కృష్ణానగర్‌ కష్టాలు మామూలుగా ఉండవు. ఎన్నో, ఎన్నెన్నిటినో దాటుకుంటేనే రంగుల జీవితం కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ దాటుకునే క్రమంలో వచ్చే కష్టాలను ఓర్చుకునేవాళ్లు కొందరు. ఓదార్చేవాళ్లు లేక బలవంతంగా ప్రాణాలు తీసుకునేవారు ఇంకొందరు. ఈ మధ్య కాలంలో కృష్ణానగర్‌ ఆకలి కష్టాలు పెద్దగా కనిపించడం లేదు. చేసుకోవడానికి ఏదో ఒక పని జనాలకు ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక పనిచేసుకుని బతుకుతున్న వాళ్లు చాలా మందే కనిపిస్తున్నారు. అలాంటి వాళ్లను దాటుకుని సాయికుమార్‌లాంటి వాళ్లు అప్పుడప్పుడూ కలవరపెడుతున్నారు.

పూరి జగన్నాథ్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు సాయికుమార్‌. అసిస్టెంట్‌ డైరక్టర్లంటే అందరికీ ఒకే రకమైన జీతాలుండవు. ఎన్ని సినిమాలకు పనిచేశారనేదాన్నిబట్టి అక్కడ జీతాలను నిర్ణయిస్తారు. బొటాబొటి జీతాలతో ఇక్కడ ఉండాలి, అవసరాలు తీర్చుకోవాలి. ఇంటికి పంపించుకోవాలి… అందరికీ ఇవన్నీ కుదరని పని. అందుకే అప్పులు అవుతుంటాయి. సాయికుమార్‌ని కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. గట్టిగా అడగడానికి ఎవరూ లేని పరిస్థితి. అందుకే జీవితం మీద విరక్తి చెంది దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

చాలా సినిమాల్లో చనిపోయే వారిని కాల్చే చెరువు తీరం సన్నివేశాలను చూసే ఉంటాం. వాటిలో చాలా వరకు దుర్గం చెరువులో తెరకెక్కించినవే. డైరక్టర్‌ అయి దుర్గం చెరువు పరిసరాల్లో సినిమాలు తీయాల్సిన వాడు, ఇలా దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కృష్ణానగర్‌లో చాలా మంది పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.కృష్ణానగరే మామా అంటూ తన సినిమాలోనే పాట పెట్టిన పూరి జగన్నాథ్‌ కూడా లైఫ్‌లో ఫెయిల్యూర్లను తట్టుకున్నవాడే. తిరిగి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నవాడే. సినిమాల్లో జయాపజయాలు తప్పవు. ఈసెంట్‌గా రిలీజైన పూరి లైగర్‌ కూడా పెద్దగా ఆడలేదు. అయినా, రేపటి రోజు బావుంటుందనే ఆశతో ముందుకు నడవాలి. అలాంటి మానసిక స్థైర్యం ఉన్నవాళ్లు, ఓపిగ్గా వెయిట్‌ చేయగలిగిన వాళ్లే ఇక్కడ సక్సెస్‌ని చూడగలుగుతారని అంటున్నవాళ్లూ లేకపోలేదు.

, , , , ,