దానయ్యకు లేని దురద దారినపోయేవారికి ఎందుకో ..?

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. అంతకు ముందు మరో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ కూడా వచ్చింది. ఈ రెండు అంశాల్లోనూ నిర్మాత డివివి దానయ్య ప్రస్తావన, పేరు, ఊసూ లేదు. అంతా తానే అయ్యి నడిపించాడు రాజమౌళి. ఆ వెనకే కీరవాణితో పాటు వారి ఫ్యామిలీ మొత్తం ప్రపంచ వేదికలపై సందడి చేయడం అప్పటి నుంచే మొదలుపెట్టింది. అయితే గోల్డెన్ గ్లోబ్ టైమ్ నుంచీ చాలామంది.. వేరీజ్ దానయ్య అంటూ ప్రశ్నల పరంపర మొదలుపెట్టారు.

ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ టైమ్ లోకూడా ఆయన లేడు. లేదూ ఆయన్ని పిలవలేదో. కానీ ఈ చిత్రానికి నిర్మాత అనే టైటిల్ కింద పేరున్న దానయ్య మాత్రం ఈ క్రెడిట్ లో భాగస్వామి కాలేకపోయాడు. అయితే ఇందుకు కారణాలు ఏంటీ అనేది దానయ్య – రాజమౌళికి మాత్రమే తెలుసు. అది పట్టించుకోకుండా చాలామంది కావాలనే దానయ్యను తొక్కేస్తున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. నిజానికి దీనిలో అర్థం లేదు. ఎందుకంటే ఈ మూవీ ప్రమోషన్స్ అయినా.. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కోసమైనా చాలా భారీగానే ఖర్చు చేశారు. ఆస్కార్ వరకూ వెళ్లే ఏ అంతర్జాతీయ చిత్రానికైనా ఈ ఖర్చు ఉంటుంది.

కానీ అదేదో మనవాళ్లే పెట్టారు అన్నట్టుగా కొంతమంది కలరింగ్ ఇస్తున్నారు. బట్ అది నిజం కాదు. ఒక సినిమా ఆస్కార్ బరిలో నిలిచి గెలవాలంటే ప్రేక్షకుల అభిప్రాయం కోసం ‘ఉచిత రవాణా, ఆహారంతో కూడిని చిత్ర ప్రదర్శనల ఏర్పాటు’ అనేది అత్యంత కామన్. ఇది ఇండియాకే కాదు.. ఇండోనేషియా నుంచి వెళ్లిన సినిమాకూ తప్పదు. అలాంటిది కేవలం ఇండియన్ మూవీస్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే.. కేవలం సోషల్ మీడియాలో మనవాళ్లు చేసిన అత్యుత్సాహమే కారణం అని వేరే చెప్పక్కర్లేదు.


అయితే ఈ ఖర్చంతా దానయ్య పెట్టుకున్నాడు అని చెప్పడానికి ఎవరి దగ్గరా ఆధారం లేదు. అటు దానయ్య సైతం తన సొంత ఖర్చుతోనే వీరిని అక్కడి వరకూ పంపించాను అని చెప్పలేదు. ఇంకా చెబితే సినిమా రిలీజ్ కు ముందే దానయ్య – రాజమౌళి మధ్య ఒప్పందం పూర్తయింది అనేవాళ్లూ ఉన్నారు. అంటే బిజినెస్ అయ్యాక.. దానయ్యకు వెళ్లాల్సింది వెళ్లింది. ఇక ఆ తర్వాత అంతా రాజమౌళిదే బాధ్యత, లాభం అని వీరి మధ్య ఓ అగ్రిమెంట్ ఉందనేవాళ్లూ ఉన్నారు.

ఏదేమైనా ఆస్కార్ విషయంలో తన ప్రమేయం లేదు కాబట్టి దానయ్య పెద్దగా ఫీలవడం లేదు. ఫీలవడానికి కూడా పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఆ ఖర్చంతా రాజమౌళి అండ్ టీమ్ పెట్టుకుంది కాబట్టి. కాకపోతే చిత్ర నిర్మాతగా ఆయన పేరునూ అంతర్జాతీయ వేదికలపై ఉచ్చరించాల్సింది అని మాత్రం అనుకోవచ్చు. అంతే తప్ప.. ఈ సినిమా కోసం 500 కోట్లు ఖర్చుపెట్టాడు కాబట్టి దానయ్యదే క్రెడిట్ అంతా అంటే ఎలా..? ఏదేమైనా ఆస్కార్ విషయంలో దానయ్యకు లేని బాధ దారినపొయ్యేవారికి మాత్రం అవసరమా..?

Related Posts