రివ్యూ : నేనే వస్తున్నా
తారాగణం : ధనుష్‌, ఎల్లి అవ్రమ్, ఇందూజ, ప్రభు, యోగిబాబు తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా
ఎడిటర్ : భువన్ శ్రీనివాసన్
సినిమాటోగ్రఫీ : ఓమ్ ప్రకాష్‌
నిర్మాత : కలైపులి ఎస్ థాను
దర్శకత్వం : సెల్వ రాఘవన్

కొన్ని సినిమాల టీజర్స్ లేదా ట్రైలర్స్ చూడగానే మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తాయి. మరికొన్ని అంత వరకే బావుండి సినిమాగా మాత్రం నిరాశపరుస్తాయి. ఇంకొన్ని సినిమాలు ప్రమోషన్స్ లో కనిపించిన వాటికి భిన్నమైన కంటెంట్ తో ఉంటాయి. అలాంటి సినిమానే నేనే వస్తున్నా. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్‌ డ్యూయొల్ రోల్ లో నటించిన ఈ మూవీ ఈ గురువారం విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో బ్రీఫ్ గా చూద్దాం.

కథ :
ఇమేజ్ తో సంబంధం లేకుండా మంచి కథ అనిపిస్తే చాలు.. అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటాడు ధనుష్‌. ఇది కూడా అలాంటి కథే. ఇద్దరు ట్విన్స్. ఒకడు చిన్నప్పటి నుంచి సైకోలా ఉంటాడు. మరొకడు మంచి వాడు. తండ్రి మందలించాడని అతన్ని చంపేస్తాడు సైకిక్ గా ప్రవర్తించే బాలుడు కదిర్ అనే పెద్ద కొడుకు. అతనితో ఉంటే తమను కూడా చంపేస్తాడని తెలుసుకుని ఒక ఊరిలో వదిలి వెళ్లిపోతారు తల్లి, తమ్ముడు. అలా వెళ్లిన తమ్ముడు పెద్ద వాడై పెళ్లి చేసుకుంటాడు. ఓ కూతురు కూడా పుడుతుంది. ఆ పాపంటే అతనికి ప్రాణం. ఓ వెకేషన్ కు వెళ్లి వచ్చిన తర్వాత అతని కూతురు అబ్ నార్మల్ గా ప్రవర్తిస్తుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఓ హత్య చేయాలని తండ్రిని కోరుతుంది కూతురు. తనెందుకు అలా చెప్పింది..? అతని కూతురుకు నిజంగానే దెయ్యం పట్టిందా.. పడితే ఎవరు.. అనేది మిగతా కథ.

విశ్లేషణ :
నేనే వస్తున్నా మూవీ టీజర్, సాంగ్స్ చూసినప్పుడు ఓ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అనుకున్నారు. అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుందీ చిత్రం. పూర్తిగా ఓ కుటుంబ కథా చిత్రం. అందుకు తగ్గట్టుగానే అత్యంత సాధారణంగా మొదలవుతుంది సినిమా. ఓ అరగంట తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అతని కూతురు సడెన్ గా మారిపోతుంది. అబ్ నార్మల్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్న వారికి కూడా భయాన్ని కలిగిస్తాయి. ఓ కామన్ మేన్ అయిన తండ్రి సైతం భయపడుతూనే కూతురును బాగు చేయడానికి తన ప్రయత్నాలేవో తను చేస్తుంటాడు. ఇదంతా చూస్తున్నప్పుడు.. అసలు ధనుష్ లాంటి స్టార్ తో పనిలేని కథ ఇది అనిపిస్తుంది. అయినా ఫస్ట్ హాఫ్‌ అంతా అక్కడక్కడా భయపెడుతూ ఓ ఎగ్జైట్మెంట్ తో సాగుతుంది. ఓ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది కూడా. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది.
ఇక సెకండ్ హాఫ్‌ తర్వాత మరో కథ మొదలవుతుంది.. ఓ రకంగా ఫస్ట్ హాఫ్ అంతా తమ్ముడి కథైతే.. సెకండ్ హాఫ్‌ మొత్తం సైకో అయిన అన్న కథ. చిన్నప్పుడే వదిలేసిన అన్న మళ్లీ అతని లైఫ్ లోకి ఎలా వచ్చాడన్న ప్రశ్నకు సమాధానంగానే ఫస్ట్ హాఫ్‌ కనిపిస్తుంది. చివర్లో అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నా.. అప్పటికే మంచి థ్రిల్లర్ మూవీని చూపిస్తాడు దర్శకుడు. అంటే రెండు కథలుగా కనిపించే సినిమా ఇది. ఇద్దరు భిన్నమైన వ్యక్తిత్వాలున్న అన్నదమ్ముల కథ. కొంత వరకూ ఊహించగలిగినా.. చాలా వరకూ ఎంగేజింగ్ గానే సాగుతుందీ సినిమా.


ఇక తనలోని సైకోను దాచి ఫ్యామిలీ మేన్ గా కనిపిస్తూనే తనదైన బుద్ధిని వదులుకోని పాత్రలో అదరగొట్టాడు ధనుష్‌. ఇటు తమ్ముడు పాత్రలో అమాయకత్వాన్ని నిస్సహాయతను అద్భుతంగా ప్రదర్శించాడు. సాధారణంగా కనిపించే ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ లో నిలబెట్టింది ధనుష్. అలాంటి బలమైన నటుడు లేకపోతే ఇలాంటి సినిమాలు తేలిపోతాయి. లేదా యావరేజ్ గా మిగిలిపోతాయి. అతని కూతురు పాత్రలో నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. తన చుట్టేఈ సినిమా అంతా జరుగుతుంది.
ధనుష్ తర్వాత పాపకు మాత్రమే నటించేందుకు స్కోప్ ఉంది. సెకండ్ హాఫ్ లో కనిపించే ఫ్యామిలీకీ నటించే ఛాన్స్ దొరికింది. చాలా లిమిటెడ్ పాత్రలతో అన్ లిమిటెడ్ సస్పెన్స్, థ్రిల్లర్ ను పంచాడు దర్శకుడు. కేవలం రెండు పాటలతోనే ఈ ఇద్దరి కథలనూ చెప్పేయడం చాలా బావుంది. ఏ మాత్రం ఓవర్ డ్రామా లేకుండా.. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉండేలా చూసుకోవడం మరో ఎసెట్. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు.. సెకండ్ హాఫ్‌ ను ఎక్స్ పెక్ట్ చేసినా.. అందులోనూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.


టెక్నికల్ గానూ బ్రిలియంట్ గా కనిపిస్తుందీ చిత్రం. సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా కథ, మూడ్ కు తగ్గ లైటింగ్ మెస్మరైజ్ చేస్తుంది. యువన్ శంకర్ రాజా పాటలతో పాటు రెండో పాత్రకు ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బావుంది. ఎడిటింగ్ పరంగానూ పెద్ద లొసుగులేం కనిపించవు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.
సెల్వ రాఘవన్ ఓ చిన్న కథకు తనదైన ట్రీట్మెంట్ ను జోడిస్తే.. ఆ చిన్న కథను తన అద్భుత నటనతో మరో మెట్టుపైని నిలబెట్టాడు ధనుష్. ధనుష్‌ ఇమేజ్ ను మైండ్ నుంచి తీసి వేసి వెళితే ఈ సినిమా మెప్పిస్తుంది. దెయ్యం విషయంలో మాత్రం దర్శకుడు సెల్వ రాఘవన్ షాక్ ఇచ్చాడు. ఆ పాత్రలను ఊహించడం కష్టమేం కాకపోయినా అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. దీంతో ఈ చిత్రం ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా మారింది. బట్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవచ్చు. వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం డిజప్పాయింట్ చేయదు.

ఫైనల్ గా : నేనే వస్తున్నా.. ధనుష్‌ వర్సెస్ ధనుష్‌..

రేటింగ్ : 2.75/5

                - యశ్వంత్ బాబు. కె
, , , , , , , , , ,