గేమ్ ఆన్.. ఈ మధ్య కాలంలో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ప్రతీ ప్రమోషనల్ వీడియో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. గీతానంద్, నేహ సోలంకి జంటగా దయానంద్ డైరెక్షన్‌లో కస్తూరి రవి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2 న రిలీజయ్యింది. గేమ్ ఆన్ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ: గౌతమ్ సిద్దార్ధ్ (గీతానంద్) కు తన ఫ్రెండ్ కిరీటి, లవర్ ( వాసంతి కృష్ణన్) లు తప్ప ఎవరూ లేని అనాధ. ఓ గేమింగ్ కంపెనీ మార్కెటింగ్ లో పనిచేస్తుంటాడు. అయితే తన ఫ్రెండ్, లవర్ ఇద్దరూ మోసం చేస్తారు. తానేమీ సాధించలేని చేతకానివాడ్నని అనుకుంటూ చావడానికి వెళ్తాడు. ఓ గేమ్ ఆడితే లక్ష రూపాయలు వస్తాయంటూ వచ్చిన ఫోన్ కాల్‌తో చావు ఆలోచన విరమించుకుని గేమ్‌లో టాస్క్‌లు ఆడుతూ డబ్బులు సంపాదిస్తాడు. అయితే ఆ టాస్కులు చివరకి హత్యలు చేసే వరకు వెళ్తాయి. ఇంతకీ ఆ గేమ్ ఏంటి ? చివరకి ఏమైంది ? అనేది తెరమీద చూడాల్సిందే.
విశ్లేషణ : గేమింగ్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా అంటే.. ఏ వర్గం ఆడియెన్స్‌కైనా ఇంట్రస్ట్ ఉంటుంది. గేమ్ ఇచ్చే థ్రిల్ అలాంటిది. గేమ్ ఆన్ కూడా అదే కేటగిరికి చెందే సినిమా. కాకుంటే స్క్రీన్ ప్లే కాస్త బలంగా ఉండుంటే. నిజానికి చావడానికి సిద్ధమైన హీరో మీద సింపతీ క్రియేట్ అవ్వడం కంటే అతన్ని చచ్చేంతలా ప్రేరేపించిన వారి మీద సినిమా చూస్తున్న వారికి కోపం తెప్పించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అంతలా కథలో లీనం చేస్తూ ముందుకు తీసుకు వెళ్లిన దర్శకుడు ఒక్కొక్క టాస్క్ ఆడిస్తూ మరింత కథ మీద సినిమా మీద ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని టాస్కుల వరకు బాగానే ఉంటుందిm కానీ తర్వాత టాస్కులు ఏమి జరుగుతున్నాయి అనే విషయం మీద కూడా క్లారిటీ మిస్ అయినట్లు అనిపించింది. ఈ గేమ్ ఆడించేది ఎవరు? గేమ్ ఆడించడానికి కారణం ఏమిటి? అంత డబ్బులు ఈ గేమ్ లో ఎందుకు ఇస్తున్నారు? లాంటి విషయాలను ఆసక్తికరంగా కన్విన్సింగ్ గా చూపించారు. అయితే అటెంప్ట్ కొత్తగా అనిపించినా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా వర్క్ చేసి ఉండాల్సింది.
నటీనటులు : గీతానంద్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. మెచ్యూర్డ్ యాక్టింగ్ తో పాటు, యాక్షన్ సీన్స్ ఇరగదీసాడు. ఆత్మహత్య ఆలోచనకు ముందు గేమ్ ఆన్ అయిన తర్వాత రెండు విభిన్నమైన షేడ్స్ ను బాగా పలికించాడు. హీరోయిన్ నేహా సోలంకి అటు గ్లామర్ ఒలకబోస్తూనే తన పాత్రలో నటనను కూడా మిస్ అవ్వకుండా చూసుకుంది. వాసంతి పాత్ర చిన్నది అయినా ఆమె కూడా గ్లామర్ డాల్ లాగా అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆదిత్య మీనన్ విలన్ గా డామినేటింగ్ క్యారెక్టర్ లో కనిపించాడు. తనదైన టిపికల్ వాయిస్ తో ఆకట్టుకున్నాడు. శుభలేఖ సుధాకర్, మధుబాల వంటి వాళ్ళ అనుభవం స్క్రీన్ మీద కనిపించింది. ఇక టెక్నికల్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి యాప్ట్ అనిపించింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి, ఆ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు అనిపించింది.
బోటమ్ లైన్ : థ్రిల్ ఇచ్చే “గేమ్ ఆన్ “
రేటింగ్ : 2.5/5