రణ్‌బీర్ కలను బ్రహ్మాస్త్రం నెరవేరుస్తుందా..

బాలీవుడ్ కు అర్జెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ కావాలిప్పుడు. ఆ హిట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. ఏ ఒక్క సినిమా కూడా ఆ టాక్ ను తేలేకపోతోంది. గత నెలలో రణ్‌బీర్ కపూర్ షంషేరాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అది పోయింది. ఇప్పుడు మరోసారి రణ్‌బీర్ నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ సారి ష్యూర్ షాట్ అనేలా ఏకంగా బ్రహ్మాస్త్రంతో వస్తున్నాడు రణ్‌ బీర్. మరి ఈ అస్త్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందా..? బాలీవుడ్ కోరుకున్నట్టు బ్లాక్ బస్టర్.. రణ్‌బీర్ ఆశిస్తున్నట్టు ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ను తెస్తుందా..?బాహుబలి తర్వాత అన్నిపరిశ్రమలూ ఒక్కో ప్యాన్ ఇండియన్ స్టార్ ను తయారు చేసుకుంటున్నాయి. మన దగ్గర కాస్త ఎక్కువ మంది ఉన్నారు అది వేరే విషయం.

అయితే బాలీవుడ్ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఆ రేంజ్ లో ప్యాన్ ఇండియన్ స్టార్ రాలేదు. వస్తారు అనుకున్నవాళ్లంతా బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్స్ చూశారు. ఇక ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ వంతు వచ్చింది. షంషేరా మెప్పించలేకపోయినా.. బ్రహ్మాస్త్రం పనిచేస్తుందనే నమ్మకంతో వస్తున్నాడు. పైగా ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి అన్నీ తానై చూసుకుంటున్నాడు. తనే సమర్పకుడుగా మారాడు. తన సినిమాలకు సంబంధించి ఎన్నడూ వెళ్లని సుమ షో కు సైతం బ్రహ్మాస్త్రం కోసం వెళ్లాడు. అందుకు కారణం.. జక్కన్న ఆంధ్రలో ఈచిత్రాన్ని తనే రిలీజ్ చేస్తున్నాడు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. అయినా కంటెంట్ ఉన్న సినిమాను ఎంకరేజ్ చేస్తే తప్పేం లేదు కదా..?ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది బ్రహ్మాస్త్రం. ఇప్పటికే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.