్ట్స్ లో మంచి పట్టుండం. అయితే.. ఇప్పటివరకూ సుధీర్ కి యాక్షన్ స్టార్ అనే ఇమేజ్ తీసుకొచ్చే క్యారెక్టర్ పడలేదు. కొంతవరకూ ఆ ప్రయత్నం ఈ సినిమాతో జరిగింది. ఈ మూవీలో సుబ్రహ్మణ్యం పాత్రకు సుధీర్ ప్రాణం పెట్టాడు. యాక్షన్ ఘట్టాలలో విశ్వరూపం చూపించాడు. అలాగే.. ఎమోషనల్ సీన్స్ లోనూ సహజమైన నటనను ప్రదర్శించాడు.

కానీ.. సినిమా స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడంతో ఆయన కష్టం అంతగా గుర్తింపుకు నోచుకోకపోవచ్చు. హీరోయిన్ పాత్రలో మాళవిక శర్మ అందంగా కనిపించింది. అయితే.. ఆమె పాత్రకు ప్రాధాన్యత తక్కువే. ఇక.. స్నేహితుడు పాత్రలు చేయడం సునీల్ కి కొత్తేమీ కాదు. ఈ సినిమాలోనూ అలాంటి తరహా పాత్రలోనే అలరించాడు. లక్కీ లక్ష్మణ్, రవి కాలే వంటి వారు క్రూరత్వంతో కూడిన విలనిజంతో ఆకట్టుకున్నారు.

చైతన్ భరద్వాజ్ పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. నేపథ్య సంగీతం బాగుంది. 1980ల నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడంలో కెమెరా, ఆర్ట్ వర్క్ బాగా పనిచేశాయి. సుధీర్ బాబు సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన చిత్రంగా ఇది కనిపిస్తుంది. ఆ పరంగా నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు.

చివరగా
మొత్తానికి.. సుధీర్ బాబు నటన, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నా.. రొటీన్ గా సాగే కథ, కథనాలతో ‘హరోం హర‘ ఏవరేజ్ మూవీ అని చెప్పొచ్చు.

రేటింగ్:2.5/ 5

Related Posts