HomeReviews'డబుల్ ఇస్మార్ట్' రివ్యూ

‘డబుల్ ఇస్మార్ట్’ రివ్యూ

-

నటీనటులు: రామ్‌, సంజయ్ దత్‌, కావ్య థాపర్‌, సాయాజీ షిండే, గెటప్‌ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్‌ తదితరులు
సినిమాటోగ్రఫి: శ్యామ్‌ కె.నాయుడు, జియానీ
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌
నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మి
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేది: 15-08-2024

రామ్ ను ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊర మాస్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్ ను అలరించింది. అలాంటి ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్ గా రూపొందింది ‘డబుల్ ఇస్మార్ట్’. మొదటి భాగానికి మించిన మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్‘ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. రామ్-పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఊర మాస్ ఎంటర్ టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్‘ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
ఒక ల‌క్ష్యంతో ఉన్న క‌థానాయ‌కుడి మెద‌డులోకి మ‌రో వ్యక్తి మెమరీ వస్తే ఎలా అనే స్టోరీతో ‘ఇస్మార్ట్ శంకర్‘ తీసి ఘన విజయాన్ని సాధించాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు సీక్వెల్ కథను అదే తరహాలో తీర్చిదిద్దాడు. ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్) గ్లియోమాతో బాధపడుతూ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒక సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) బిగ్ బుల్ జ్ఞాపకశక్తిని.. ఇస్మార్ట్ శంకర్ (రామ్) లోకి పంపించాలని సూచిస్తాడు. గతంలో అలాంటి ప్రయోగం ఇస్మార్ట్ శంకర్ పై జరిగిందని చెప్తాడు. సైంటిస్ట్ సూచించినట్టే.. శంకర్ మెదడులోకి బిగ్ బుల్ మెమరీస్ ట్రాన్సఫర్ అవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇస్మార్ట్ శంకర్ సొంత జ్ఞాప‌కాలు, అతని లక్ష్యాలు ఏమయ్యాయి? అనేది మిగతా కథ.

విశ్లేషణ
‘ఇస్మార్ట్ శంకర్’ కథ ఒక మనిషి బ్రెయిన్ లోని రహస్యాలను మరొకరి బ్రెయిన్ లోకి పంపించడం నేపథ్యంలో సాగుతోంది. ఇప్పుడు మళ్లీ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం అదే బ్రెయిన్ గేమ్ ను ఫాలో అయ్యాడు పూరి జగన్నాథ్. తలకు యు.ఎస్.బి. పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక్కడు అంటూ.. ప్రచార చిత్రాలలోనే ఈ సినిమా కథ.. ఇంచుమించు ‘ఇస్మార్ట్ శంకర్‘ తరహాలో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు.

సినిమా చూసిన తర్వాత కూడా ప్రేక్షకులకు మరో ‘ఇస్మార్ట్ శంకర్‘ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. తెర‌పై పాత్రలు వస్తుంటాయి.. స‌న్నివేశాలు సాగిపోతుంటాయి.. తప్ప ప్రేక్షకుడిని సినిమాకి కనెక్ట్ చేయడంలో డాషింగ్ డైరెక్టర్ విఫలమయ్యాడనే చెప్పొచ్చు. రామ్ శంకర్ పాత్రలో మాస్ స్వాగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాలు బాగా పేలాయి. ఇస్మార్ట్ హీరో హీరోయిన్‌తో క‌లిసి చేసే అల్లరి మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది.

పూరి సినిమాల్లో ఆలీకి ఎంతో ప్రత్యేకమైన పాత్రలు దొరుకుతాయి. ఈ సినిమాలోనూ బోకా అనే పాత్రలో ఆలీ పరిచయం, విచిత్రమైన వేష‌ధార‌ణ బాగున్నా.. ఆ ట్రాక్ బాగా సాగదీయడంతో చికాకుగా అనిపిస్తుంది. మొదటి అర్థ భాగంలో ఓ బలమైన హీరోకి బలమైన గోల్ ఉన్నట్టు చూపిస్తారు. అయితే.. ద్వితీయార్ధంలోనైనా ఆ మలుపులు వస్తాయి అని ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశే కలుగుతుంది.

ఈ సినిమాతో సంజయ్ దత్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బుల్ ఎంట్రీ సన్నివేశాలు బాగున్నా.. ఆ తర్వాత ఆ పాత్ర కూడా అంతగా ఆకట్టుకోదు. అందుకు ప్రధాన కారణం ఆ రోల్ ని తీర్చిదిద్దిన విధానమే. బిగ్ బుల్ పాత్రలో బలం లేదు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టర్ కు రామ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ పాత్రను తలుచుకోనే ఓ ఊర మాస్ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. ఈ సినిమాలోనూ ఆ పాత్రలో అదరగొట్టాడు రామ్. తనదైన మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్, డ్యాన్సెస్ తో శంకర్ క్యారెక్టర్ ని నిలబెట్టాడు.

కథానాయకులకు దీటైగా కథానాయికలను ఆవిష్కరించడంలో దిట్ట పూరి. ‘ఇస్మార్ట్ శంకర్‘లో హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ గురించి ఎంతో ప్రత్యేకంగా ముచ్చటిస్తారు. ఇప్పుడు సీక్వెల్ లో ఆ ఇద్దరికి మించిన రీతిలో గ్లామర్ రోల్ తో అలరించింది కావ్య థాపర్. ఈ సినిమాలోని అందాల ప్రదర్శనలోనే కాదు.. డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాల్లోనూ కావ్య కనిపించింది.

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సంజయ్ దత్ పోషించిన బిగ్ బుల్ పాత్రను ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. బిగ్ బుల్ పాత్రకు తన ఆహార్యంతో కొత్త కళను తీసుకొచ్చాడు సంజయ్. ఇంకా.. ఈ సినిమాలో ఆలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, ప్రగతి వంటి వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు పూరి జగన్నాథ్. టాలీవుడ్ లో దాదాపు అందరు అగ్ర కథానాయకులతో పనిచేసిన పూరి జగన్నాథ్.. వారి మాస్ ఇమేజ్ ను అమాంతం పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. గత కొన్నాళ్లుగా పూరి తన కథలపై ఎక్కువగా కసరత్తులు చేస్తున్నట్టు అనిపించడం లేదు. కథలు చాలా పేలవంగా ఉంటున్నాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్‘ కూడా అదే కోవకు చెందుతుంది.

ఇక.. ‘ఇస్మార్ట్ శంకర్‘ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు మణిశర్మ. ఇప్పుడు సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘కి సైతం తనదైన పంథాలో అదిరిపోయే మాస్ ట్యూన్స్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల మెప్పిస్తుంది. శ్యామ్ కె.నాయుడు, జియాని జియాన్నెల్లి సినిమాటోగ్రఫీ బాగుంది.

చివరగా
రామ్ నటన బాగున్నా.. ఆసక్తి కలిగించని కథ, కథనాలతో సినిమాలోని చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. మొత్తంగా.. ‘డబుల్ ఇస్మార్ట్‘ ఓన్లీ ఫర్ మాసెస్ అని చెప్పొచ్చు.

ఇవీ చదవండి

English News