వన్ డేలో నడిచే కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా.. గ్రిప్పింగ్ వుంటే ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అందులోనూ క్రైం బేస్ కథలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అందుకే దర్శకులు, నిర్మాతలు ఇలాంటి కథల్ని ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా స్టాక్ మార్కెట్ కుంభకోణం నేపథ్యంలో 12 గంటల్లో జరిగే కథని నచ్చింది గర్ల్ ఫ్రెండూ… పేరుతో తెరకెక్కించారు. ఇందులో ఆటగదరా, మిస్ మ్యాచ్ సినిమాలతో మంచి నటుడిగా మెప్పించిన ఉదయ్ శంకర్… ఇప్పడు నచ్చింది గర్ల్ ఫ్రెండూ.. అంటూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.

కథ: రాజా (ఉదయ్ శంకర్) బీకామ్‌తోనే చదువు ఆపేసి… షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు. అలాంటి రాజా శాండీ (జెన్నీఫర్) ఫోటోను చూసి ప్రేమలో పడతాడు. ఫోటోను చూసిన అదే రోజు శాండీని రాజా కలుస్తాడు. ఇక అదే రోజు శాండీ పుట్టిన రోజు కూడా. అయితే శాండీకి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఓ సందేశం వస్తుంది. నువ్ ఎవరితో మాట్లాడితే వారిని చంపేస్తాను అంటూ ఓ సందేశం వస్తుంది. కానీ శాండీ ఎవరితో మాట్లాడుతూ ఉన్నా.. వాళ్లు చనిపోతుంటారు. అలా చివరకు రాజా కూడా శాండీతో మాట్లాడుతాడు. శాండీ సైతం ప్రేమించినట్టుగా నటిస్తుంది. చివరకు రాహుల్ అనే వ్యక్తి శాండీ జీవితంలో ఉన్నాడని రాజాకు తెలుస్తుంది? అసలు శాండీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? శాండీతో మాట్లాడిన వాళ్లని చంపే వ్యక్తి ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 కథ.. కథనం విశ్లేషణ: నచ్చింది గాళ్‌ఫ్రెండూ అనే టైటిల్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. టైటిల్ చూసి ఈ కథను మాత్రం కచ్చితంగా గెస్ చేయలేరు. ఈ సినిమాలో ప్రథమార్థం అంతా అలా సోసోగా నడుస్తూ వెళ్తుంది. అసలేం జరుగుతోంది? ఎవరు ఈ మర్డర్లు చేస్తున్నారనేది రివీల్ చేయరు. ఇంటర్వెల్ వరకు కాస్త సస్పెన్స్ వీడుతుంది. అప్పటి వరకు రొటీన్ లవ్ సీన్స్‌తో సినిమా నడిచినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రథమార్థం ముగిసి.. సెకండాఫ్‌లోకి సినిమా అడుగు పెడుతుందో అసలు కథ మెల్లిమెల్లిగా రివీల్ అవుతుంది. దీంతో క్లైమాక్స్ వరకు సినిమా ఉత్కంఠగా సాగుతుంది.

షేర్ మార్కెట్ల మీద జరిగే మోసాలు, మధ్య తరగతి వాళ్ల మీద ఉండే ప్రభావం, ఎక్కడో యుద్దం జరిగితే.. భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, లక్షల కోట్లు నష్టపోవడం వంటి అంశాల మీద ఈ సినిమా పాయింట్‌ను రాసుకున్నాడు. ఇప్పుడు అందరూ కూడా ఆన్ లైన్ ట్రేడింగ్ మీద ఫోకస్ పెట్టడంతో ఈ పాయింట్ అందరికీ ఈజీగా చేరుతుంది. ఇలాంటి కథ, కథనం రాసుకున్నప్పుడు మరింత గ్రిప్పింగ్‌గా స్టోరీని చెప్పి ఉంటే వేరే స్థాయిలో ఉండేది. దర్శకుడు తాను అనుకున్నది చెప్పేందుకు తన వంతుగా బాగానే కష్టపడ్డాడు.
నచ్చింది గాళ్‌ఫ్రెండూ సినిమా అంతా కూడా ఉదయ్ శంకర్, జెన్నీఫర్ చుట్టే తిరుగుతుంటుంది. పనీపాట లేని అల్లరి చిల్లరగా తిరిగే రాజా పాత్రలో ఉదయ్ శంకర్ మెప్పించాడు. కానీ చివర్లో ఉదయ్ శంకర్ డైలాగ్స్, స్పీచులు, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఆశ్చర్యపరుస్తాయి. ఇక మొదటి సినిమా కావడంతో జెన్నీఫర్ అందాలను విపరీతంగా ప్రదర్శించేసింది. కుర్రాళ్లకు జెన్నీఫర్ బాగానే నచ్చేస్తుంది. మధు నందన్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, విలన్, సుమన్ ఇలా అందరూ కూడా మెప్పించారు. మధ్యలో వచ్చిన కమెడియన్ పృథ్వీ పేటీఎం ప్రసాద్‌గా నవ్వులు పూయిస్తాడు.

ఈ చిత్రానికి పాటలు ప్లస్ అవుతాయి. ప్రతీ పాట, బీటు ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. ఇక మాటలు అక్కడక్కడా పేలినట్టుగా అనిపిస్తాయి. కెమెరాపనితనం బాగుంది. ఒకే రోజులో జరిగే కథ కావడంతో వైజాగ్‌లోని వీలైనన్ని అందాలన్నీ చూపించేశారు. ఇక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ పని మాత్రం బ్యాలెన్స్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని సిల్లీ సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తోంది. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా వున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారు. ఈవారం సరదాగ చూసేయండి.

రేటింగ్‌: 2.75/5

, , ,