అద్భుతం-రివ్యూ
Latest Movies OTT Reviews Tollywood

అద్భుతం-రివ్యూ

తేజ, శివానీ రాజశేఖర్ న‌టించిన తాజా చిత్రం అద్భుతం. ఈ చిత్రానికి మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌థ ప్ర‌శాంత్ వ‌ర్మ అందించ‌గా.. స్ర్కీన్ ప్లే, మాట‌లు ల‌క్ష్మీ భూపాల్ అందించారు. రోటీన్ కి భిన్నంగా ఓ విభిన్న క‌థాంశంతో రూపొందిన అద్భుతం సినిమా డిస్నీ హాట్ స్టార్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. అద్భుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా అద్భుతం క‌థ చెప్పాలి.

క‌థ –

సూర్య(తేజ) ఓ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేస్తుంటాడు. అత‌ని వ‌ల‌నే తండ్రి చ‌నిపోయాడ‌ని బాధ‌ప‌డుతుంటాడు. ఓ రోజు ఆత్య‌హ‌త్య చేసుకోవాలి అనుకుంటాడు. ఇక‌ వెన్నెల (శివానీ రాజ‌శేఖ‌ర్) ఉన్నత చ‌దువులు చ‌ద‌వాల‌నేది ఆమె ఆశ‌. అయితే.. పెళ్లి చేసేస్తే త‌న బాధ్య‌త తీరుపోతుంది అనుకుంటాడు ఆమె తండ్రి. అయితే.. పెళ్లి ఇష్టం లేద‌ని వెన్నెల చెబుతుంది. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవ్వ‌డంతో వెన్నెల ఆత్య‌హ‌త్య చేసుకోవాలి అనుకుంటుంది. అయితే.. తన చావుకి ఎవరూ కూడా భాద్యులు కాదు అని తన నెంబర్ కే ఒక మెసేజ్ పెట్టుకుంటాడు సూర్య‌. ఆశ్చర్యకరంగా ఈ మెసేజ్ 2014 లోని వెన్నెల(శివాని రాజశేఖర్) కి చేరుతుంది. ఆమెది సూర్య నెంబర్ నే.. ఇలా తన నెంబర్ ఇంకొకరి దగ్గర ఉండడం ఏమిటి.? అందులోనూ వేరే సంవత్సరం. ఆత్మ‌హ‌త్య‌ను ప‌క్క‌న‌పెట్టి ఓసారి క‌ల‌వాలి అనుకుంటారు. ఆత‌ర్వాత ఏం జ‌రిగింది అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

తేజ‌, శివానీ న‌ట‌న‌
స‌త్య కామెడీ
థ్రిల్లింగ్ సీన్స్

మైన‌స్ పాయింట్స్

క‌థ‌నం
ఎమోష‌న్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం

విశ్లేష‌ణ –

హీరోగా తేజ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి కమర్షియల్‌ సినిమాల జోలికి పోకుండా కాన్సెప్ట్‌ మూవీలను ఎంచుకుని ముందుకు వెళుతున్నాడు. సూర్య పాత్రలో పాత్ర‌కు త‌గ్గ‌ట్గుగా చక్కగా ఒదిగిపోయాడు. ఇక శివానీ రాజశేఖర్‌ ఈ చిత్రంతో వెండితెరకు క‌థానాయిక‌గా పరిచయం అయింది. ఫ్రెష్‌ లుక్‌తో వెన్నెల పాత్రలో బాగానే నటించింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లోనూ మెప్పించింది. సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. ఆదిత్య 369 నుంచి ఇటీవల విడుదలైన ప్లే బ్యాక్ మూవీ వ‌ర‌కు కాలంతో ముడిప‌డిన క‌థ‌లు వ‌చ్చాయి. ఇలాంటి క‌థ‌తో సినిమా చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేయాలి.

ప్రేక్ష‌కుల‌కు తెలిసిన క‌థ చెబుతున్న‌ప్పుడు ప్ర‌తి సీన్ ఇంట్ర‌స్టింగ్ గా ఉండేలా.. వాట్ నెక్ట్స్ అంటూ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అని ఉత్కంఠ‌తో ఎదురు చూసేలా ప‌ట్టుస‌డ‌ల‌ని స్ర్కీన్ ప్లే ఉండాలి. కానీ.. ఇందులో అదే మిస్ అయ్యింది. ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ కథకు కాస్త హాస్యం, కాస్త ఉత్కంఠ జోడించి ఏదో అద్భుతం చేయాలనుకున్నాడు. అయితే.. క‌థ‌నం ఆస‌క్తిగా లేక‌పోవ‌డంతో అద్భుతం అనిపించలేదు. రధన్‌ సంగీతం, విద్యాసాగర్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. లక్ష్మీ భూపాల్‌ సంభాషణలు బాగున్నాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. లాజిక్ లు గురించి ఆలోచించ‌కుండా టైమ్ పాస్ చేద్దామ‌నుకుంటే అద్భుతం ఓసారి చూడ‌చ్చు.

రేటింగ్ 3/5

Post Comment