మొన్న లైగర్.. ఇప్పుడు ఏజెంట్.. సేమ్ టూ సేమ్

ఏదైనా అతి చేస్తున్నారు అంటే అందులో ఏదో తేడా ఉంది అని తెలుగు సినిమా జనాలకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ విషయం ఇండస్ట్రీ వారికీ తెలుసు. ఇలా తెలిసిన విషయాన్నే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా డౌట్స్ పెరుగుతాయి. గతంలో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ విషయంలో ఎంత హైప్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే.

అందుకు ప్రధాన కారణం అంతకు ముందే పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఉన్నాడు. ఇటు విజయ్ లుక్, గెటప్, సిక్స్ ప్యాక్ తో పాటు మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కావడం.. సాలా క్రాస్ బ్రీడ్ అనే మాటను పదే పదే వాడుతూ మధ్యలో మైక్ టైసన్ కూడా ఉన్నాడు అని చెప్పారు. ఇంకేముందీ అంచనాలు ఆకాశాన్నంటాయి. భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనేలా రిలీజ్ కు ముందే బుకింగ్స్ కూడా అయిపోయాయి. కట్ చేస్తే మొదటి ఆటకే లైగర్ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. ఆకాశంలో ఉన్న అంచనాలు ఆ తర్వాతి షో కే నేలకు దిగాయి. ఓవరాల్ గా ఈ మూవీ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో చేరింది.


లైగర్ అంత అతి చేయలేదు కానీ.. ఏజెంట్ కూడా ప్రమోషన్స్ పేరుతో ఒళ్లంతా తాళ్లు కట్టుకుని పెద్ద బిల్డింగ్ మీద నుంచి సురక్షితంగా కిందికి దిగి.. తానేదో రియల్ స్టంట్ చేశాననే బిల్డప్ ఇచ్చి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అక్కినేని అఖిల్. మామూలుగా ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు పెద్ద అంచనాలు లేవు. కానీ ప్రమోషన్స్ లో వాళ్లు చేసిన హడావిడీ చూసి ఏదో ఉండే ఉంటుంది అనే సందేహం వచ్చింది. అందుకే ఆ మాత్రం బుకింగ్స్ వచ్చాయి.

అటు అఖిల్ తో పాటు మొత్తం టీమ్.. తామేదో జేమ్స్ బాండ్ రేంజ్ సినిమా చేశాం అనేలా బిల్డప్స్ ఇచ్చారు. కట్ చేస్తే వీరికీ లైగర్ టైప్ రిజల్టే వచ్చింది. థియేటర్ లో జనాలు హాహాకారాలు పెట్టారు. ఆ బుల్లెట్లు ప్రేక్షకులనే తాకినట్టు ఫీలైపోయి తట్టుకోలేకపోయారు. నిజానికి విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్ లో ఉంటుందనే తెలుగు సినిమా సామెత మరోసారి ప్రూవ్ అయింది. ఏదేమైనా అప్పుడు లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ అన్నా.. ఇప్పుడు ఏజెంట్ వైల్డ్ సాలా అన్నా .. జనాలు చాల్లే మీ గోలా అనేశారు. అదీ ఒక్క షోతోనే.

Related Posts