‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’ చిత్రం అక్టోబర్‌28 నుండి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసి ఆ సినిమా గురించి తప్పనిసరిగా మాట్లాడాలి అనుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కృష్ణ మాట్లాడుతూ– నరేశ్, అలీలు హీరోలుగా వచ్చిన ‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’ చిత్రాన్ని నిన్నరాత్రి చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో నాకెంతో నచ్చిన చిత్రం ఈ సినిమా. దర్శకుడు శ్రీపురం కిరణ్‌ ఒక మలయాళ సినిమాని తీసుకుని తెలుగు ప్రేక్షకులకు ఎలా నచ్చుతుందో అలా మార్పులు, చేర్పులు చేసి తీశారు. ఈ సినిమాలోని నరేశ్‌ పాత్ర ఎంతో కీలకం, ఆ పాత్ర చేయటం చాలా కష్టం. మాటల్లేని మూగవాడి పాత్రలో నరేశ్‌ నిజంగా జీవించాడనే చెప్పాలి. నరేశ్‌ నటునిగా ఎంతో పరిణితి చెందాడు అనిపించింది.

నరేశ్‌ భార్యగా చేసిన పవిత్రలోకేశ్‌ పాత్ర కూడా ఎంతో హోమ్‌లీగా చూడటానికి అందంగా బావుంది. అలీ ఈ సినిమాలో ఎంతోచక్కగా నటించటంతో, డాన్స్‌లు కూడా చేశాడు. అలీ హీరోగా నటించిన ‘యమలీల’ సినిమాలో నేను డాన్స్‌ చేసిన ‘‘జుంబారో జజ్జుంబరో…’’పాట ఇప్పటికి నా అభిమానులకు ఎంతో ఇష్టమైన పాట. ఈ సినిమాద్వారా ఆలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను స్థాపించి ఇంతమంచి సినిమా తీయటం ఆనందం అనిపించింది. ఇకముందుకూడా అలీ మంచి సినిమాలు తీస్తాడని అనుకుంటున్నా అన్నారు. తర్వాత అలీని శాలువాతో సత్కరించి బోకేను అందచేశారు కృష్ణ. అనంతరం అలీ మాట్లాడుతూ– నా జీవితాన్ని మార్చిన ‘‘యమలీల’’ చిత్రంలో సూపర్‌హిట్‌ సాంగ్‌లో నటించి నాకు ఎంతో గొప్ప జీవితాన్ని ఇచ్చారు కృష్ణగారు.

కృష్ణగారి చేత్తో క్లాప్‌ కొట్టారంటే ఆ సినిమా వందరోజులే అని ఇండస్ట్రీలో టాక్‌ ఉండేది. ఆయన మంచిచేత్తో ‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’ సినిమా ప్రమోషన్‌ను ఏడాది క్రితం కృష్ణగారితోనే ప్రారంభించాను. ఆయన మనసు, చెయ్యి రెండు బంగారమే. అందుకే ఆహాలో విడుదలైన మా సినిమాకు ప్రేక్షకులనుండి, ఎన్నో ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. నరేశ్‌గారు షూటింగ్‌లో ఉండటంతో ఆయన రాలేకపోయారు. ఈ సినిమాలోని మా ఇద్దరి నటన, దర్శకుడు కిరణ్‌ టాలెంట్‌ కృష్ణగారికి నచ్చటం మా అదృష్టంగా బావిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు కిరణ్‌ మాట్లాడుతూ–‘‘ ఆయన సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని. నా దర్శకత్వంలో వచ్చిన సినిమాని ఆయన మెచ్చుకోవటం అంటే నాకు అంతకు మించిన పెద్ద అవార్డు ఏమి లేదనే చెప్పాలి’’ అన్నారు.

, , , , , ,