HomeReviews'డార్లింగ్' రివ్యూ

‘డార్లింగ్’ రివ్యూ

-

నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల, బ్రహ్మానందం, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్, కృష్ణ తేజ, విష్ణు తదితరులు
సినిమాటోగ్రఫి: నరేష్ రామదురై
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్‌: ప్రదీప్ ఈ రాఘవ్
నిర్మాత: కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య
దర్శకత్వం: అశ్విన్ రామ్
విడుదల తేది: 19-07-2024

కమెడియన్ గా స్టార్ రేసులో ఉన్న ప్రియదర్శి.. కథానాయకుడిగానూ విలక్షణమైన సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రియదర్శి హీరోగా నటించిన ‘మల్లేశం, బలగం’ వంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక.. ముగ్గురు హీరోలలో తాను ఒకడిగా నటించిన ‘జాతి రత్నాలు, ఓం భీమ్ బుష్’ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. మరోవైపు.. ఓటీటీ కోసం చేసిన ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈకోవలోనే.. ప్రియదర్శి హీరోగా నటించిన ‘డార్లింగ్’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీలో ప్రియదర్శికి జోడీగా నభా నటేష్ నటించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డార్లింగ్’ చిత్రం ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
బాగా చదువుకుని జాబ్ చేస్తే మంచి భార్య వస్తుంది.. అప్పుడు పారిస్ వెళ్లొచ్చు అని రాఘవ (ప్రియదర్శి) కలలు కంటుంటాడు. ఆ సమయంలోనే అతనికి నందిని (అనన్య నాగళ్ళ)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరిగ్గా పెళ్లికి ముందే ఆమె తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. దీంతో.. డిప్రెషన్ లోకి వెళ్లిన రాఘవ చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ సమయంలో అతనికి ఆనంది (నభా నటేష్) పరిచయం అవుతుంది. పరిచయమైన కొన్ని గంటల్లోనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అసలు ఆనంది ఎవరు? ఆమెతో రాఘవకి ఎదురైన సమస్యలేంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
ఒక మనిషి ఒకేసారి వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేది ‘అపరిచితుడు’ సినిమాలో చూశాము. ఆ స్ల్పిట్ పర్సనాలిటీ ఓ అమ్మాయికి ఉంటే అదే ‘డార్లింగ్’ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఈ సినిమా కథపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

‘డార్లింగ్’ మొదటి భాగం అంతా రాఘవ పెళ్లి ప్రయత్నాలతో ఫన్నీగా సాగిపోతుంది. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయి వేరే వాళ్లతో వెళ్లిపోవడం.. ఊహించని షాక్ లో ఉన్న రాఘవ.. ఊరూ పేరూ తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత జరిగిన సంఘటలను కామెడీ వే లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది.

ద్వితియార్థం అంతా భార్య‌కు స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉంద‌ని తెలిసి రాఘవ ఏం చేశాడు? భార్య కార‌ణంగా అత‌డు ఎలాంటి బాధ‌లు ప‌డ్డాడ‌నే విషయాన్ని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను ఏ పాత్ర చేస్తే.. అందులో ఒదిగిపోతాడు. అది హీరోగానైనా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా. ఈ సినిమాలోనూ ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇక.. యాక్సిడెంట్ కారణంగా లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఈ మూవీలో నభా రోల్ ఎంతో ప్రయోగాత్మకంతో కూడుకున్నది. స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌పడే యువ‌తిగా ఆమె న‌ట‌న బాగుంది. తన క్యారెక్ట‌ర్‌లో వేరియేష‌న్స్ చూపిచేందుకు నభా బాగానే కష్టపడింది. అన‌న్య నాగ‌ళ్ల‌ పాత్రకు ఎక్కువ స్కోప్ లేదు. మురళీధర్ గౌడ్, కృష్ణ తేజ, విష్ణు వంటి వారు తమ పాత్రలు పరిధి మేరకు నటించారు.

దర్శకుడు అశ్విన్ రామ్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో ప్లస్ అంటూ చెప్పాల్సి వస్తే అది కామెడీ. అయితే.. కామెడీ మాత్రమే సినిమాని నిలబెట్టదు. కథ కూడా కావాలి. ఆ కథను నడిపించే స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండాలి. ఆ విషయంలో అశ్విన్ రామ్ తడబడ్డాడనే చెప్పాలి. ‘డార్లింగ్’ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. వివేక్ సాగర్ పాటలు కాస్త నిరాశ పరిచాయని చెప్పాలి. నరేష్ రామదురై సినిమాటోగ్రఫీ బాగుంది.

చివరగా
అమ్మాయికి స్ప్లిట్ పర్సనాలిటీ అనే కథా నేపథ్యం బాగుంది. ప్రియదర్శి, నభా నటేష్ నటనా ఆకట్టుకుంటాయి. కానీ.. కొరవడిన భావోద్వేగాలతో ‘డార్లింగ్’ బోరింగ్ డ్రామాగా మిగిలిందని చెప్పొచ్చు.

రేటింగ్: 2 / 5

ఇవీ చదవండి

English News