‘భారతీయుడు 2’లో విజయ్ మాల్యా ఎపిసోడ్

‘కల్కి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేయబోతున్న మరో సౌత్ మూవీ ‘భారతీయుడు 2’. కమల్ హాసన్ – శంకర్ కలయికలో వస్తోన్న ఈ సినిమా తమిళంతో పాటు.. తెలుగు, హిందీలోనూ విడుదలకు ముస్తాబవుతోంది. జూలై 12న రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘భారతీయుడు 2’ నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా.. థర్డ్ సింగిల్ ‘క్యాలెండర్’ సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్.

1996లో ‘భారతీయుడు’ సినిమా వచ్చింది. ఇక.. ఈ సినిమా కథ అంతా 1996 నుంచి 2024 వరకూ జరిగిన అనేక వాస్తవిక సంఘటల ఆధారంగా తెరకెక్కిందని ఇటీవల డైరెక్టర్ శంకర్ తెలిపాడు. లేటెస్ట్ గా రిలీజైన ‘క్యాలెండర్’ సాంగ్ చూస్తుంటే.. విజయ మాల్యా ఎపిసోడ్ గుర్తుకొస్తుంది. భారతదేశంలో ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటూ యు.కె. లో ఉంటోన్న విజయ్ మాల్యా గతంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను తీసుకొచ్చేవాడు. అందుకోసం.. మోడల్స్ తో ఫోటో షూట్స్ ను నిర్వహించేవాడు. ఆ ఎపిసోడ్ నే ‘భారతీయుడు 2’లో శంకర్ తీర్చిదిద్దినట్టు ఈ పాటను చూస్తే అర్థమవుతోంది. అనిరుధ్ స్వరకల్పనలో చంద్రబోస్ రాసిన ఈ పాటను శ్రావణ భార్గవ ఆలపించింది. ఈ పాట ఆద్యంతం శంకర్ స్టైల్ లో లావిష్ గా ఆకట్టుకుంటుంది.

Related Posts